అమ్మ కలను నా లక్ష్యంగా మార్చుకున్నా...
ABN , Publish Date - May 25 , 2025 | 08:51 AM
పదేళ్ల వయసులోనే అందాల కిరీటం సాధించాలని కలలు కన్నది. అందుకు తగ్గట్టుగానే తనను తాను మార్చుకుంటూ, కఠోరమైన దీక్షతో ప్రయత్నించి ‘మిస్ ఇండియా’గా నిలిచింది రాజస్థానీ అమ్మాయి నందినీ గుప్తా.

ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలకు మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ తన గురించి పంచుకున్న కొన్ని కబుర్లివి...
ఐశ్వర్యని చూసి...
నాకు పదేళ్లు ఉన్నప్పుడనుకుంటా... టీవీలో ‘దేవ్‌దాస్’ సినిమా చూస్తున్నా. అందులో ఐశ్వర్యరాయ్ అందం, నటన చూసి ఫిదా అయిపోయి మా అమ్మను ‘ఎవరామె?’ అనడిగాను. ‘తను ఐశ్వర్యరాయ్.. ప్రపంచ సుందరి’ అని చెప్పింది. నేనూ ఆమెలా అవుతానన్నా. ‘ ముందు మిస్ ఇండియాగా గెలవాలి. ఒకప్పుడు నేనూ అందాల పోటీల్లో పాల్గొనాలని కలగన్నా. కానీ కుదరలేదు’ అని చెప్పింది. అమ్మ కలను నెరవేర్చాలనుకున్నా. అలా పదేళ్ల వయసులోనే అందాల కిరీటం నా లక్ష్యంగా మారింది.
ప్రయాణాలంటే ఇష్టం
మాది రాజస్థాన్‌లోని కోటా. నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఎక్కువగా నాగాలాండ్‌ను సందర్శించడానికి ఇష్టపడతా. విదేశాలకు వెళ్లాలనుకుంటే... స్విట్జర్లాండ్ నా మొదటి ఛాయిస్.
వారంతా నా మెంటర్లే
చిన్నవయసులోనే ‘మిస్ ఇండియా’గా నిలిచి, ఆపై అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించింది ప్రియాంక చోప్రా. తన నటనతోనే గాకుండా... సామాజిక సేవతోనూ స్ఫూర్తిగా నిలిచింది. ఆమే నా రోల్‌మోడల్. ఐశ్వర్యరాయ్ నుంచి ప్రియాంక చోప్రా వరకు అందరూ ఏదోరకంగా నాకు మెంటర్లే. నడక, మాట, స్టైల్.. ఇవన్నీ వాళ్లను చూసే నేర్చుకున్నా. ఇక నా మీద అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి మాత్రం రతన్ టాటా. చేసే ప్రతీ పనిలోనూ సమాజహితాన్ని గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి ఆయన.
నా వంతు సేవ చేస్తా
సమాజసేవ చేయడమంటే నాకు చిన్నప్పట్నుంచే ఇష్టం. కారణం మా మేనమామ. ఆయన పుట్టుకతోనే పోలియో బాధితుడు. దాంతో ఎవరూ ఆయన్ని మనిషిగా చూసేవారు కాదు. సైకో, మెంటల్, పిచ్చోడు అని పిలిచేవారు. చాలా బాధనిపించేది. ఆయన్ని చూసుకోవడానికైతే మేం ఉన్నాం... కానీ మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటి అనిపించేది. అలా పుట్టుకొచ్చిందే ‘ప్రాజెక్ట్ ఏక్తా’. వికలాంగులు, మహిళకు ఉపాధి నైపుణ్యాలు నేర్పించడం, ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తోందీ ఎన్జీవో.
ఇంగ్లీషు అంటే భయపడేదాన్ని...
మొదట్లో ఇంగ్లీషు అంటే భయపడేదాన్ని. ఎవరితోనైనా మాట్లాడాలన్నా.. ఎక్కడ నవ్వుల పాలవుతానోనని నోరు విప్పేదాన్ని కాదు. అందాల పోటీలోకి అడుగుపెట్టాకే నా భయాన్ని అధిగమించాలనుకున్నా. ఇంగ్లీషుపై శ్రద్ధ పెట్టాను. ఇప్పుడైతే ఆత్మవిశ్వాసంతో గలగలా మాట్లాడే స్థాయికి చేరుకున్నా.
ఫటాఫట్
- ఫేవరెట్ హీరో: మహేష్‌బాబు.
- ఫేవరెట్ సాంగ్: కుర్చీ మడతపెట్టి. నా డైలీ వర్కవుట్ సాంగ్ అదే.
- సెలబ్రిటీ క్రష్: రణబీర్ కపూర్, శుభ్‌మన్ గిల్
- ఫేవరెట్ డైరెక్టర్: సంజయ్ లీలా భన్సాలీ
- నచ్చిన సినిమాలు: దేవ్‌దాస్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్
- నాలో నాకు నచ్చేది: ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటా.
- అభిరుచులు: నృత్యం, సినిమాలు, ప్రయాణాలు, సైక్లింగ్
- అందాల పోటీకి రాకపోయుంటే: వజ్రాల వ్యాపారం చేస్తుండేదాన్ని.
ఈ వార్తలు కూడా చదవండి.
భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి
Hyderabad Metro: పార్ట్-బీ మెట్రోకు డీపీఆర్ సిద్ధం
Read Latest Telangana News and National News