Brides Master Plan: వారెవ్వా.. కొత్త వధువుల మాస్టర్ ప్లాన్.. మత్తుమందు పెట్టి డబ్బు, బంగారం దోచేశారు!
ABN , Publish Date - Oct 14 , 2025 | 09:51 AM
అలీఘర్‌లో ఏకంగా 12 ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వధువులు తమ కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన భోజనాన్ని పెట్టి అక్కడినుంచి డబ్బు, నగలతో జంప్ అయ్యారు. ముందుగా వారు పండుగ రోజు ఇంట్లో గోరింటాకు పెట్టుకొని ఎంతో సందడిగా కనిపించారు. అందరితో నమ్మకంగా ఉంటూ ఇంట్లో దేవతలకు పూజలు చేసి రోజంతా ఉపవాసం ఉన్నారు. తమ భర్తలకు హారతి ఇచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్లు అందరిని నమ్మించారు. భోజన సమయం ఎప్పుడెప్పుడు అవుతుందా? అంటూ ఆలోచిస్తూ మనసులో పన్నాగాలు పన్నుతున్నారు.
దేశ వ్యాప్తంగా మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దొంగలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్ట్రాటజీలతో మోసాలకు తెరలేపుతున్నారు. మహిళలు సైతం విపరీతమైన అడ్డదారుల్లో చోరీలు చేస్తున్నారు. కొందరు మహిళలు మరీ ముఖ్యంగా నెలలు తరబడి డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో నమ్మకంగా ఉండి, అనువైన సమయం చూసుకొని డబ్బు నగలతో చెక్కేస్తున్నారు. హైదరాబాద్, తిరుపతిలో ఇలాంటి ఘరానా మోసం వెలుగు చూడగా.. తాజాగా మరో ఘటన తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. కొంత మంది మహిళలు పెళ్లిళ్లు చేసుకొని భర్తతో నమ్మకంగా కొన్ని నెలలు ఉండి సమయం చూసుకొని డబ్బు, నగలతో జంప్ అయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మంది మహిళలు ఇలాగే తమ భర్తలను మోసం చేసి డబ్బు, నగలతో చెక్కేశారు. తీవ్ర విస్మయానికి గురిచేస్తున్న ఈ ఘటనపై పోలీసులు దృష్టి పెట్టారు. కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర భారతంలో కర్వా చౌత్ అనే హిందూ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తమ భర్తలకు వందేళ్ల ఆయుష్షు కోరుకుంటూ భార్యలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి ఈ పండుగను ఘనంగా చేసుకుంటారు. ఈ పండుగ రోజే మహిళలు దారుణమైన మోసం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అలీఘర్‌లో ఏకంగా 12 ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వధువులు తమ కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన భోజనాన్ని పెట్టి అక్కడినుంచి డబ్బు, నగలతో జంప్ అయ్యారు. ముందుగా వారు పండుగ రోజు ఇంట్లో గోరింటాకు పెట్టుకొని ఎంతో సందడిగా కనిపించారు. అందరితో నమ్మకంగా ఉంటూ ఇంట్లో దేవతలకు పూజలు చేసి రోజంతా ఉపవాసం ఉన్నారు. తమ భర్తలకు హారతి ఇచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్లు అందరిని నమ్మించారు. భోజన సమయం ఎప్పుడెప్పుడు అవుతుందా? అంటూ ఆలోచిస్తూ మనసులో పన్నాగాలు పన్నుతున్నారు. రాత్రి భోజన సమయం కాగానే అన్నంలో మత్తుమందు కలిపారు. ఉపవాసం ముగించిన తర్వాత ఆ అన్నాన్ని అందరికీ వడ్డించారు. వారంతా స్పృహలోకి జారుకోగానే ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు, ఫోన్లు అన్ని ఒక బ్యాగులో పెట్టుకొని అక్కడినుంచి పరారయ్యారు.
మత్తుతో నిద్రించిన వారికి ఉదయం మెలకువవచ్చింది. కుటుంబ సభ్యులు వధువులు కనిపించకపోవడం, ఇల్లంతా చిందర వందరగా ఉండటం గమనించి షాక్ అయ్యారు. ఏం జరిగిందో అని నిద్ర కునుకు నుండి తేరుకొని ఇంట్లో వాళ్ళందరినీ నిద్రలేపారు. ఇంట్లోని లాకర్లు తెరిచి చూడగా ఖాళీగా ఉండటం చూసి ఒక్కసారిగా ఖంగారు పడ్డారు. ఇలాంటి ఘటన తమ కుటుంబంలోనే జరిగిందని ఇంట్లో వారు అనుకుంటుండగా.. ఒక్కొక్క ఘటన వెలుగులోకి వచ్చింది. మా ఇంట్లో కూడా ఇలాగే జరిగింది అంటూ కుటుంబ సభ్యులు రోదించారు. తమ డబ్బు, నగలు పోయాయని వాళ్లు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
12 కుటుంబాల నుంచి మొత్తంగా రూ.30 లక్షలకు పైగా డబ్బు, సొత్తు అపహరించుకుపోయారని వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకేసారి ఇలా 12 ఇళ్లల్లో ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులే ఆశ్ఛర్యానికి గురయ్యారు. ఇందులో ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ దాగివుందని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. ఆ దిశగా విచారణ చేపట్టారు. వధువులు డబ్బు, నగలతో పరారవ్వడంతో దర్యాప్తులో స్పీడు పెంచారు. మరింత సమాచారం రాబట్టేందుకు అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పెళ్లిళ్లు చేసిన ఏజెంట్ల ఫోటోలు, పత్రాలను సేకరించి.. ఖి'లేడి'లను పట్టుకోవడానికి బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే పక్కా ప్లాన్ ప్రకారం ఇది ఓ ముఠా చేసిన పని అని పోలీసులు వెల్లడించారు. ఈ దోపిడీ వెనక బ్రోకర్లు కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్నారు. కొందరు దుర్మార్గులు ముఠాగా మారి, అమ్మాయిలను డబ్బున్న అబ్బాయిలతో పెళ్లి చేసి అనువైన సమయం చూసుకొని డబ్బు, నగలతో ఉడాయించాలని ముందే ప్లాన్ చేసుకుని ఈ మోసాలు చేస్తున్నట్లు తెలిపారు. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి.. ఒక్కో పెళ్లికి రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేశారని వివరించారు. పెళ్లిళ్లు చేసుకున్న కొద్ది రోజుల్లోనే తమ భర్త, అత్తమామల వద్ద నమ్మకంగా ఉంటూ వారితో మంచివారిగా నటించారని చెప్పారు. కొందరు గుడికి వెళ్లడం, మరికొందరు పనుల్లో సహాయం చేయడం వంటివి చేస్తూ ఎలాంటి డౌట్ రాకుండా తమ మోసాన్ని సాఫీగా చేసుకున్నారని వివరించారు. ఈ ఘటనలో కొత్తగా పెళ్ళైన బాధితుడు లబోదిబోమన్నాడు. తమ పెళ్లి జరిగి 10 రోజులే అయిందని.. కర్వా చౌత్ పండగ రోజు తన భార్య ఎంతో ప్రేమతో పూజ చేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పొద్దున్న లేచే సరికి ఇల్లంతా లూటీ చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
Women Viral Video: హుండీ నిండిందని సంతోషంగా పగులగొట్టింది.. లోపలి దృశ్యం చూసి ఖంగుతింది!
Driver falls asleep: ట్రక్ నడుపుతూ నిద్రపోయిన డ్రైవర్.. ఏం జరిగిందో చూడండి..