H-1b: హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్
ABN , Publish Date - Sep 23 , 2025 | 06:47 PM
హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో తొలిసారి అమెరికన్లకు టెక్ రంగంలో జాబ్స్‌కు ఛాన్స్ దొరికిందంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెట్టింట పెద్ద డిబేట్ నడుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై సంబరపడుతూ ఓ అమెరికన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకయిపోయేలా చేస్తోంది. చివరకు నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.
శాన్‌ఫ్రాన్‌సిస్కోలో ఓ డాటా ఎనలిటిక్స్ సంస్థను నిర్వహిస్తున్న జాక్ విల్సన్ ఈ పోస్టు పెట్టారు. గతంలో ఆయన మెటా కంపెనీలో పనిచేశారు. హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో అప్పటి విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు (Ex-Meta employee competition vanishing).
‘2017లో నేను మెటాలో పని చేస్తున్న సమయంలో మా టీమ్‌లో 17 మంది ఉండేవారు. వారిలో 15 మంది హెచ్-1బీ వీసాపై ఉన్న వారే. టీమ్‌లోని ఇద్దరు అమెరికన్లలో నేనూ ఒకడిని. కొత్త రూల్స్ ప్రకారం, డాటా ఇంజినీరింగ్ టీమ్ కోసం కంపెనీ ఇకపై 1.5 మిలియన్ డాలర్లను వీసా ఫీజుల కింద చెల్లించాల్సి ఉంటుంది. మీరు అమెరికన్ అయితే.. టెక్ రంగంలో మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్టయితే ఇదే మీకు మంచి సమయం. మన పోటీదారుల్లో ఏకంగా 80 శాతం మంది ఒక్కరాత్రిలో కనుమరుగయ్యారు. గుడ్ లక్’ అని పోస్టు పెట్టారు (H1B fee hike US).
ఈ పోస్టుకు జనాల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. పెద్ద చర్చకు దారి తీసింది. అమెరికన్ విద్యార్థులకు చాలా కాలం తరువాత దొరికిన ఛాన్స్ ఇదేనని కొందరు అన్నారు. సిలికాన్ వ్యాలీలో అమెరికన్లకు ప్రాధాన్యం లభించేలా చేసిన తొలి ప్రభుత్వ చర్య ఇదేనని మరికొందరు అన్నారు.
స్టార్టప్ రంగంలో సృజనాత్మకతపై ప్రతికూల ప్రభావం పడుతుందని కొందరు హెచ్చరించారు. స్టార్టప్ సంస్థల్లో అనేకం విదేశీయులను ఎక్కువగా నియమించుకుంటాయని తెలిపారు. ఇలా చేస్తే ఈ జాబ్స్ అన్నీ విదేశాలకు తరలిపోతాయని అన్నారు. కంపెనీలు ఔట్ సోర్సింగ్ వైపు మొగ్గు చూపుతాయని హెచ్చరించారు. ఆర్థిక అవసరాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న స్టంట్‌లా ఇది ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ విధానం తదుపరి ఎన్నికల తరువాత కనుమరుగవుతుందని కూడా జోస్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి:
యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట
మీరు ట్వీట్ చేయగలుగుతోంది భారతీయులు, చైనీయుల వల్లే.. ఎక్స్ మాజీ ఉద్యోగి