Etiquette Issues: భారతీయులను స్విట్జర్‌ల్యాండ్ హోటల్ ఇలా అనేసరికి నేను హర్ట్ అయ్యా.. ఓ డాక్టర్ ఆవేదన
ABN , Publish Date - Oct 05 , 2025 | 09:52 PM
భారతీయులు బఫేలో ఫుడ్‌ను తీసుకెళ్లొద్దంటూ స్విట్జర్‌లాండ్‌లోని ఓ హోటల్ చేసిన సూచన తన మనసును గాయపరిచిందని ఓ డాక్టర్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను నెట్టింట ఆయన షేర్ చేసుకోగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: స్విట్జర్‌లాండ్ పర్యటనలో ఉండగా తనకు ఎదురైన ఓ దారుణ అనుభవాన్ని వివరిస్తూ ఓ భారతీయ డాక్టర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కొన్నేళ్ల క్రితం తనకు ఎదురైన ఈ అనుభవం ఇప్పటికీ తనను కలిచివేస్తోందంటూ అర్షిత్ ధమ్నాస్కర్ ఎక్స్ వేదికగా ఈ పోస్టు పెట్టారు (Hotel Etiquette).
‘కొన్నేళ్ళ క్రితం నేను నా కుటుంబంతో కలిసి స్విట్జర్‌లాండ్‌కు వెళ్లాను. అక్కడి హోటల్ వాళ్లు భారతీయులను ఉద్దేశించి ఓ సూచన చేశారు. బఫేలో ఆహారాన్ని పర్సుల్లో పెట్టుకుని తీసుకెళ్లిపోవద్దని నిర్మొహమాటంగా చెప్పేశారు. కావాలంటే ప్రత్యేకంగా ఫుడ్‌ను ప్యాక్ చేసి ఇస్తామన్నారు. ఇది చూడగానే నాకు బాధగా అనిపించింది. వాళ్లు భారతీయులను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇలా చెప్పడంతో నేను కంగు తిన్నాను’ అని చెప్పారు (Indian Tourists).
‘వాళ్లు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైంది. బఫేలో కావాల్సినంత తొనచ్చని అన్నంత మాత్రాన నిజంగానే అలా చేయకూడదు. జీవితానికి సరిపడినంత ఫుడ్‌ను సర్దుకుని తీసుకెళ్లిపోకూడదు. కానీ నన్ను హర్ట్ చేసిందేంటంటే.. ప్రత్యేకంగా భారతీయులను ప్రస్తావించడమే’ అని అన్నారు.
ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘కొందరు భారతీయ టూరిస్టుల తీరు అభ్యంతరకరం అన్నది వాస్తవమే. కానీ భారతీయులతో పాటు ఇతర దేశాలు వారూ ఇలా చేయడం నేను చూశాను. ఫైస్టార్ హోటల్స్‌లో కొందరు దక్షిణ కొరియా, చైనా కార్పొరేట్ గెస్టులు ఇలా చేస్తారు’ అని ఓ యూజర్ అన్నారు. ఐరోపా దేశాలు వారు ఇలా చేయడం తాను చూశానని మరో వ్యక్తి చెప్పారు. అయితే భారతీయుల తీరు మాత్రం మరో రేంజ్‌లో ఉంటుందని చెప్పారు. భారతీయుల తీరు దారుణమని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
అరట్టై యాప్‌వైపు మొగ్గు చూపిన ఆనంద్ మహీంద్రా.. ధన్యవాదాలు తెలిపిన జోహో ఫౌండర్
కట్నం వద్దన్నందుకు పెళ్లి రద్దు.. యువకుడికి ఊహించని షాక్