Smoking inside Train: రైల్లో పొగతాగుతూ.. నువ్వేమీ చేయలేవని దబాయిస్తూ.. వైరల్ వీడియో
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:05 AM
రైల్లో పొగతాగుతున్న ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై రైల్వే శాఖ కూడా స్పందించింది. తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్లో పొగతాగుతూ తోటి ప్రయాణికులను దబాయించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. తాను రైల్వే ఉద్యోగినంటూ రెచ్చిపోయిన అతడి వైనాన్ని చూసి జనాలు మండిపడుతున్నారు. రైల్వే శాఖ కూడా ఈ ఉదంతంపై దృష్టి సారించింది (Smoking inside Train - Viral Video).
ఎక్స్ వేదికగా ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. వీడియోను షేర్ చేసిన వ్యక్తి అసలు ఏం జరిగిందో కూడా వివరంగా తెలియజేశారు. ‘ఓ వ్యక్తి రైల్లో ఇతర ప్రయాణికుల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పొగతాగడం ప్రారంభించాడు. ప్రజాభద్రత, రైల్వే నిబంధనలను ఉల్లంఘించాడు. పొగతాగొద్దని పక్కనున్న ప్యాసెంజర్ సూచించగా అతడు పట్టించుకోలేదు. తాను మానని పొగరుగా సమాధానమిచ్చాడు. తాను రైల్వే ఉద్యోగినని చెప్పారు. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఇష్టారీతిన మాట్లాడాడు. ఇది చాలా ఆందోళనకరమైన తీరు’ అని వీడియో పోస్టు చేసిన వ్యక్తి పేర్కొన్నారు.
‘రైల్వే ఉద్యోగి అయినంత మాత్రాన చట్టాలను ఉల్లంఘించే హక్కు ఎవరికీ ఉండదు. ఇతర ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టకూడదు. రైల్లో పొగతాడం చట్టవ్యతిరేకమే కాకుండా ప్రయాణికులను ప్రమాదంలోకి నెడుతుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్న చిన్నారులు, వృద్ధులకు ఇది ఇబ్బందికరం’ అని అన్నారు.
ఇక ఈ వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది సదరు ప్రయాణికుడిపై విమర్శలు గుప్పించారు. త్వరలో అతడు మాజీ రైల్వే ఉద్యోగిగా మారతాడని అన్నారు. రైల్వే ఉద్యోగులకు ఇచ్చే అదనపు సౌకర్యాలను తొలగిస్తే ఇలాంటి సమస్యలు రావని మరికొందరు అన్నారు. ఈ ఉదంతంపై రైల్ సేవ కూడా స్పందించింది. పీఎన్ఆర్ నెంబర్, ఫోన్ నెంబర్ తదితర వివరాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఇవీ చదవండి:
యువకుడి జీవితంలో ట్విస్ట్.. దురదృష్టం వెంటాడటంతో..
35 ఏళ్ల వయసులో జాబ్ పోయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడెలా? టెకీ ఆవేదన