Mohammed Siraj: ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై టీమిండియా పేసర్ గుస్సా.. స్పందించిన ఎయిర్‌లైన్స్
ABN , Publish Date - Nov 27 , 2025 | 09:47 AM
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆలస్యంగా టేకాఫ్ అవ్వడంపై టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మండిపడ్డారు. ఆలస్యానికి గల కారణాలను కూడా ప్రయాణికులకు సంస్థ వివరించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్‌పై మండిపడ్డారు. విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరిందని ఆయన అన్నారు. ఇందుకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయాణికులు పలుమార్లు ప్రయత్నించినా సంస్థ సరిగా స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు (Mohammed Siraj on AI Express).
గువాహటి-హైదరాబాద్ ఏఐ ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ బుధవారం సాయంత్రం 7.25 గంటలకు బయలుదేరాల్సి ఉండగా టేకాఫ్ ఆలస్యమైందని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. కానీ జాప్యానికి గల కారణాలను మాత్రం సంస్థ సరిగా వివరించలేదని ఆరోపించారు. ఎన్నిసార్లు ప్రయాణికులు అడిగినా సంస్థ నుంచి సరైన స్పందన లేకపోయిందని చెప్పారు. ఇలాంటి విషయాలు తెలియాలనుకోవడం ప్రయాణికుల ప్రాథమిక హక్కు అని అన్నారు. దారుణ ప్రయాణానుభవం మిగిలిందని కామెంట్ చేశారు.
ఈ పోస్టుపై ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎక్స్ వేదికగానే స్పందించింది. సిరాజ్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. అనుకోని కారణాల వల్ల ఆలస్యం జరిగిందని చెప్పింది. ప్రయాణికులకు కావాల్సిన సహాయసహకారాలు అందించామని తెలిపింది.
గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత్ దక్షిణాఫ్రికా చేతిలో 408 పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో, 0-2తో సిరీస్‌ను కోల్పోయింది. మ్యాచ్ అనంతరం సిరాజ్ హైదరాబాద్‌కు తిరిగొస్తుండగా జర్నీ ఆలస్యమైంది. ఇక స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ అవడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన టోర్నీలోనూ భారత్ 0-3 తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఇక నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
15 ఏళ్లుగా అలుపెరుగని ప్రయత్నం.. ఒక్క రాత్రిలో లైఫ్ ఛేంజ్
అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు.. హెచ్-1బీ వీసాదారుడి కామెంట్