Noida Cab Driver: యువతులకు క్యాబ్ డ్రైవర్ బెదిరింపులు.. తాను జైలు కెళ్లేందుకైనా సిద్ధమేనంటూ..
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:16 PM
నోయిడాలో ఓ క్యాబ్ డ్రైవర్ నలుగురు యువతులతో అమర్యాదకరంగా మాట్లాడుతూ బెదిరింపులకు దిగిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తన క్యాబ్ బుక్ చేసుకున్న యువతులతో అనుచితంగా ప్రవర్తించి బెదిరింపులకు గురి చేసిన ఓ క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నోయిడాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది (Noida Uber driver threat).
మీడియా కథనాల ప్రకారం, తశు గుప్తా, ఆమె నలుగురు స్నేహితులు మంగళవారం సెక్టర్ 128లోని బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ వద్ద ఊబెర్ క్యాబ్ ఎక్కారు. అయితే, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందన్న కారణంగా వారు డ్రైవర్ బ్రజేశ్‌కు యూటర్న్ తీసుకోవద్దని సూచించారు. అందుకు బదులుగా అండర్‌పాస్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఇందుకు నిరాకరించిన అతడు వారితో దురుసుగా ప్రవర్తించడంతో వివాదం మొదలైంది ( Uber incident Noida video).
‘మేమేమీ అనకుండానే ఆ డ్రైవర్ రెచ్చిపోయాడు. చాలా అమర్యాదకరంగా మాట్లాడటం ప్రారంభించాడు. సైలెంట్‌గా కూర్చోండి అంటూ మమ్మల్ని గద్దించాడు. మ్యాప్‌లో కనిపిస్తున్న రూట్‌లోనే వాహనాన్ని తీసుకెళతానని మొండిపట్టు పట్టాడు. కాస్త మర్యాదగా మాట్లాడమని మేము సూచించాము. కానీ అతడు మరింతగా రెచ్చిపోయాడు. మీరెవరు నాకు చెప్పడానికి అని గయ్యిమన్నాడు. మా లాంటి వాళ్లు తన వద్ద 10 మంది పనిచేస్తున్నారని అవమానించాడు. తనకు 12 నుంచి 13 కార్లు ఉన్నాయని అన్నాడు. ఆపై మాతో మరింత దురుసుగా మాట్లాడటం ప్రారంభించాడు (women safety ride share)’
‘మాకేమైనా అపకారం తలపెడతాడేమో అనే భయంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించాము. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అతడు అన్నాడు. మీ అందరికీ ఓ గుణపాఠం చెబుతానంటూ రెచ్చిపోయాడు. మేము కారు దిగిపోతుంటే పైసలిచ్చాకే ముందుకు కదలాలంటూ నన్ను తోసే ప్రయత్నం చేశాడు. అతడి తీరుపై విసుగొచ్చి మేము డబ్బులిచ్చేందుకు నిరాకరిస్తే అతడు కారు డిక్కీ లోంచి ఓ ఇనుమ రాడ్డు తీసి మమల్ని కొడతానంటూ బెదిరించాడు. నీ సంగతి తేలుస్తా ఉండు.. నీకు నాలుగు తగిలించి జైలు కెళ్లడానికి కూడా నాకు అభ్యంతరం లేదు అంటూ అతడు రాడ్‌తో బెదిరించాడు. ఈ ఉదంతాన్ని రికార్డు చేస్తున్న మా ఫ్రెండ్‌ను వెంటపడ్డాడు. ఆమె ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. మొదట మేము స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి స్పందన రాలేదు’ అని తశు గుప్తా సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఈ ఘటనపై ఊబెర్ కూడా స్పందించింది. డ్రైవర్ ఇలా ప్రవర్తించడాన్ని తాము అస్సలు సహించబోమని తెలిపింది. మహిళలు తమ రిజిస్టర్డ్ నెంబర్ నుంచి తమకు నేరుగా మెసేజ్ చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఘటన వైరల్ కావడంతో పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
3 సార్లు హెచ్-1బీ వీసాలో నిరాశ.. పంతం పట్టి కల నెరవేర్చుకున్న యువకుడు
హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్