Prada Safety Pin Brooch: పిన్నీసు ధర రూ.69 వేలు.. లగ్జరీ బ్రాండ్స్ అంటే అట్లుంటది మరి!
ABN , Publish Date - Nov 17 , 2025 | 10:23 PM
ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ప్రాడా ఇటీవల విడుదల చేసిన పిన్నీసు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీని ధర రూ.69 వేలని తెలిసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఈ ధరతో బీరువా మొత్తం నిండిపోయేలా దుస్తులు కొనుక్కోవచ్చని కొందరు కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పిన్నీసులు తెలియని వారు దాదాపుగా ఉండరు. రోజువారి ఎదురయ్యే అనేక సమస్యలకు ఈ పిన్నీసుతో చెక్ పెట్టేయచ్చు. ధర కూడా రూ.10 లోపే ఉంటుంది. కానీ ఇదే పిన్నీసు ధర రూ.69 వేలంటే మాత్రం ఆశ్చర్యంతో పాటు ఒకింత కోపం కూడా వస్తుంది. బంగారంతో చేసినా సరే పిన్నీసు ధర అంత ఉండదని అనిపిస్తుంది. కానీ ఇటలీకి చెందిన లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ప్రాడా మాత్రం తను తయారు చేసిన పిన్నీసు ధరను రూ.69 వేలుగా నిర్ణయించింది (Prada Safety Pin).
క్రాషెట్ సేఫ్టీ పిన్ బ్రూచ్ పేరిట దీన్ని జనాల ముందుకు తెచ్చింది. వాస్తవానికి ఇది సాధారణ పిన్నీసే. అయితే, ఓవైపు రంగురంగుల దారాల అల్లికను జోడించింది. మొత్తం మూడు రంగుల్లో మూడు వెరైటీలను మాత్రమే తెచ్చింది. దీని పొడవు 3.15 అంగుళాలు. ఇత్తడితో చేసినట్టు సంస్థ చెప్పింది . ధరను 775 డాలర్లుగా నిర్ణయించింది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే అక్షరాలా రూ.69 వేలు.
ఇక ఈ పోస్టు వైరల్ కావడంతో జనాల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ‘రూ.70 వేలు పెట్టి జస్ట్ ఒకేఒక పిన్నీసును కొనాలా.. ఆ డబ్బుతో బీరువా మొత్తాన్ని కొత్త దుస్తులతో నింపొచ్చు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. తాను మొన్నే రూ.10 పెట్టి ఆరు పిన్నీసులు కొన్నట్టు మరో వ్యక్తి అన్నారు. ‘ఏంటీ.. నేను చూస్తున్నది నిజమేనా.. ఇలాంటి పిన్నీసు ఎక్కడైనా మర్చిపోయే అవకాశం ఉంది. దీని కోసం రూ.69 వేలు ఖర్చుపెట్టాలా?’ అని మరో వ్యక్తి అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండింగ్‌లో ఉంది.
గతంలో కూడా ప్రాడా ఉత్పత్తులు నెట్టింట కలకలం రేపాయి. షోలాపూర్ చెప్పుల తరహాలో డిజైన్ చేసిన ఓ జత ధరను రూ.1.2 లక్షలుగా నిర్ణయించడం చూసి అప్పట్లో జనాలు నోరెళ్లబెట్టారు. తాజాగా పిన్నీసు వ్యవహారంతో మరోసారి ప్రాడా పేరు నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఇవీ చదవండి:
వామ్మో.. ఇది ఇండియానేనా.. ఆనంద్ మహీంద్రా పోస్టుకు జనాల ఆశ్చర్యం
ఇంటి నిర్వహణ కోసం ప్రత్యేక మేనేజర్.. నెలకు జీతం ఎంతో తెలిస్తే..