Shantanu Naidu AI Roast: చీరలకు పుట్టిల్లైన దేశంలో ఇదేం ట్రెండ్..శంతను నాయుడు సెటైర్లు
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:02 PM
నానో బనానా వాడుతూ జనాలు తాము చీరలు ధరించి ఉన్నట్టు ఫొటోలు సృష్టించుకోవడంపై రతన్ టాటా సహాయకుడు శంతను నాయుడు సెటైర్లు పేల్చారు. కబోర్డుల్లో ఎల్లప్పుడు ఉండే చీరలతో ఫొటో దిగితే సరిపోయేదిగా అని ప్రశ్నించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా నానో బానానా మాటే వినిపిస్తోంది. ఈ ఏఐ ఆధారిత ఫొటో ఎడిటింగ్ టూల్‌తో జనాలు తమ ఫొటోలను నచ్చినట్టు మార్చుకుని నెట్టింట పంచుకుంటున్నారు. కొందరు రెట్రో లుక్ కోసం ప్రయత్నిస్తున్నారు. చీరలతో ఉన్నట్టు ఫొటోలను నానో బనానాతో ఎడిట్ చేసి నెట్టింట పంచుకుంటున్నారు. అయితే, దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా సహాయకుడు శంతను నాయుడు ఈ ట్రెండ్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది (Shantanu Naidu Gemini AI trend roast).
‘మీరంతా భారత్‌లో ఉన్నారని అనుకుంటున్నారా లేక అమెరికాలోనా? ఈ దేశం చీరలకు నెలవు. మీ కబోర్డుల్లో చూసుకుంటే కనీసం 15 చీరలు కనిపిస్తాయి. వాటిని ధరించి ఫొటోలు దిగి నెట్టింట షేర్ చేయొచ్చుగా. ఇది కూడా చేయలేనంత బద్ధకస్తులుగా మారిపోయారా? మీ వద్ద ఇప్పటికే ఉన్న దుస్తులను కాదని ఏఐతో ఫొటోలు చేయించుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. పాశ్చాత్య దేశాల్లోని పెళ్లిళ్లోలో ధరించే తెల్లటి గౌన్స్ వేసుకున్నట్టు ఎడిటెడ్ ఫొటోలు షేర్ చేసినా పెద్దగా తప్పుపట్టాల్సిందేమీ ఉండేది కాదని కూడా అన్నారు. ఇలాంటి ఫొటోల్లో కంటే ఇంట్లో అమ్మ చీర కట్టుకుని ఫొటో దిగితే మరింత అందంగా ఉంటారని కూడా అభిప్రాయపడ్డారు.
దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది శంతను అభిప్రాయంతో ఏకీభవించారు. తమ మనసులో ఉన్నదే శంతను చెప్పేశాడని కామెంట్ చేశారు. గూగుల్ జెమినీ యాప్‌లోని నానో బనానా ఇమేజ్ ఎడిటింగ్ టూల్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఫొటోలకు 3డీ రూపాన్ని ఇచ్చే ఈ టూల్ ప్రస్తుతం జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది. భారత్‌లో శారీ ఎడిట్స్ పాప్యులర్‌గా మారాయి. ఇలా తమ ఫొటోలను ఎడిట్ చేసుకుని అనేక మంది నెట్టింట తమ మిత్రులతో పంచుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
భారత్-పాక్ మ్యాచ్‌లో ఊహించని ట్విస్ట్.. పాక్ అభిమాని చేసిన పని చూస్తే..
శాలరీ పెంచడం ఇష్టం లేక ఉద్యోగిని తొలగించిన కంపెనీకి భారీ షాక్