Mobi Bubble Car: చిన్నారుల కోసం ప్రత్యేక కారును ఆవిష్కరించిన టయోటా! చూస్తే మతిపోవాల్సిందే!
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:27 PM
తల్లిదండ్రులు వెంట లేకున్నా చిన్నారులు ఎక్కడికైనా వెళ్లగలిగేలా ఓ సరికొత్త కారును టయోటా తాజాగా ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ కారు డిజైన్, ఫీచర్స్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక సాంకేతికతకు, కొత్త ఆలోచనలకు పర్యాయపదం జపాన్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రముఖ జపాన్ కంపెనీ టయోటా తాజాగా ఓ అద్భుత ఆవిష్కరణతో ముందుకొచ్చింది. పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ చిన్ని కారును జపాన్ మొబిలిటీ షో-2025 లో తాజాగా ఆవిష్కరించింది. కారు పేరు మోబీ బబుల్ కార్ (Toyota Mobi Bubble Car).
చిన్న పిల్లల కారు కదా పెద్ద విశేషాలు ఏముంటాయిలే అని అనుకుంటే మనం పొరబడినట్టే. పిల్లలను స్కూళ్లు, ట్యూషన్లు లేదా ఇతర ప్రాంతాలకు తల్లిదండ్రులు వెంట లేకున్నా తరలించేందుకు ఈ కారును టయోటా డిజైన్ చేసింది (japan Mobility Show 2025).
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే ఈ విద్యుత్ కారు చిన్నారులను స్వతంత్రంగా ఎక్కడికైనా తీసుకెళ్లగలదు. డ్రైవర్లు, తల్లిదండ్రులు, ఇతర పర్యవేక్షకులు వెంట ఉండాల్సిన అవసరమే లేదు. పదేళ్ల లోపు చిన్నారి ఒకరు కూర్చొనేందుకు వీలుగా చిన్న ఆకారంలో దీన్ని డిజైన్ చేశారు. కానీ భద్రతా ఫీచర్లు మాత్రం పెద్దల కార్లకు తీసిపోని రీతిలో ఏర్పాటు చేశారు (Unique Urban Transport).
చుట్టూరా పరిసరాలన్నీ స్పష్టంగా కనబడేలా ఈ కార్‌లో పలు దిశల్లో కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేశారు. దీంతో, చుట్టూ జరుగుతోందంతా ఈజీగా తెలుసుకోవచ్చు. అందరికీ రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ‘మొబిలిటీ ఫర్ ఆల్’ నినాదంతో టయోటా దీన్ని డిజైన్ చేసింది. కారులోపలి ఏఐ సాంకేతికత.. చిన్నారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి సందేహాలు తీరుస్తూ గమ్యస్థానాలకు చేరుస్తుంది.
ప్రస్తుతం ప్రయోగాత్మక కారు మోడల్‌ను మాత్రమే ప్రజల ముందుకు తెచ్చారు. వాణిజ్య స్థాయిలో విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రం నగర రవాణా వ్యవస్థలో ఓ విప్లవంగా నిలుస్తుందని నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
అమెరికాలో ఎమ్ఎస్.. 2 ఎల్‌పీఏ శాలరీతో తొలి జాబ్! చివరకు..
ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. విమానం నుంచి కిందకు చూస్తే..