PSU Bank Job: ప్రభుత్వ బ్యాంకు జాబ్.. ఇక భరించలేనంటూ నెట్టింట వ్యక్తి పోస్టు
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:26 AM
ప్రభుత్వం బ్యాంకు జాబ్ ఒకప్పటిలా లేదంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒత్తిడి తట్టుకోలేక తాను జాబ్ నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నట్టు అతడు తెలిపాడు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ ప్రభుత్వ బ్యాంకులో 15 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఒకరు తాజాగా నెట్టింట తన ఆవేదనను పంచుకున్నారు. పనిలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, కోల్పోతున్న వ్యక్తిగత జీవితం కారణంగా తాను ఉద్యోగం నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే డ్యూటీకి వెళ్లడం మానేశానని అన్నారు (Government Bank Job Suffocating).
‘నా వయసు 39 ఏళ్లే. ప్రభుత్వ బ్యాంకులో జాబ్ చేస్తున్న నాకు ప్రస్తుతం అక్కడ ఊపిరాడనట్టుగా అనిపిస్తోంది. ఇక నేనీ జాబ్ చేయలేనని అనిపిస్తోంది’ అంటూ అతడు తన ఆవేదనను వెళ్లబోసుకున్నాడు. తనకు ఈ రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉందని అన్నాడు. ఆల్ ఇండియా స్థాయి పోటీ పరీక్షలో నెగ్గి తన కలను నెరవేర్చుకున్నట్టు చెప్పాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులో జాబ్ అంటే ఆర్థిక స్థిరత్వం, మంచి ఇల్లు, కారు, సమాజంలో గౌరవం ఉంటుందని మొదట్లో అనుకున్నానని, కానీ కాలక్రమంలో పరిస్థితి వేగంగా మారిపోయిందని తెలిపాడు ( PSU bank employee quits job).

జాబ్‌లో తీవ్ర ఒత్తిడుల కారణంగా తనకు బీపీ, థైరాయిడ్ సమస్యలు, ఫ్యాటీ లివర్ వచ్చాయని అన్నాడు. పని పేరిట సుదూర ప్రాంతాలకు తరచూ ట్రాన్స్‌ఫర్ అవుతుండేదని చెప్పాడు. సేల్స్ టార్గెట్‌ను కచ్చితంగా పూర్తి చేయాల్సిన పరిస్థితి, అనేక సందర్భాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకూ పని చేయాల్సి రావడాలు వంటివి తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఇన్సూరెన్స్ పాలసీలను బలవంతంగా విక్రయించాల్సి వచ్చేదని అన్నాడు. టార్గెట్స్ చేరుకునేందుకు వారాంతాల్లో కూడా పని చేయాల్సి వచ్చేదని అన్నాడు (Indian workplace Stress).
ఇక పైఅధికారులు కూడా ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉండేవారని అన్నారు. కనీసం తన గోడును వెళ్లబోసుకునే అవకాశం కూడా ఉండేది కాదని అన్నారు. తన సహోద్యోగుల్లో అనేక మంది ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితిని తట్టుకోలేక తాను సర్వీసులో ఉన్నప్పటికీ ఆఫీసుకు వెళ్లడం కూడా మానేశానని చెప్పారు. ‘ఇక నా శాలరీ ఆగిపోతుంది. ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. కానీ నా జీవితం నాకు తిరిగొస్తుంది’ అని పోస్టు ముగించాడు. ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
ఇవి కూడా చదవండి:
3 సార్లు హెచ్-1బీ వీసాలో నిరాశ.. పంతం పట్టి కల నెరవేర్చుకున్న యువకుడు
వియత్నాంలో భారత జంట చోరీ.. వీడియో వైరల్