Retirement Portfolio: ఎఫ్‌డీల్లో రూ.1.2 కోట్లు.. ఇక తను సేఫ్ అని అనుకున్నాడు కానీ..
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:10 PM
జీవితాంతం కష్టపడి సంపాదించిన రూ.1.2 కోట్లు మొత్తాన్ని ఎఫ్‌డీల్లో పెట్టిన ఓ పెద్దాయన చాలా తప్పు చేశారని ఓ సీఏ నెట్టింట పోస్టు పెట్టారు. ఇది ఎంత ప్రమాదమో వివరించాక ఆయన పెట్టుబడుల పోర్టుఫోలియోను భవిష్యత్తు అవసరాలకు అనుగూణంగా మార్చినట్టు తెలిపార. ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆ పెద్దాయన వయసు 67 ఏళ్లు. రిటైరయ్యే నాటికే బ్యాంక్ ఎఫ్‌డీల్లో రూ.1.2 కోట్లు దాచుకున్నారు. మలి వయసులో ఏ చింతాలేకుండా గడపచ్చని భావించారు. కానీ ఇదే ఆయన చేస్తున్న అతిపెద్ద తప్పని ఓ చార్టెడ్ అకౌంట్ నెట్టింట పోస్టు పెట్టారు. ఈ వ్యూహంతో ఎలాంటి ముప్పు ఉందో కూడా వివరిస్తూ సీఏ నితిన్ కౌశిక్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Fixed Deposits-Inflation Risks).
పెద్దాయన భవిష్యత్తు ఎంత మాత్రం సేఫ్ కాదని కౌశిక్ వివరించారు. ఆయనకు డబ్బు అవసరం పడే నాటికే ఆ డబ్బు విలువ తరిగిపోతుందని హెచ్చరించారు. డబ్బు మొత్తం ఎఫ్‌డీల్లో పెట్టడమే ఇందుకు కారణమని చెప్పారు. డబ్బు విలువ పెరగని పక్షంలో దాని కొనుగోలు శక్తి తరిగిపోతుందని హెచ్చరించారు. ద్రవ్యోల్బణం రేటు కేవలం 5 శాతంగా ఉన్నప్పటికీ ప్రస్తుత రూ.1.2 కోట్లు 20 ఏళ్ల తరువాత అప్పటి రేట్ల ప్రకారం రూ.50 లక్షలతో సమానమని వివరించారు. రిటైర్ అయిన వాళ్లు పెట్టుబడులతో రిస్క్ తీసుకోవద్దని సూచిస్తారు కానీ ఆయుర్దాయం పెరుగుతున్న నేటి జమానాలో ఆ డబ్బు భవిష్యత్తు అవసరాలకు ఎంతమాత్రం సరిపోదని హెచ్చరించారు. 65 ఏళ్ల వ్యక్తి రిటైర్‌మెంట్ తరువాత మరో 20-25 ఏళ్లు జీవిస్తే అప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వారి డబ్బు విలువ తరిగిపోతుందని అన్నారు.
ఈ విషయాలను వివరించి పెద్దాయన పెట్టుబడుల పోర్టుఫోలియోను ఆయన అవసరాలకు అనుగుణంగా మార్చినట్టు చెప్పారు. ఆయన రిటైర్‌మెంట్ డబ్బులో 70 శాతాన్ని స్థిరత్వం కోసం బాండ్స్‌లోకి, 20 శాతాన్ని దీర్ఘకాలిక వృద్ధి కోసం ఈక్విటీల్లోకి మళ్లించానని అన్నారు. మిగిలిన 10 శాతం డబ్బును అత్యవసరాల కోసం నగదుగా బ్యాంకులో పెట్టినట్టు తెలిపారు. ఈ తరహా పెట్టుబడితో అధిక రిస్క్ ఉండదని, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పోస్టుపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
ఇవీ చదవండి:
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ
అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు.. హెచ్-1బీ వీసాదారుడి కామెంట్