బాప్‌రే... హైరైజ్ శ్మశానాలు...
ABN , Publish Date - May 25 , 2025 | 01:28 PM
నగరంలో నీడ కోసం చిన్నపాటి ఇల్లయినా కొనుక్కోవాలన్నది చాలామంది కల. అయితే భవిష్యత్తులో చనిపోయినవారిని పూడ్చిపెట్టేందుకు ఆరడుగుల స్థలం కూడా దొరకని పరిస్థితి వస్తుందన్నది నిపుణుల మాట. ఇంగ్లండ్, నార్వే, గ్రీస్ వంటి దేశాల్లో ఇప్పటికే పరిస్థితులు జఠిలంగా మారాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆకాశ శ్మశానవాటికలు ఒక్కటే మార్గమంటున్నారు. కొన్ని నగరాలు ఇప్పటికే అలాంటి ‘స్కైరైజ్ సీమెట్రీ’ల నిర్మాణాలను మొదలుపెట్టాయి కూడా.
కోట్ల రూపాయలు పెట్టి ఆకాశహర్మ్యాల్లో ఫ్లాట్ కొనుక్కునే వారిని చూస్తూనే ఉంటాం. వాటి గురించి పత్రికల్లో బ్రహ్మాండంగా ప్రకటనలు కూడా చూస్తున్నాం. భవిష్యత్తులో అలాగే డబ్బు పెట్టి ఆకాశహర్మ్యాల్లో ఒక సమాధిని కొనుక్కోవాల్సి వస్తుందంటే నమ్ముతారా? ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలేని 32 అంతస్తుల ఆకాశ శ్మశానవాటికలోని 9వ అంతస్తులో ఖననం చేశారు. మున్ముందు ఇలాంటి వార్తలు సాధారణం కావచ్చు. కాంక్రీటు నగరాలు వందల కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నాయి. బతుకుదెరువు కోసం వచ్చే వారితో ప్రపంచ నగరాలు కిటకిటలాడిపోతున్నాయి. బతకడానికి కాదు, చనిపోయాక సమాధి చేయడానికి ఆరడుగుల స్థలం దొరకడం కూడా కష్టమైపోతోంది. ‘పాపులేషన్ రెఫరెన్స్ బ్యూరో’ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు భూమిపై మరణించిన వారి సంఖ్య 10 వేల కోట్లు. రాబోయే వందేళ్లలో మరో 700 కోట్ల మంది మరణిస్తారని అంచనా వేశారు. దీన్నిబట్టి చూస్తే నివసించడానికి ఫ్లాట్ల ధరల మాట దేవుడెరుగు... సమాధులు మరింత ఖరీదు అయ్యే అవకాశం ఉంది. ఆరడుగుల స్థలాన్ని కోట్లు పెట్టి కొనే పరిస్థితి రావచ్చు అన్నది నిపుణుల మాట.
గిన్నిస్ రికార్డు శ్మశానవాటిక...
బ్రెజిల్‌లోని సాంటోస్ నగరంలో ‘మెమోరియల్ నెక్రోపోల్ ఎక్యుమెనికా’ పేరుతో 32 అంతస్తుల ఆకాశహర్మ్యం నిర్మించారు. ఇది మనుషులు నివసించేందుకు నిర్మించింది కాదు. శ్మశానవాటికగా ఉపయోగించేందుకు నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్మశానవాటికగా ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ను పొందింది. ఇందులో ఒకేసారి 25 వేల శవాలను ఉంచే వీలుంది. మృతదేహాలకు మూడేళ్ల వరకు అద్దె చెల్లించే వెసులుబాటు కూడా ఉందండోయ్. తరువాత అవశేషాలను వారసులకు అందిస్తారు. వాళ్ల అభీష్టం మేరకు వాటిని మరెక్కడైనా ఖననం చేసుకోవచ్చు.
పోయినా బాధే ...
యూరోపియన్ దేశాలు చాలా ఏళ్లుగా శ్మశానవాటికలను తిరిగి ఉపయోగిస్తున్నాయి. ప్రేగ్‌లోని పాత యూదు శ్మశానవాటికలో స్థలం కొరత వల్ల సమాధులపై లేయర్‌లా మట్టి పోసి, కొత్త సమాధులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ శ్మశానవాటికలో 1787లో మొదటి ఖననం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లేయర్లలో మట్టి పోసి సమాధుల మీద మళ్లీ సమాధులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంగ్లండ్‌లోనూ అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. 2050 కల్లా ఖననం చేయడానికి స్థలం ఉండదని ఒక అధ్యయనంలో తేలింది.

ఈ సమస్య పరిష్కారం కోసమే ఆకాశం వైపు చూస్తున్నారు. ఆకాశ శ్మశానవాటికల సంఖ్య రాబోయే రోజుల్లో గణనీయంగా పెరుగుతుందంటున్నారు నిపుణులు. తైవాన్‌లో బహుళ అంతస్తుల శ్మశానం పగోడాలలో పూడ్చిపెట్టే సంప్రదాయం ఇప్పటికే ఉంది. స్థలం ఆదా చేయడానికి హాంకాంగ్‌లో కొండ వాలులో సమాధులు నిర్మించడం చూడొచ్చు. జపాన్‌లో ఒక వ్యాపారవేత్త మృతదేహాల కోసం ఏకంగా ఒక హోటల్ తెరిచాడు. ఖననం చేసేందుకు క్యూలో నిలుచోవాల్సిన పరిస్థితి ఉండటంతో వారి వంతు వచ్చే వరకు మృతదేహాలను సదరు హోటల్‌లో భద్రంగా భద్రపరుస్తుంటారు.
టెల్ అవీవ్‌లో ఉన్న ‘యార్కాన్’ శ్మశానవాటికలో 2 లక్షల 50 వేల మందిని ఖననం చేసేందుకు సరిపోయే స్థలంతో ఒక ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నారు. మన దగ్గర మహానగరం ముంబైలోనూ ఒక ఆకాశ శ్మశానవాటిను నిర్మిస్తున్నారు. ‘మోక్ష టవర్’ అని పిలుస్తున్న ఈ భవనం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇందులో దహన సంస్కారాలు, ఖననం రెండు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. హిందు, ముస్లిం, క్రిస్టియన్లు, పార్సీలు... ఇలా అన్ని మతాల వారికి ఉపయోగపడేలా నిర్మాణం చేస్తున్నారు. మునుముందు ఆకాశహర్మ్యం కనిపిస్తే అది మనుషులు నివసించేదా... శ్మశానమా అని ఆలోచించాల్సి రావొచ్చు. ‘విధి విచిత్రం’ అంటే ఇదేనేమో!
ఈ వార్తలు కూడా చదవండి.
భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి
Hyderabad Metro: పార్ట్-బీ మెట్రోకు డీపీఆర్ సిద్ధం
Read Latest Telangana News and National News