Elon Musk on Aliens: తోక చుక్క చుట్టూ మిస్టరీ... ఎలాన్ మస్క్ సంచలన కామెంట్స్
ABN , Publish Date - Nov 03 , 2025 | 02:07 PM
ఇటీవల నాసా గుర్తించిన తోక చుక్కపై నెట్టింట అనేక భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గ్రహాంతర వాసుల ఉనికిని గుర్తిస్తే కచ్చితంగా ప్రపంచంతో పంచుకుంటానని అన్నారు. ఆత్మహత్య మాత్రం చేసుకోనని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల కామెట్ 3ఐ/అట్లాస్ అనే తోక చుక్కను గుర్తించడం శాస్త్రప్రపంచంలో కలకలం రేగుతోంది. సౌర కుటుంబం ఆవల నుంచి ఈ తోకచుక్క వచ్చింది. ఇది చాలదన్నట్టు తోక చుక్క నిర్మాణం అసాధారణ రీతిలో ఉండటంపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏలియన్‌ల వ్యోమనౌక అయి ఉండొచ్చని కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ కూడా తాజాగా స్పందించారు. తోక చుక్క నిర్మాణం కాస్త అసాధారణంగానే ఉందని అన్నారు (Comet 3i Atlas Elon musk)
జో రోగన్ వ్యాఖ్యాతగా ఉన్న పాడ్ కాస్ట్‌లో ఇటీవల మస్క్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తోక చుక్కలో నికెల్ అనే ఖనిజం చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తోందని అన్నారు. ఇలాంటి తోకచుక్కలు గతంలో భూమిని ఢీకొట్టిన ప్రాంతాల్లో ప్రస్తుతం నికెల్, కోబాల్ట్ గనులు ఉన్నాయని కూడా చెప్పారు.
ఈ సందర్భంగా చర్చ గ్రహాంతర వాసుల ఉనికివైపు మళ్లింది. తోక చుక్కకు గ్రహాంతర వాసులకు సంబంధం ఉందా అన్న చర్చ మొదలైంది. దీనిపై మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు గ్రహాంతర వాసుల ఉనికి గురించి తెలిస్తే కచ్చితంగా బహిర్గతం చేస్తానని అన్నారు. జో రోగన్ షోకు వచ్చే చెబుతానని మాటిచ్చారు. ఆ తరువాత అకస్మాత్తుగా సంచలన కామెంట్స్ చేశారు. తాను ఎప్పటికీ ఆత్మహత్య చేసుకోనని కూడా అన్నారు. దీంతో, ఈ ఉదంతంపై ఆసక్తికర చర్చ మొదలైంది. మస్క్ కామెంట్స్ వెనుక కారణంపై జనాలు తమకు తోచిన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
గ్రహాంతరవాసులు భూమిని కనుగొంటే మానవాళి అంతం పక్కా అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. వారు భూమ్మీదకు వచ్చే లోపే ప్రాణాలు వదులుతామని అంటుంటారు. గ్రహాంతర వాసుల ఉనికిని కనుగొనే పరిశోధనలు, ప్రయత్నాలను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు.
ఇవీ చదవండి:
చుక్కలు చూపిస్తున్న అమెరికా... రూ. కోటి శాలరీ ఉన్న టెకీకి ఊహించని షాక్
వివాహితతో ఎఫైర్.. ఆమె భర్తకు లవర్ పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు