Underwater Train: 2 గంటల్లోనే ముంబయి టు దుబాయ్.. త్వరలోనే సాకారం.!
ABN , Publish Date - Dec 23 , 2025 | 08:08 AM
ముంబయి - దుబాయ్ మధ్య సుమారు 1,900 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఈ మార్గాన్ని రెండు గంటల్లో చేరుకుంటే.. అంటే విమానం కంటే వేగంగా ప్రయాణించగలిగితే.. ఎలాగుంటుంది.. త్వరలోనే ఆ కల సాకారమవనుంది. అదెలాగంటారా.. ఈ కథనం చదవండి మరి...
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి నుంచి దుబాయ్(Mumbai - Dubai)కు రెండు గంటల్లో ప్రయాణించాలి అనుకుంటున్నారా? అదేంటి సుమారు 1,900 కిలోమీటర్ల దూరాన్ని 120 నిమిషాల్లో చేరుకోవడం ఎలాగని బుర్రకు పదను పెడుతున్నారా? మీరు చదివింది నిజమేనండీ.. త్వరలోనే ఈ కలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ముంబయి-దుబాయ్‌లను కలిపే హై స్పీడ్ అండర్ వాటర్ ట్రైన్(High Speed Underwater Train)ను నడిపేందుకు ఓ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రైలు.. దాదాపు విమానం కంటే వేగంగా అంటే గంటకు 600 - 1000 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు.
భారత్(India), దుబాయ్(Dubai)ల మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేయడం సహా రవాణాను సులభతరం చేసేందుకుగానూ అరేబియా సముద్రం(Arabian Sea) అడుగుల్లో ప్రయాణించేలా ఈ రైలును రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో వైరల్ అవుతోంది. రైలు పేరు డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్(Deep Blue Express) అనీ.. ఇండియా, యూఏఈలను అరేబియా సముద్రమార్గం ద్వారా కలుపుతూ ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు. అలాగే ఈ ట్రైన్ గంటకు 600 - 1000 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందనీ.. ఇది చాలా విమానాల కంటే ఎక్కువ స్పీడ్‌ను కలిగి ఉంటుందని కూడా అందులో వివరించారు.
అరేబియా సముద్రంలో ఏర్పాటుచేసే ఈ టన్నెల్(Tunnel) మార్గంలో విశాలమైన కిటికీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారనేది మరో విశేషం. సముద్రం కింద 200 మీటర్ల దిగువన ప్రయాణం అంటే.. ఊహకందదనుకోండి. అక్కడ భారీ సొరచేపలు, తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలు ఈదుతూ ఉంటాయి. వాటి మధ్య ఈ హై స్పీడ్ ట్రైన్ రయ్..మని దూసుకుపోతుందన్న మాట. అనగా ప్రపంచంలోనే అతి పొడవైన ఆక్వేరియంలో సూపర్‌సోనిక్ వేగంతో పయనించినట్టుగా ఉంటుంది.
ప్రయోజనాలివే..
ఈ అండర్ వాటర్ టన్నెల్ ప్రాజెక్ట్ ద్వారా రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి.. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడం. మరొకటి.. భారత్ - దుబాయ్‌ల మధ్య చమురు, మంచినీటి సరఫరాల రవాణాను మరింత సులభతం చేయడం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం.. 50 బిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో, సుమారు 50వేల మందికి పైగా సిబ్బందిని నియమించనున్నట్టు తెలుస్తోంది. దీంతో ముంబయి ప్రపంచ కేంద్ర బిందువుగా మారడంతో పాటు ఇరు దేశాల మధ్య ప్రయాణ ఖర్చులు సుమారు 60 శాతం మేర తగ్గనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అండర్ వాటర్ రైలు మార్గాన్ని నిర్మించేందుకు ఇంకా కచ్చితమైన ప్రణాళికలు ఖరారు కానప్పటికీ.. దానిని అమలు చేసే దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి.
ఇవీ చదవండి: