Restaurant Dine and Dash: లండన్‌లోని భారతీయ రెస్టారెంట్‌లో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:28 PM
ఇంగ్లండ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌కు వచ్చిన కొందరు కస్టమర్లు ఫుల్లుగా తిని బిల్లు కట్టకుండా పారిపోయిన ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యువకుల వివరాలు తెలిసిన వారు ముందుకు రావాలని రెస్టారెంట్ యాజమాన్యం స్థానికులకు విజ్ఞప్తి చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌లోని నార్తాంప్టన్‌లోగల ఓ భారతీయ రెస్టారెంట్‌లో తాజాగా అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్‌లో ఫుల్లుగా తిన్న కొందరు ఆ తరువాత బిల్లు చెల్లించకుండా పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆగస్టు 4న సాఫ్రన్ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, కొందరు యువకులు వచ్చి 193.03 పౌండ్స్ విలువైన రకరకాల భారతీయ ఫుడ్స్ తిన్నారు. ఆ తరువాత బిల్లు చెల్లించకుండా రెస్టారెంట్ నుంచి బయటకు పరుగు తీశారు. వారిని రెస్టారెంట్‌లోని వెయిటర్ వెంబడించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారు తొలుత రెస్టారెంట్ లోపలికి వస్తున్న వీడియో కూడా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
దాదాపు రూ.23 వేల రూపాయల (భారతీయ కరెన్సీలో చెప్పుకోవాలంటే..) ఫుడ్స్ తిన్న ఆ కుర్రాళ్లు బిల్లు చెల్లించకుండా పారిపోవడంతో రెస్టారెంట్ యాజమాన్యం షాక్‌కు లోనయ్యింది. ఆ యువకుల వీడియోలను నెట్టింట షేర్ చేయడమే కాకుండా వారి వివరాలు తెలిసిన వారు ముందుకు రావాలని కూడా విజ్ఞప్తి చేసింది.
‘స్థానిక వ్యాపార సంస్థలు అప్రమత్తం కండి. వీడియోలోని యువకులను మీరు ఎక్కడైనా చూసుంటే, వారి వివరాలు తెలిసుంటే వెంటనే మాకు తెలియజేయండి. లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఇలాంటి చర్యలను అస్సలు సహించకూడదు. సమాజంలో వీటికి స్థానం లేదు’ అని రెస్టారెంట్ వారు పోస్టు పెట్టారు.
మరోవైపు, ఈ ఘటనపై స్థానిక పోలీసులు కూడా దృష్టి సారించారు. విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఆ యువకులు వివరాలు తెలిసిన వారు ఎవరైనా వెంటనే ముందుకు రావాలని అన్నారు.
మరోవైపు, ఈ ఉదంతంపై నెట్టింట కూడా కలకలం రేగుతోంది. యువకుల తీరుపై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థోమత లేని వారు ఇంట్లో తినాలి కానీ ఇలా బయటకొచ్చి ఇతరులకు నష్టం కలిగించకూడదని అన్నారు. ఇలాంటి వాళ్లను పోలీసులు వీలైనంత త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
భారత్‌లోని ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్.. ఇక్కడి వారు ఎంత రిచ్ అంటే..
నాలుగు దశాబ్దాలుగా రోజూ 10 గంటల పాటు భిక్షాటన.. ఇతడి ఆస్తి ఎంతో తెలిస్తే..