Delhi Pollution Viral Video: ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. విమానం నుంచి కిందకు చూస్తే..
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:35 PM
ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమానంలో వెళుతూ ఢిల్లీ గగనతలాన్ని ఓ ప్రయాణికుడు ఫోన్ కెమెరాతో రికార్డు చేసి నెట్టింట పెట్టాడు. దీన్ని చూసి జనాలు షాకయిపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ వాయు కాలుష్యం స్థానికులకు చుక్కలు చూపిస్తోంది. అయితే, పరిస్థితి ఎంతలా దిగజారిందో కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఢిల్లీ గగనతలాన్ని కెమెరాలో రికార్డు చేసి ఫుటేజీని నెట్టింట పంచుకున్నాడు.
లక్ష్య అరోరా అనే వ్యక్తి ఇన్‌స్టాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఆస్ట్రియా నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన తనకు రెండు ప్రాంతాల్లో గాలి నాణ్యతను పోల్చి చూస్తే ఆశ్చర్యం కలిగిందని అన్నారు. ఆస్ట్రియాలోని వియన్నా గగనతలాన్ని, ఆ తరువాత ఢిల్లీ పరిస్థితులను తన కెమెరాతో రికార్డు చేసినట్టు తెలిపారు (Delhi Air Pollution Viral Flight Video).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వియన్నాలో వాయు కాలుష్యం అసలు లేనే లేదు. దీంతో, విమానం నుంచి కెమెరాతో రికార్డు చేస్తుంటే కింద నగరం అందాలన్నీ స్పష్టంగా రికార్డు అయ్యాయి. పచ్చదనం మొత్తం కెమెరా కంటికి చిక్కింది. అధిక రిజల్యూషన్‌లో వీడియో తీసినట్టు అనిపించింది. ఇక వీడియో రెండో భాగంలో ఢిల్లీ గగనతలాన్ని చూపించారు. ఢిల్లీ గాల్లో కాలుష్యం విపరీతంగా పెరగడంతో విమానంలో నుంచి అంతా మసకగా కనిపించింది. కింద ఉన్న నగర పరిసరాలను కెమెరా అస్సలు రికార్డు చేయలేకపోయింది. అంతా దుమ్మూధూళీ మాత్రమే కనిపించింది.
ఢిల్లీ పరిసరాలేమో 90ల నాటి కెమెరా ఫుటేజీని గుర్తు చేస్తే వియన్నా మాత్రం 8కే రిజల్యూషన్‌తో రికార్డు చేసినట్టు ఉందని సదరు నెటిజన్ కామెంట్ చేశారు. ఒకే ఫోనుతో రెండు దృశ్యాలను రికార్డు చేసినా ఫుటేజీ మాత్రం అసలు పోలికే లేనట్టు ఉందని అన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయికి దిగజారిందో ఈ వీడియోను చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చని కామెంట్ చేశాడు
ఇక ఈ వీడియోను చూసి సోషల్ మీడియా జనాలు కూడా షాకయిపోతున్నారు. ఢిల్లీ వాసులు పీల్చే గాల్లో ఇంతటి కాలుష్యం ఉందా!? అంటూ నోరెళ్లబెట్టారు. కాలుష్యం బాగా పెరగడంతో ఇటీవల కాలంలో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 400 మార్కు దాటిన విషయం తెలిసిందే. వీడియో వారం క్రితం రికార్డు చేసినా తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇది మరోసారి వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి:
వణికిస్తున్న కాలుష్యం.. ఢిల్లీకి వెళ్లే విమానం దాదాపుగా ఖాళీ!
టాక్సీ బుకింగ్.. జర్మనీ టూరిస్టులకు గోవాలో ఇక్కట్లు