H-1b Visa Hike Slammed: మీరు ట్వీట్ చేయగలుగుతోంది భారతీయులు, చైనీయుల వల్లే.. ఎక్స్ మాజీ ఉద్యోగి
ABN , Publish Date - Sep 23 , 2025 | 03:56 PM
ట్విట్టర్‌లో సంక్లిష్ఠ సమస్యలను భారతీయులు, చైనీయులు కలిసి పరిష్కరించారని ఎక్స్ మాజీ ఉద్యోగి ఎస్తర్ క్రాఫర్డ్ కామెంట్ చేశారు. వలస వ్యతిరేక కామెంట్స్ చేసే ముందు ఈ విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా ఫీజు పెంపునకు వ్యతిరేకంగా జనాలు తమ గళాలను వినిపించడం ప్రారంభించారు. అమెరికా ప్రభుత్వ వలస వ్యతిరేక విధానాలపై ట్విట్టర్ మాజీ ఉద్యోగి ఎస్తర్ క్రాఫర్డ్ తాజాగా విమర్శలు గుప్పించారు. హెచ్-1బీ వీసాలపై వచ్చిన భారతీయులు, చైనీయులు ట్విట్టర్‌లో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. నేడు మనం ట్వీట్ చేయగలుగుతున్నామంటే దానికి కారణం వారేనని కుండబద్దలు కొట్టారు (Esther Crawford H-1B criticism).
ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న సమయంలో ఎస్తర్ సంస్థలో ప్రాడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం డైరెక్టర్‌గా ఉన్నారు. ‘ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి వెళ్లాక కూడా వారు సంస్థలో కొనసాగారు. సుదీర్ఘ సమయం పాటు ఆఫీసులో ఉండేవారు. అమెరికన్లతో కలిసి వారు ట్విట్టర్‌కు సంబంధించి అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక సమస్యలను పరిష్కరించారు. వలసలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారు ఒక్క విషయం గుర్తుంచుకోండి.. మీరు ఈ రోజు ట్వీట్ చేయగలుగుతున్నారంటే దానికి వారే కారణం’ అని ఎక్స్ వేదికగా ఆమె పోస్టు పెట్టారు. ప్రస్తుతం అమెరికాలోని హెచ్-1బీ వీసాదారుల్లో 70 శాతం మంది భారతీయులన్న విషయం తెలిసిందే. చైనీయుల వాటా 12 శాతం (Indian engineers praised).
హెచ్-1బీ వీసా విధానానికి ఎలాన్ మస్క్ గతంలో మద్దతు ప్రకటించారు. ఈ వీసాల జోలికొస్తే యుద్ధానికి సిద్ధమని కూడా అన్నారు. ఆ తరువాత ట్రంప్‌తో స్నేహం తరువాత మస్క్ ధోరణిలో స్వల్ప మార్పు కనిపించింది. హెచ్-1బీ వీసా వ్యవస్థలో సంస్కరణలు అవసరమని ఆ తరువాత ప్రకటించారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా ఫీజు పెంపు విషయంలో మాత్రం ఆయన మౌనం వహించారు.
హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్షల రూపాయలకు పెంచడంతో ఈ పథకానికి దాదాపుగా ముగింపు పడినట్టే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు కీలక విధులను విదేశాలకు తరలించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే, ఔట్ సోర్సింగ్ జాబ్స్‌ను కూడా కట్టడి చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం హైర్ యాక్ట్ పేరిట కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. ఉద్యోగాలను విదేశాలకు తరలించే కంపెనీలపై భారీగా పన్ను విధించేలా ఈ ముసాయిదా బిల్లును రూపొందించారు.
ఇవి కూడా చదవండి:
అమెరికాను వీడుతున్నా.. ఇకపై చేయాల్సింది ఇదే.. హెచ్-1బీ వీసాపై చైనా యువకుడి కామెంట్
ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో బెడ్ షీట్‌ల చోరీ.. ప్రయాణికుల నిర్వాకం.. నెట్టింట వీడియో వైరల్