Share News

Rising Student Suicides in India: కూలుతున్న భవిష్యత్‌ తరం!

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:11 AM

మాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయి.. బాగా కష్టపడి చదువు.. నీ భవిష్యత్తు కోసమే చెబుతున్నాఅంటూ తండ్రి మందలించిన తెల్లారే పదో తరగతి విద్యార్థిని అయిన కుమార్తె అపార్ట్‌మెంట్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ‘ఇంకా ఎన్ని రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉంటావు.. ఉన్నది చాలు..

Rising Student Suicides in India: కూలుతున్న భవిష్యత్‌ తరం!

  • విద్యార్థుల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు.. గత పదేళ్లలో 65 శాతం పెరుగుదల

‘మాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయి.. బాగా కష్టపడి చదువు.. నీ భవిష్యత్తు కోసమే చెబుతున్నా’ అంటూ తండ్రి మందలించిన తెల్లారే పదో తరగతి విద్యార్థిని అయిన కుమార్తె అపార్ట్‌మెంట్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ‘ఇంకా ఎన్ని రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉంటావు.. ఉన్నది చాలు.. స్కూలుకు వెళ్లు!’ అని తల్లిదండ్రులు కోప్పడినందుకు 8వ తరగతి విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ రెండు ఘటనలూ ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. దేశంలో పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు ఇవి నిదర్శనాలు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు మీడియాలో ప్రముఖంగా కనిపించేవి. వాటి స్థానంలో ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. వినటానికి నమ్మశక్యంగా లేకపోవచ్చుగానీ.. నేడు దేశంలో రైతులు, ఉద్యోగులు తదితర వర్గాల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే అధికంగా ఉంటున్నాయి. రైతుల ఆత్మహత్యలు సమాజంలో కలిగించే కలకలం, వాటికి మీడియా ఇచ్చే ప్రాధాన్యం విద్యార్థుల ఆత్మహత్యలకు ఇవ్వకపోవటంతో ఆ అంశం బలంగా ముందుకు రావటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ప్రతీ 42 నిమిషాలకు ఒక విద్యార్థి ప్రాణాల్ని తీసుకుంటున్నాడని జాతీయ నేర గణాంకాల విభాగం చెబుతోంది. దేశంలో ఆత్మహత్యలు ఏటా సగటున 2 శాతం చొప్పున పెరుగుతుండగా.. విద్యార్థుల్లో మాత్రం ఇది 4 శాతంగా నమోదవుతోంది. రైతుల ఆత్మహత్యలు ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతుండగా.. విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం పెరుగుతుండటం ఆందోళన కలిగించే పరిణామం.

పదేళ్లలో 65 శాతం పెరుగుదల

2013-2023 మధ్య నమోదైన గణాంకాల్ని పరిశీలిస్తే.. 2013లో 8,423 మంది విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకోగా, 2023లో 13,892 మంది ప్రాణాలు తీసుకున్నారు. అంటే, పదేళ్లలో 65 శాతం పెరిగిపోయాయి. ఇదే పదేళ్లలో దేశంలో మొత్తం ఆత్మహత్యలు 27 శాతం పెరిగాయి (2013లో 1.35 లక్షలు కాగా 2023లో 1.71 లక్షలు). మొత్తం ఆత్మహత్యల్లో విద్యార్థుల ఆత్మహత్యలు 2013లో 6.2 శాతం కాగా, 2023లో అది 8.1 శాతానికి పెరిగాయి. ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్థుల్లో బాలికల కంటే బాలురు అధికంగా ఉంటున్నారు.


కారణాలేమిటి?

విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరిగిపోవటానికి పలు కారణాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవి.. మార్కులు, ర్యాంకుల కోసం ఇతర విద్యార్థులతో ఉండే పోటీ, విరామం లేకుండా సుదీర్ఘంగా ఉంటున్న కాలేజీ, రీడింగ్‌ అవర్స్‌, మంచి ర్యాంకు తెచ్చుకోవాలంటూ కుటుంబపరంగా ఉండే ఒత్తిడి, కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలు, ఉద్యోగం లభిస్తుందో లేదోనన్న ఆందోళన, నిరాశలో కూరుకుపోయిన విద్యార్థిని ఓదార్చి, ధైర్యం ఇచ్చే వ్యక్తులు, వ్యవస్థలు అందుబాటులో లేకపోవటం మొదలైనవి. కరోనా సమయంలో విద్యాసంస్థలు మూతబడిపోయి విద్యార్థులు ఇంటికే పరిమితమైన సమయంలో వారిలో ఒంటరితనం, అనిశ్చితి వంటివి పెరిగిపోయాయని, తర్వాత కూడా వీటి ప్రభావం కొనసాగుతోందని చెబుతున్నారు. గణాంకాలు కూడా దీనికి అనుగుణంగా ఉండటం గమనార్హం. 2019 నుంచి 2023 మధ్య విద్యార్థుల ఆత్మహత్యలు ఏకంగా 34 శాతం పెరిగాయని జాతీయ నేర గణాంకాల విభాగం వెల్లడించింది.

