Mswati 3 Viral Video: ఈ రాజుకు 15 మంది భార్యలు.. షాకింగ్ వీడియో వైరల్
ABN , Publish Date - Oct 06 , 2025 | 07:35 PM
ఆఫ్రికా దేశమైన ఎస్వాతినీ రాజు మూడవ మెస్వాతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 15 మంది భార్యలతో ప్రైవేట్ జెట్‌లో అబుదాబికి వెళ్లిన ఆయనను చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక సమాజంలో ప్రజలు ప్రజాస్వామ్యానికే జైకొడుతున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం రాచరిక పాలన కొనసాగుతోంది. అయితే, ఆఫ్రికాలోని ఎస్వాతిని దేశ రాజు మూడవ మెస్వాతి ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. 15 మంది భార్యలు, 100 మంది సహాయకులతో కూడిన భారీ పరివారంతో అబుదాబీకి వచ్చిన ఆయన వీడియో ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. ఈ ఏడాది జులైలో ఆయన అబుదాబీలో పర్యటించగా.. ప్రస్తుతం ఆ వీడియోలు లీకై కలకలం రేపుతున్నాయి (King Mswati III Viral Video).
ఎస్వాతినీ దేశ చరిత్ర ఇదీ..
ఆఫ్రికా దేశమైన ఎస్వాతినీలో 300 ఏళ్లుగా రాచరికం కొనసాగుతోంది. మూడవ మెస్వాతి 1986లో తండ్రి నుంచి దేశ పగ్గాలను తీసుకున్నారు. మెస్వాతి తండ్రికి ఏకంగా 72 మంది భార్యలు ఉండేవారట. ఆయన దాదాపు 82 ఏళ్లపాటు దేశాన్ని పాలించాడు. ఇక తండ్రి తరువాత అధికారంలోకి వచ్చిన మెస్వాతి.. దేశంపై ప్రజాస్వామ్య నీడ పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. అన్నీ తానై దేశాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు. అక్కడి న్యాయాధికారం, చట్టాలు చేసే అధికారం, కార్యనిర్వాహక వ్యవస్థకూ ఆయనే అధిపతి (Eswatini king).
దేశంలో రాజకీయ పార్టీలపై నిషేధం విధించారు. రాజుపై నిరసనను అత్యంత కర్కశకంగా అణచివేస్తారు. పౌర స్వేచ్ఛ అనేదే ఉండదు. ప్రధాని, చట్టసభల సభ్యులను రాజే నియమిస్తాడు. 2005లో పేరుకు ఓ రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నా ఇప్పటివరకూ ప్రజాస్వామ్య సంస్కరణల ఊసే లేదు. పేదరికం, అవినీతి, అణచివేత అక్కడ తీవ్రస్థాయిలో ఉన్నాయని మానవ హక్కులు సంఘాలు నిత్యం ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. 2018 వరకూ ఈ దేశాన్ని స్వాజీల్యాండ్ అని పిలిచేవారు. ఆ తరువాత రాజు తమ సంస్కృతికి అద్దం పట్టేలా ఎస్వాతిని అని దేశానికి కొత్త పేరు పెట్టుకున్నారు (African royalty).
ఇక భారీ విమానాల్లో రాజు జల్సా పర్యటనలపై వెళుతుంటే ప్రజలు మాత్రం కటిక పేదరికంలో మగ్గుతుంటారు. అక్కడి ప్రజల్లో 60 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారట. ఇక అబుదాబీ పర్యటన సందర్భంగా మెస్వాతి 15 మంది భార్యలు, 30 మంది సంతానం, మరో 100 మంది సహాయకులతో కనిపించారు. ఒకవైపు ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే రాజు మాత్రం కనీవినీ ఎరుగని స్థాయిలో విలాసవంతమైన జీవితం గడుపుతుండటంపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి:
భారతీయులను స్విట్జర్‌ల్యాండ్ హోటల్ ఇలా అనేసరికి నేను హర్ట్ అయ్యా.. ఓ డాక్టర్ ఆవేదన
అరట్టై యాప్‌వైపు మొగ్గు చూపిన ఆనంద్ మహీంద్రా.. ధన్యవాదాలు తెలిపిన జోహో ఫౌండర్