Anand Mahindra: వామ్మో.. ఇది ఇండియానేనా.. ఆనంద్ మహీంద్రా పోస్టుకు జనాల ఆశ్చర్యం
ABN , Publish Date - Nov 17 , 2025 | 09:38 PM
పరిశుభ్రతకు, ప్రజల పౌరస్పృహకు పర్యాయపదంగా నిలిచే సిక్కిం రాష్ట్రంపై ఆనంద్ మహీంద్రా మరోసారి ప్రశంసలు కురిపించారు. అయితే భారత్ గొప్పదనం చెప్పుకునేందుకు పాశ్చాత్య దేశాలతో పోలిక అవసరం లేని రోజు ఒకటి వస్తుందని తాను నమ్ముతున్నట్టు పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత, పౌర స్పృహ వంటి అంశాలపై చర్చ ఎప్పుడు జరిగినా చాలా మంది పాశ్చాత్య దేశాల ప్రస్తావన తెస్తారు. అక్కడి వ్యవస్థలు స్ఫూర్తిదాయకమని అంటారు. అయితే, భారత్‌లో కూడా అంతటి అద్భుతమైన వ్యవస్థలు, క్రమశిక్షణ కలిగిన ప్రజానీకం ఉన్నారంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఓ కొత్త కోణం జోడిస్తూ చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట ఆసక్తిని కలిగిస్తోంది (Anand Mahindra).
సత్యజీత్ దహియా అనే పర్యాటకుడు సిక్కింలోని పరిస్థితులపై ఓ వీడియో చేశారు. అక్కడి పరిశుభ్రత చూసి ఆశ్చర్యపోయిన అతడు తొలుత తాను జపాన్‌లో ఉన్నానంటూ జోక్ చేశాడు. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండటం, పద్ధతిగా ఉన్న కార్ల పార్కింగ్, జనాలు హారన్‌లు మోగించకుండా వాహనాలను నడపడం వంటి విషయాలను పేర్కొన్నారు. సిక్కిం చరిత్రను తెలిపే చిత్రాలు అనేకం గోడలపై వేశారని కూడా చెప్పారు. అక్కడి విధానాలు అంత గొప్పగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జపాన్ పేరెత్తి మొదట్లో జోక్ చేశానని మరోసారి వివరణ ఇచ్చారు (Sikkim Viral Video).
ఇక ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా కూడా షేర్ చేశారు. పరిశుభ్రత, ప్రజల క్రమశిక్షణలో సిక్కిం ఓ రోల్ మోడల్ అని కీర్తించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలే ఉండాలని ఆకాంక్షించారు. మన దేశం గొప్పదనం చెప్పేందుకు ఇతర దేశాల ప్రస్తావన అవసరం లేని రోజు ఒకటి వస్తుందని నమ్ముతున్నట్టు కామెంట్ చేశారు. దీంతో, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది.
గతంలోనూ ఆనంద్ మహీంద్రా సిక్కింపై ప్రశంసలు కురిపించారు. హిమాలయాల్లో మణి వంటి ఈ రాష్ట్రానికి దక్కవలసినంత గుర్తింపు, ప్రశంసలు దక్కలేదని ఓ సందర్భంలో అన్నారు. ప్రపంచస్థాయి పర్యాటక స్థలంగా సిక్కింకు గుర్తింపు లేకపోవడం చూస్తే ఒకింత ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. అక్కడి ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైభవం ఎంతో గొప్పవని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రానికి తాను ఇప్పటివరకూ వెళ్లలేదని, ఒకరకంగా తనకు ఇది పెద్ద లోటని కూడా వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
ఇంటి నిర్వహణ కోసం ప్రత్యేక మేనేజర్.. నెలకు జీతం ఎంతో తెలిస్తే..
దొంగ మనసు మార్చిన చిన్నారి.. చూసి తీరాల్సిన వీడియో!