Kids Carry Python: వీళ్లు పిల్లలు కాదు బాబోయ్.. కొండచిలువను బొమ్మ అనుకున్నారా ఏంటి?
ABN , Publish Date - Jul 07 , 2025 | 07:11 PM
UP Children Carry 15-Feet Python: వేలెడంత పాము అల్లంత దూరంగా కనిపించినా దడుచుకుని పారిపోతారు ఎవరైనా. కానీ, ఈ పిల్లలు మాత్రం 15- అడుగుల కొండచిలువను ఆటబొమ్మను చేసిపడేశారు. దాన్ని రోడ్డుపై ఊరేగిస్తూ వాళ్లు చేసిన నిర్వాకం చూస్తే గుండె గుభేలుమనడం ఖాయం.
UP Python Viral Video: పాము పేరు వింటే వణికిపోతారు. ఇక ఎదురుపడితేనో.. నోట మాట రాదు. కొందరైతే కంగారుగా ఒక్క ఉదుటున పరుగులు పెట్టేస్తారు. మరికొందరు మాత్రం ధైర్యంగా పెద్ద పెద్ద విషపూరిత పాములతో విన్యాసాలు చేసేస్తుంటారు. అలాంటి దృశ్యాలు చూస్తుంటేనే ఒంట్లో గగుర్పాటు పుట్టక మానదు. అయితే, పాములు పట్టడంలో అనుభవం ఉన్నవారు కదా.. ఇలాంటి సాహసాలు వారికి పెద్ద కష్టమేం కాదులే అని సరిపెట్టుకుంటాం. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిట్టిపొట్టి పిల్లలు ఎవరూ ఊహించని విన్యాసమే చేశారు. ఏకంగా15- అడుగుల కొండచిలువను ఆటబొమ్మను చేసిపడేశారు. అంతేసి పాముని రోడ్డు వెంట ఊరేగిస్తూ వాళ్లు చేసిన ఘనకార్యం చూస్తే కూర్చున్న చోటు నుంచి అంతెత్తున ఎగిరిపడిపోతారు ఎవరైనా.
పెద్ద పెద్ద జంతువులు, మనుషులనే అమాంతం మింగేస్తుంది కొండచిలువ. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 15 అడుగుల భారీ ఇండియన్ రాక్ పైథాన్ ను.. ఓ పిల్లల గుంపు ఆటవస్తువును ఎత్తినట్టు ఎత్తి ప్రధాని రహదారి గుండా ఊరేగిస్తూ తీసుకెళ్లింది. బరువైన ఆ సరీసృపాన్ని బారుగా చేసి ఒకరివెంట ఒకరుగా ఈ పిల్ల గ్యాంగ్ అంతా క్యూలో రోడ్డు మీదుగా నడుచుకుంటూ వెళ్తుంటే.. కళ్లప్పగించి చూడటం చూసే వాళ్ల వంతయ్యింది. చాలామంది వాళ్ల చుట్టూ చేరి సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు.
స్థానిక సమాచారం ప్రకారం, ఈ పిల్లలు దాదాపు 3 కి.మీ. దూరం పాటు కొండచిలువను రోడ్డుపై మోసుకుంటూ వెళ్లారు. వాళ్లు వెళ్లినంతసేపు వెంట పెద్ద గుంపు ఫాలో అవుతూనే ఉంది. చివరగా వారంతా కలిసి కొండచిలువను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. కొండచిలువ గురించి స్థానిక అధికారులకు లేదా అటవీ శాఖకు సమాచారం ఇవ్వకుండానే ఇంత పనీ చేసేసింది పిల్ల సైన్యం. ఈ సంఘటన గురించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని అధికారులు ధృవీకరించారు.
వాస్తవానికి భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం, ఏ వన్యప్రాణినైనా వేటాడటం, పట్టుకోవడం, ఇబ్బంది పెట్టడం తీవ్ర నేరం కిందకు వస్తుంది. ఇందుకు మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు కనీసం రూ.25,000 జరిమానా విధిస్తారు.
ఇవి కూడా చదవండి..
పాపం.. అమ్మాయిలకు హెల్ప్ చేద్దామని హీరోలా వచ్చాడు.. చివరకు ఏమయ్యాడంటే..
మహిళా ఉద్యోగిని అసభ్యంగా టచ్ చేస్తున్న బాస్.. ఎస్బీఐ మేనేజర్ తీరు చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..