నివారణ మార్గాలు

  • తమ పిల్లలు తమ ముందు స్వేచ్ఛగా అభిప్రాయాల్ని, భావోద్వేగాల్ని వెల్లడించే

  • స్వేచ్ఛ, వాతావరణం ఇంట్లో తల్లిదండ్రులు కల్పించాలి. పిల్లలు తమ సమస్యలు చెప్పినప్పుడు సావధానంగా విని, తామున్నామనే భరోసా కల్పించాలి. మార్కులు, ర్యాంకులు అవసరమేగానీ.. వాటి కోసం పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావొద్దు.

  • సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటైన పిల్లలు సెల్‌ఫోన్‌ మీద ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఒంటరితనంలో కూరుకుపోతున్నారు. దీనిని జాగ్రత్తగా మాన్పించాలి. వారితో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలి.

  • స్కూళ్లు, కాలేజీలు కెరీర్‌ కౌన్సెలింగ్‌కు ఇస్తున్న ప్రాధాన్యం.. సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌కు ఇవ్వటం లేదన్న విమర్శలున్నాయి. విద్యార్థుల్లో ఆదుర్దా, డిప్రెషన్‌ వంటి సమస్యలను నివారించటానికి మానసిక కౌన్సెలర్లను నియమించుకోవాలి. వారి సేవలు విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలి.

  • విద్యార్థి చదువుల్లో వెనకబడుతున్నప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికి బదులు కారణాలేమిటో కనుక్కొని వాటిని పరిష్కరించే దిశగా విద్యాసంస్థలు కృషి చేయాలి. అందుకు తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి.

  • విద్యార్థుల మధ్య, విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య సహృద్భావ వాతావరణం నెలకొనేలా విద్యాసంస్థలు చర్యలు తీసుకోవాలి.

  • ఆత్మహత్య వంటి తీవ్రమైన ఆలోచనలతో విద్యార్థి ఉన్నట్లు గమనిస్తే.. తల్లిదండ్రులుగానీ, విద్యాసంస్థలుగానీ మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.

  • విద్యార్థుల్లో వ్యాయామం, యోగా, ధ్యానం, తగినంత సమయం నిద్రపోవటం వంటి మంచి అలవాట్లను పెంపొందించటం ద్వారా వారిలో నిరాశ వంటివి దరిచేరకుండా చేయవచ్చు.

  • ప్రభుత్వాల పరంగా పరీక్షల్లో సంస్కరణలు, మానసిక నిపుణుల సేవలను అందుబాటులో ఉంచటం, ఉపకారవేతనాలు అందించి ఆర్థికపరమైన సమస్యలు లేకుండా చేయటం, విద్యాసంస్థలకు తగిన నిబంధనల్ని నిర్దేశించటం వంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • ఒత్తిడి బారిన పడిన విద్యార్థులకు చేయూత అందించటం కోసం 2020లో కేంద్రప్రభుత్వం మనోదర్పణ్‌ పేరుతో టెలీ కౌన్సెలింగ్‌ సేవల్ని ప్రారంభించింది. ఆత్మహత్యల నివారణకు పలు స్వచ్ఛందసంస్థలు కూడా సమర్థవంతమైన సేవల్ని అందిస్తున్నాయి. వాటి సేవల్ని కూడా వినియోగించుకోవచ్చు.

- సెంట్రల్‌ డెస్క్‌


లక్షణాలు

యుక్తవయస్కుల్లో ఆదుర్దా, డిప్రెషన్‌ వంటివి పెరుగుతున్నాయని, కానీ, ఈ లక్షణాల్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీవ్రంగా తీసుకోకుండా, చదువుల మీద శ్రద్ధ లేకపోవటం, బద్ధకం అని భావిస్తున్నారని డాక్టర్‌ శివప్రసాద్‌ అనే సైకియాట్రిస్ట్‌ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, వాటిని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘కుటుంబం నుంచి దూరంగా, ఒంటరిగా ఉండటం. స్నేహితుల్ని కలవకపోవటం, అమితంగా బాధపడటం, చిరాకు, కోపం పెరగటం, తరచూ ఏడవటం, వ్యక్తిత్వంలో అకస్మాత్తుగా మార్పులు రావటం ఇవన్నీ ఆత్మహత్యకు ముందు ఉండే లక్షణాలే’నని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ అస్తిక్‌జోషి మాట్లాడుతూ.. తలనొప్పి, కడుపునొప్పి వంటి కారణాలతో స్కూలు/ కాలేజీకి తరచూ డుమ్మా కొట్టటం, అకస్మాత్తుగా బరువు తగ్గటం వంటివి కూడా సీరియ్‌సగా తీసుకోవాల్సిన లక్షణాలని తెలిపారు. ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని తమకు సన్నిహితంగా ఉండే వారికి కూడా చెబుతుంటారని, ఏదో చెప్పి సర్దిపుచ్చకుండా.. తక్షణం మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలని సూచించారు.

Updated Date - Nov 28 , 2025 | 06:52 AM