UPI Lost Phone Recovery: యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:18 PM
యూపీఐలోని మెసేజింగ్ ఫీచర్ కారణంగా ఓ వ్యక్తి పోగొట్టుకున్న ఫోను తిరిగొచ్చింది. యూపీఐ వల్లే ఇది సాధ్యమైందంటూ అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ ప్రస్తుతం నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. కేవలం డబ్బులు చెల్లించడమే కాకుండా దీని ద్వారా మెసేజీలు కూడా పంపించొచ్చు. ఇదే సౌలభ్యం ఓ జంటకు పోయిన ఫోన్ తిరిగొచ్చేలా చేసింది. రెడిట్‌లో షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. ఓ ఆటో డ్రైవర్ గొప్పదనం, యూపీఐ మెసేజింగ్ ఫీచర్ వల్ల పోయిన ఫోన్ తిరిగొచ్చిందని సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు (Lost Phone Found UPI Miracle).
తన భార్య పోగొట్టుకున్న ఫోన్ యూపీఐ వల్ల తిరిగొచ్చిందని సదరు వ్యక్తి చెప్పారు. ఇదో అద్భుతమని కూడా వ్యాఖ్యానించారు. ‘మేము ఆటోలో ఫోను మర్చిపోయాము. అప్పటికి ఆ ఫోన్‌లో సిమ్ కార్డు కూడా లేదు. దీంతో, ఆ నెంబర్‌కు కాల్ చేసే అవకాశం కూడా లేదు. ఆ ఫోన్ నా భార్యది. మొదట్లో ఎవరో ఎత్తుకెళ్లి ఉంటారని అనుకున్నాము. ఆ తరువాత ఆమె ఆటోలో మర్చిపోయి ఉంటుందని అనిపించింది. ఆటో డ్రైవర్‌కు యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించాము. దీంతో, పేమెంట్ రిసీట్‌ను చెక్ చేశాము. అందులో యూపీఐ ఐడీ మినహా ఫోన్ నెంబర్ లేదు. దీంతో, మాకు ఏం చేయాలో పాలుపోలేదు. ఫోన్ పోయినట్టే అని అనుకున్నాము’ (UPI Phone Recovery)

‘ఈ లోపు మా అకౌంట్‌లో ఒక రూపాయి యూపీఐ ద్వారా క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఆ తరువాత ఆటో డ్రైవర్ మాకు యూపీఐ ద్వారా మెసేజ్ చేశాడు. ఫోన్ తన దగ్గర ఉందని అన్నాడు. తన కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేసి కాల్ చేయమని అడిగాడు. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నా సంబరం పీక్స్‌కు వెళ్లింది. ఆ తరువాత మేమున్న చోటుకు డ్రైవర్ వచ్చి ఫోన్ ఇచ్చి వేళ్లాడు. మేము సంతోషంగా అతడికి కొంత డబ్బు కూడా ఇచ్చాము. నా దృష్టిలో యూపీఐ వల్లే పోయిన ఫోన్ తిరిగొచ్చింది. అతడికి యూపీఐ ద్వారా కాకుండా నగదు రూపంలో డబ్బు ఇచ్చి ఉంటే ఏమై ఉండేదో’ అని అన్నాడు (UPI Viral Story).
ఇక ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తమకూ ఇలాంటి అనుభవాలు అనేకం ఎదురయ్యాయని జనాలు కామెంట్ చేశారు. మరికొందరు ఆటో డ్రైవర్‌ను ప్రశంసించారు. అతడు నిజాయతీపరుడంటూ కితాబునిచ్చారు. కొందరు ఆ జంటను అదృష్టవంతులని అన్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
మీరు ట్వీట్ చేయగలుగుతోంది భారతీయులు, చైనీయుల వల్లే.. ఎక్స్ మాజీ ఉద్యోగి
అమెరికాను వీడుతున్నా.. ఇకపై చేయాల్సింది ఇదే.. హెచ్-1బీ వీసాపై చైనా యువకుడి కామెంట్