Divorce Over Kids Surname: పిల్లలకు తన ఇంటి పేరు పెట్టుకోనివ్వలేదని భార్యకు విడాకులు
ABN , Publish Date - Feb 18 , 2025 | 10:28 AM
చైనాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బిడ్డలకు తన ఇంటిపేరు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఓ భర్త తన భార్యకు విడాకులిచ్చేశాడు. అయితే, పిల్లల కస్టడీ కూడా కోర్టు మహిళకే అప్పగించడంతో చివరకు అతడు షాక్‌కు గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలకు తన ఇంటి పేరును పెట్టుకోనివ్వడం లేదని భార్యపై ఆగ్రహించిన ఓ భర్త చివరకు విడాకులు తీసుకున్నాడు. అయితే, అతడి సంతానం కస్టడీని మహిళకే అప్పగించడంతో అతడు చివరకు కంగుతిన్నాడు. నెట్టింట కూడా అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో జరిగిన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..
షాంఘాయ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, సదరు వ్యక్తి పేరు షావ్, అతడి భార్య ఇంటి పేరు జీ. ఈ దంపతులకు 2019లో ఓ పాప జన్మించింది. పాపకు తండ్రి ఇంటి పేరు ఇచ్చారు. మరో రెండేళ్లకు కొడుకు జన్మించగా అతడికి తల్లి ఇంటి పేరు ఇచ్చారు (Viral).
Groom Returns Dowry: వరుడికి రూ.5.51 లక్షల కట్నం! ఆ మరుక్షణం అతడు చేసింది చూసి..
ఇదే ఆ దంపతుల మధ్య వివాదానికి దారి తీసింది. కొడుకుకు కూడా తన ఇంటి పేరే పెట్టాలని షావ్ పట్టుబట్టడం ప్రారంభించాడు. చివరకు వారి మధ్య గొడవలు పతాకస్థాయికి చేరుకోవడంతో భార్యకు విడాకులు ఇచ్చేశాడు. 2023లో వారి విడాకులు ఖరారైయ్యాయి.
ఆ తరువాత పిల్లల కస్టడీ విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ వివాదం మొదలైంది. విడాకుల తరువాత పిల్లలిద్దరూ తల్లి వద్ద ఉంటున్నారు. కూతురిని తనకు అప్పగించాలని భర్త డిమాండ్ చేశాడు. కొడుకును మాత్రం తల్లి వద్ద ఉండేందుకు అంగీకరించాడు. కానీ భార్య మాత్రం అతడి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. పిల్లలిద్దరూ తన వద్దే ఉండాలని పట్టుబట్టింది. వివాదం మళ్లీ కోర్టు ముందుకొచ్చింది.
Viral: పారాషూట్‌తో ఎగ్జామ్ సెంటర్‌లో దిగిన విద్యార్థి! ఎందుకో తెలిస్తే..
అయితే, కోర్టు మాత్రం పిల్లల సంరక్షణ రీత్యా మహిళ వాదనవైపే మొగ్గుచూపింది. ఇంతకాలంగా పిల్లలు తల్లి వద్దే ఉంటున్న కారణంగా వారి కస్టడీని తల్లికే అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. పిల్లలకు ఇదే మేలని స్పష్టం చేసింది. పిల్లల మేజర్ల అయ్యే వరకూ వారి పోషణ ఖర్చులు చెల్లించాలని తండ్రిని ఆదేశించింది. ఇలాంటి సందర్భాల్లో చైనాలో కోర్టులు పిల్లల కస్టడీని తల్లికే అప్పగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఈ వివాదం కారణంగా అతడికి భార్యాపిల్లలు దూరమవగా నెట్టింట కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత చిన్న విషయానికి విడాకులు ఎవరైనా ఇస్తారా అంటూ నెటిజన్లు అతడిపై గుస్సా అయిపోయారు. పిల్లలకు ఎవరి పేరు పెడితే ఏమిటి? భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.