Jyotirao Phule: 'సత్యశోధక్ సమాజ్' స్థాపకులు జ్యోతిబా ఫూలే వర్ధంతి నేడు..
ABN , Publish Date - Nov 28 , 2025 | 10:43 AM
జ్యోతిబా ఫూలే.. ఈయనను మహాత్మా ఫూలే అని కూడా పిలుస్తారు. గొప్ప విద్యావేత్తగా ప్రసిద్ధిగాంచిన ఫూలే.. భారత దేశంలో మహిళలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన సంఘ సంస్కర్త కూడా. 1827 ఏప్రిల్ 11న జన్మించిన ఈయన.. 1890 నవంబర్ 28న మరణించారు. నేడు ఫూలే వర్ధంతి సందర్భంగా..ఈ ప్రత్యేక కథనం మీకోసం..
ఇంటర్నెట్ డెస్క్: బహుజనులకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు జ్యోతిబా ఫూలే. ఈయన 1827 ఏప్రిల్ 11న ప్రస్తుత పశ్చిమ మహారాష్ట్రలో జన్మించారు. ఈయన పూర్తి పేరు జ్యోతిరావు గోవిందరావు ఫూలే. అణచివేతకు గురైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి తన జీవితాన్ని అంకితం చేశారు. వారికి సాధికారత కల్పించడంలో ఎంతో కృషిచేసిన సామాజిక సంస్కర్త, విద్యావేత్త ఫూలే. ఆది నుంచీ కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూనే, మహిళ విద్య కోసం ఎనలేని కృషి చేశారు. స్త్రీలు సమానత్వం పొందాలంటే విద్య తప్పనిసరి అని విశ్వసించి.. 1848లో పుణెలో బాలికల కోసం తొలిసారిగా పాఠశాలను స్థాపించారు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 18 పాఠశాలలను ప్రారంభించారు ఫూలే దంపతులు. బాల్య వివాహాలకు ప్రతికూలంగా ఉంటూనే.. వితంతు పునర్వివాహానికి మద్దతుగా నిలిచారు ఫూలే.
ఫూలే.. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు మద్దతుగా.. గులాంగిరి(1873), సామాజిక సంస్కరణ తత్వశాస్త్రాన్ని వివరించే.. సర్వజనిక్ సత్యధర్మ(1885), భారతీయ సమాజంలో స్త్రీ పురుషుల స్థితిగతులను పోలుస్తూ.. స్త్రీ పురుష తులనం(1890) వంటి ప్రముఖ రచనలు చేశారు. ఈయన రచనలు దేశంలోని మహిళలు, అణగారిన వర్గాల జీవితాలపై తీవ్రంగా ప్రభావం చూపాయి. సామాజిక న్యాయం, సమానత్వాన్ని విశ్వసించే వారందరికీ నాడు ఆయనో మార్గదర్శిగా నిలిచారు. దళితులకు, అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించారు జ్యోతిరావు ఫూలే. సామాజిక సంస్కరణల కోసం ఆయన చేసిన అవిశ్రాంత కృషికి 1888లో 'మహాత్మా' అనే బిరుదు వచ్చింది. అయితే.. అదే ఏడాది ఆయనకు స్ట్రోక్ రావడంతో పక్షవాతానికి గురయ్యారు. అనంతరం.. 1890లో తన 63ఏళ్ల వయసులో మరణించారు.
మానవాళికి స్ఫూర్తినిచ్చే కొన్ని 'మహాత్మా' సూక్తులు:
దేవుడు ఒక్కడే.. మానవులందరూ ఆయన పిల్లలే. ఆయనే ప్రతిదానికీ సృష్టికర్త
మంచి పని చేసేందుకు తప్పుడు మార్గాలను అన్వేషించకూడదు.
మీ పోరాటంలో చేరే వారి కులం అడగకండి.
ఆహారపు అలవాట్లు, వివాహ బంధాలపై కులపరమైన ఆంక్షలు ఉన్నంత వరకూ భారతదేశంలో జాతీయవాద భావన అభివృద్ధి చెందదు.
జుట్టు కత్తిరించే క్షురకుడికి, చెప్పులు కుట్టేవారికి, పూజలు చేసే బ్రాహ్మణులకు ఇవన్నీ మతాలు కాదు.. అవి వారి వ్యాపారం.
కులతత్వాన్ని నిర్మూలించడం మన సామాజిక బాధ్యత.
మానవులందరూ సమానమే. కులం ఆధారంగా ఎవరినీ వివక్షకు గురిచేయకూడదు.
సద్భావన, సానుభూతి మానవ జీవితానికి ఆధారం.
స్త్రీ, పురుషులు ఇరువురూ సమానమే.
అన్ని జీవుల పట్ల దయ, కరుణ కలిగి ఉండాలి.
ఇవీ చదవండి:
కూలుతున్న భవిష్యత్ తరం!