Bengaluru Techie O-1visa: 3 సార్లు హెచ్-1బీ వీసాలో నిరాశ.. పంతం పట్టి కల నెరవేర్చుకున్న యువకుడు
ABN , Publish Date - Sep 25 , 2025 | 02:59 PM
మూడు సార్లు హెచ్-1బీ వీసా లాటరీలో చుక్కెదురైనా వెనక్కు తగ్గని ఓ భారతీయ యువకుడు తన శ్రమతో అమెరికా కలను నెరవేర్చుకున్నాడు. అత్యద్భుత ప్రతిభా సామర్థ్యాలను ప్రదర్శించి ఏకంగా ఓ-1వీసాను దక్కించుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా పొందడంలో మూడు సార్లు నిరాశ ఎదురైనా వెనక్కు తగ్గని ఓ భారతీయ యువకుడు పంతం పట్టి తన అమెరికా కలను నెరవేర్చుకున్నాడు. అతడే స్వయంగా ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. బెంగళూరుకు చెందిన టెకీ తనుశ్ శరణార్థి ఈ పోస్టు పెట్టాడు (IBM employee O-1 visa).
తనకు మూడు సార్లు హెచ్-1బీ వీసా లాటరీలో చుక్కెదురైందని తనుశ్ తెలిపాడు. అయితే, జీవితాన్ని అదృష్టానికి వదిలిపెట్టకుండా తాను చేయగలిగింది చేశానని తెలిపాడు. గొప్ప నైపుణ్యాలున్న వారికి ఇచ్చే ఓ-1 వీసా తనకు వచ్చిందని తెలిపాడు. హెచ్-1బీ వీసా రాలేదని నిరాశ చెందకుండా మరింత కష్టపడ్డానని అతడు చెప్పాడు. రాత్రిళ్లు గంటల తరబడి మేలుకుని వివిధ రకాల ప్రాజెక్టులు చేశానని అన్నాడు. వివిధ రకాల ప్రాజెక్టులు నిర్మించి, పరిశోధన పత్రాలు ప్రచురించి, ఏఐ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నానని తెలిపాడు (H-1B rejections O-1 alternative).
నిరంతర శ్రమతో లాటరీ కంటే మంచి ఫలితాలు వచ్చాయని అన్నాడు. ఈ వారమే తనకు ఓ-1 వీసా మంజూరైందని అన్నాడు. తమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విదేశీయులకు మాత్రమే ఇచ్చే ఓ-1వీసా వచ్చిందని సంబరపడిపోతూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తనుశ్ తన కుటుంబసభ్యులు, తనకు మార్గదర్శకత్వం చేసిన వారికి, స్నేహితులు ధన్యవాదాలు తెలిపాడు. తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ఐబీఎమ్‌కు ధన్యవాదాలు తెలిపాడు (Indian techie US visa success).
ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జీవితాన్ని అదృష్టానికి వదిలేయకుండా కష్టపడి తన కలను సాకారం చేసుకున్నందుకు అతడిపై అనేక మంది ప్రశంసలు కురిపించారు. ఇక అత్యద్భుత ప్రతిభ కనబరిచిన విదేశీయులకు ఓ-1 వీసా ఇస్తారు. సైన్స్, కళలు, విద్య, వ్యాపారం, క్రీడ రంగాలతో పాటు ఫిల్మ్ అండ్ టెలివిజన్ రంగంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ఈ వీసా ఇస్తారు. ఈ వీసాపై ఎలాంటి వార్షిక పరిమితులు ఉండవు. ఈబీ-1 బీ కేటగిరిలో గ్రీన్ కార్డు పొందే సౌలభ్యం కూడా ఓ-1వీసాతో ఉంది.
ఇవి కూడా చదవండి:
హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్
యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట