Share News

Ambassador: ఈ పిల్లి.. స్టార్‌ హోటల్‌ ‘అంబాసిడర్‌’ మరి...

ABN , Publish Date - Dec 21 , 2025 | 01:27 PM

లండన్‌లో అత్యంత విలాసవంతమైన ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో ఒకటి ‘లేన్స్‌బరో’. 2019లో చిన్న పిల్లిపిల్లగా ఉన్నప్పుడు ఆ హోటల్‌లోకి ప్రవేశించింది లిలిబెట్‌. ఈ పిల్లిగారు అడుగుపెట్టిన వేళావిశేషం... ఆశ్చర్యంగా ఒక్కసారిగా హోటల్‌ లాభాలు చవిచూసిందట. అతిథులు అధిక సంఖ్యలో రావడం, హోటల్‌ రేటింగ్‌ పెరగడం, సిబ్బంది పనిలో ఉత్సాహం రెట్టింపైందట.

Ambassador: ఈ పిల్లి.. స్టార్‌ హోటల్‌ ‘అంబాసిడర్‌’ మరి...

అనగనగా ఓ పిల్లి. దాని పేరు ‘లిలిబెట్‌’. ‘మ్వావ్‌... ఇందులో స్పెషల్‌ ఏముంద’ని అప్పుడే పిల్లిమొగ్గలు వేయకండి. ఎందుకంటే... ఇది అలాంటిలాంటి పిల్లి కాదు. ఏకంగా ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కే బ్రాండ్‌ అంబాసిడర్‌.

ఇటీవల పిల్లులను స్ర్టెస్‌బస్టర్స్‌గా పరిగణిస్తూ... కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగాలు ఇచ్చారనే వార్తలు విన్నాం. ముక్కున వేలేసుకున్నాం. వాటికన్నా ‘లిలిబెట్‌’ ఒక అడుగు ముందుకేసింది. ప్రస్తుతం ఈ పిల్లిగారి సెలబ్రిటీ స్టేటస్‌ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఖరీదైన ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో దానికి పడుకోవడానికి లక్షల్లో విలువ చేసే ఓ పే...ద్ద సూట్‌ రూమ్‌, దాని బాగోగులు చూసుకోవడానికి ప్రత్యేకంగా క్యాట్‌ కమిటీ, స్పెషల్‌ వంటకాలు చేసి అందించడానికి ఓ మాస్టర్‌ చెఫ్‌... ఆగండాగండి... దాని దర్జా ఇంతటితో అయిపోలేదండోయ్‌... ఈ పిల్లిగారు ఉదయం నిద్ర లేవగానే రెడ్‌ కార్పెట్‌ పరిచి మరీ సిబ్బంది గ్రాండ్‌గా స్వాగతం పలుకుతారట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంటకం ‘కేవియర్‌’ ‘స్టార్‌’ పిల్లిగారి భోజనంలో భాగం. మెడలో ధగధగ మెరిసే బంగారు గొలుసుతో కనిపిస్తున్న లిలిబెట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియా సెలబ్రిటీ.


zzzz.jpg

లండన్‌లో అత్యంత విలాసవంతమైన ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో ఒకటి ‘లేన్స్‌బరో’. 2019లో చిన్న పిల్లిపిల్లగా ఉన్నప్పుడు ఆ హోటల్‌లోకి ప్రవేశించింది లిలిబెట్‌. ఈ పిల్లిగారు అడుగుపెట్టిన వేళావిశేషం... ఆశ్చర్యంగా ఒక్కసారిగా హోటల్‌ లాభాలు చవిచూసిందట. అతిథులు అధిక సంఖ్యలో రావడం, హోటల్‌ రేటింగ్‌ పెరగడం, సిబ్బంది పనిలో ఉత్సాహం రెట్టింపైందట. దాంతో యాజమాన్యం ఈ పిల్లికి ముద్దుగా ‘లిలిబెట్‌’ అని నామకరణం చేసి, ఏకంగా ఆ హోటల్‌కే ‘బ్రాండ్‌ అంబాసిడర్‌’ని చేసింది. అంతేకాదు హోటల్‌లో లిలిబెట్‌ పేరు మీద ఒక కాక్‌టైల్‌ కూడా ఉండటం విశేషం.


zzzzz.jpg

ఈ పిల్లి సైబీరియన్‌ అడవి జాతికి చెందింది. లిలిబెట్‌ హోటల్‌ లాబీలో రోజంతా అటూఇటు తిరుగుతూ, సోఫాలపై చెంగు చెంగున గెంతుతూ... వచ్చే అతిథులను వయ్యారంగా పలకరిస్తుంటుంది. బాగా అలసిపోయాక అక్కడున్న గ్రాండ్‌ పియానోపైకి ఎక్కి ఎంచక్కా విశ్రాంతి తీసుకుంటుంది. ఆకుపచ్చ కళ్లు, కారామిల్‌ రంగులో ఉన్న ఈ పిల్లే స్టార్‌హోటల్‌కి ప్రత్యేక ఆకర్షణ. ప్రత్యేకంగా ఈ పిల్లి ప్రదర్శించే హావభావాలు, చేసే అల్లరి చేష్టలను చూడటానికి సందర్శకులు ఈ హోటల్‌కి వెళ్తారట. సెలబ్రిటీలు సైతం లిలిబెట్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ మురిసిపోతుంటారు. దటీజ్‌ ది గ్రేట్‌నెస్‌ ఆఫ్‌ లిలిబెట్‌.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు

చిరిగిన జీన్స్‌.. స్లీవ్‌లెస్ పై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2025 | 01:52 PM