Share News

అమ్మో... బొమ్మ...

ABN , Publish Date - May 25 , 2025 | 10:26 AM

జపాన్‌లో నగోరో ఒక చిన్న గ్రామం. ఒకప్పుడు ఆ ఊళ్లో మూడు వందల జనాభా ఉండేది. కాలక్రమంలో చాలామంది బతుకు దెరువు నిమిత్తం పట్టణాలకు వలస వెళ్లారు. కొంతమంది మరణించారు.

అమ్మో... బొమ్మ...

జపాన్‌లోని నగోరో గ్రామంలోకి అడుగుపెడితే... ఇంటి ముందు అరుగుపై కూర్చుని ముచ్చట్లు పెడుతున్న గృహిణులు... బస్టాప్‌లో కూర్చుని బస్‌ కోసం ఎదురు చూస్తున్న వారు... పొలం పనులు చేసుకుంటున్న వారు... తరగతి గదిలో శ్రద్ధగా పాఠాలు వింటున్న పిల్లలు కనిపిస్తారు. ఈ దృశ్యం అన్ని గ్రామాల్లోనూ కనిపించేదే కదా... ఇందులో కొత్తేం ఉందంటారా? పరిశీలనగా చూస్తే... వాళ్లంతా మనుషులు కాదు, బొమ్మలని అర్థమవుతుంది. ఊరి నిండా అలా బొమ్మలు పెట్టాల్సిన అవసర మేంటి? ఇంతకీ వాటిని ఎవరు పెట్టారు?

జపాన్‌లో నగోరో ఒక చిన్న గ్రామం. ఒకప్పుడు ఆ ఊళ్లో మూడు వందల జనాభా ఉండేది. కాలక్రమంలో చాలామంది బతుకు దెరువు నిమిత్తం పట్టణాలకు వలస వెళ్లారు. కొంతమంది మరణించారు. దాంతో గ్రామంలో నివసిస్తున్న వారి సంఖ్య చాలావరకు తగ్గి పోయింది. ఇంకా చెప్పాలంటే జనసంచారమే లేకుండా పోయింది. ఇళ్లు, వీధులు, దుకాణాలు, పాఠశాలలు అన్నీ ఖాళీగా మారిపోయాయి. మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ ఊరి గురించి బయటి ప్రపంచానికి కూడా పెద్దగా తెలియదు. కానీ సుకిమి అయానో ఆ గ్రామంలోకి అడుగు పెట్టాక ఆ ఊరి రూపురేఖలు మారిపోయాయి.


ఒంటరితనం దూరమయ్యేలా...

సుకిమి అయానో ‘నగోరో’ గ్రామంలోనే జన్మించింది. అయితే ఊరిని వదిలిపెట్టి ఒసామాలో స్థిరపడింది. కొన్నేళ్ల తరువాత సొంత ఊరిని చూడాలనిపించడంతో గుండెలనిండా ప్రేమను నింపుకుని తిరిగి వచ్చింది. అయితే నిశ్శబ్దంగా ఉన్న ఊరిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ ఊరి నుంచి ఆమె ఒసామాకు వెళ్లిన సమయంలో 300 మంది వరకు నివసిస్తున్నారు. ఆమె తిరిగి వచ్చిన సమయానికి ఊర్లో 30 మంది మాత్రమే ఉన్నారు. తన ఊరి వాళ్లను, తను పుట్టిపెరిగిన గ్రామాన్ని ఎంతో ఊహించుకుని వచ్చిన సుకిమికి నిరాశే ఎదురయ్యింది. ఊరంతా ఎక్కడ చూసినా, ఏమాత్రం సందడి లేకుండా ఖాళీగా కనిపించి తీవ్ర నిరాశకు గురిచేసింది.


ఊళ్లోనే ఉండాలనుకున్న సుకిమిని ఒంటరి తనం బాధించింది. ఆ బాధ నుంచి బయట పడేందుకు బొమ్మల తయారీకి సిద్ధమైంది. ముందుగా తన తండ్రి రూపంలో బొమ్మను తయారుచేసింది. ఆ బొమ్మకు తన తండ్రి బట్టలు వేసి పొలంలో పెట్టింది. ‘‘మా నాన్న బొమ్మను తయారుచేసి, ఆయన బట్టలు వేసి పొలంలో పెట్టాను. దాన్ని దూరం నుంచి చూసిన గ్రామస్తులు ఉదయాన్నే పొలం పనులు చేసుకుంటున్నాడని భావించేవారు. ఇరుగు పొరుగు వాళ్లు గుడ్‌మార్నింగ్‌ చెప్పే వారు. చాలా తొందరగా పొలం పనికి వచ్చారని సంభాషించే వారు. క్రమంగా గ్రామస్తులు ఈ బొమ్మలను సొంత వ్యక్తులుగా భావించడం మొదలుపెట్టారు’’ అని అంటారు సుకిమి. చనిపోయిన వ్యక్తులు సుకిమికి బాగా తెలుసు. వారితో అనుబంధం ఉండేది కాబట్టి వారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ బొమ్మలు రూపొందించే వారు. అచ్చంగా వాళ్లను పోలి ఉండే విధంగా బొమ్మలు తయారుచేశారు. వాళ్లు ధరించిన దుస్తులను బొమ్మలకు వేశారు. ఆవిధంగా ఇప్పటి వరకు ఆమె 400 బొమ్మలు తయారుచేశారు.


దిష్టిబొమ్మల తల్లి...

స్కూల్లో పిల్లలు శ్రద్ధగా పాఠాలు వింటున్న ట్టుగా కొన్ని బొమ్మలు తయారు చేశారు. బ్లాక్‌ బోర్డ్‌ ముందు టీచర్‌ నిలుచుని పాఠాలు చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ దృశ్యం నిజమైన తరగతి గదిని చూసిన భావనను అందిస్తుంది. ‘‘గ్రామంలో పిల్లలు లేరు. నిజానికి పిల్లలు ఉంటేనే ఊర్లో హడావిడి ఉంటుంది. వాళ్ల అల్లరితో సందడిగా ఉంటుంది. అందుకే పిల్లల బొమ్మలు తయారుచేశాను’’ అని అంటారు సుకిమి.

book5.2.jpg


స్ట్రా, ఫ్యాబ్రిక్‌, న్యూస్‌పేపర్‌, పాత బట్టలు ఉపయోగించి బొమ్మలు తయారుచేశారు. దాంతో సుకిమి అయానోకి ‘దిష్టిబొమ్మల తల్లి’ అని పేరు స్థిరపడింది. ఊరిని ‘దిష్టిబొమ్మల గ్రామం’ అని పిలుస్తారు. మరికొంతమంది ‘శాపానికి గురైన గ్రామం’ అని కూడా అంటారు. ఏటా శరదృతువులో గ్రామంలో స్కార్‌క్రో ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. ఈ పండగలో ఫొటో కాంపిటీషన్‌తో పాటు స్కార్‌క్రో మేకింగ్‌ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. నిజానికి ఈ గ్రామాన్ని చేరుకోవడం చాలా కష్టం. అయినా పర్యాటకులు కష్టనష్టాల కోర్చి బొమ్మల ఊరిని చూడటానికి తరలి వెళ్తుంటారు. ‘వ్యాలీ ఆఫ్‌ ద డాల్స్‌’ పేరుతో డాక్యుమెంటరీ ప్రసారమయ్యాక అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి.

భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి

Hyderabad Metro: పార్ట్‌-బీ మెట్రోకు డీపీఆర్‌ సిద్ధం

Read Latest Telangana News and National News

Updated Date - May 25 , 2025 | 10:26 AM