Share News

Sukhoi 30 Upgrades: గేమ్‌చేంజర్‌ ఎస్‌ 400

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:02 AM

గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చడానికి మనదేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్థాన్‌ దాడులను సమర్థంగా...

Sukhoi 30 Upgrades: గేమ్‌చేంజర్‌ ఎస్‌ 400

  • మరో ఐదు గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ సిద్ధం

  • 10 వేల కోట్లతో క్షిపణుల కొనుగోలు

  • 63 వేల కోట్లతో సుఖోయ్‌-30 ఆధునీకరణ

  • 5న మోదీ, పుతిన్‌ మధ్య ఒప్పందాలు..?

న్యూఢిల్లీ, నవంబరు 27: గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చడానికి మనదేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్థాన్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టిన ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థను మరింత విస్తరించడానికి సిద్ధమైంది. భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) దీనిని ఓ గేమ్‌చేంజర్‌గా అభివర్ణిస్తున్న నేపథ్యంలో మరో ఐదు ఎస్‌-400లను కొనుగోలు చేయనున్నారు. డిసెంబరు 5న జరిగే ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భేటీలో వీటితో పాటు మరిన్ని క్షిపణుల కొనుగోలుకు ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అలాగే రూ. 63 వేల కోట్లతో సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధవిమానాల ఆధునీకరణ కార్యక్రమానికి కూడా భారత్‌ సిద్ధమవుతోందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తన కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. మరిన్ని ఎస్‌-400 స్వాడ్రన్‌లు కొనుగోలుకు ఇప్పటికే రక్షణ శాఖ సిద్ధమైంది. అలాగే పాక్‌తో యుద్ధం సమయంలో తరిగిపోయిన నిల్వలను మళ్లీ పెంచడానికి ఎస్‌-400 క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 120, 200, 250, 380 కి.మీటర్ల రేంజ్‌ క్షిపణుల కోసం ప్రత్యేకంగా రూ. 10 వేల కోట్లను కేటాయించడానికి నిర్ణయించారు. ఇక ఐఏఎ్‌ఫకు చెందిన 259 సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాల్లో మొదటి దఫాలో 80 యుద్ధ విమానాలను రూ. 63 వేల కోట్లతో ఆధునీకరించడానికి ప్రధాని నేతృత్వంలోని భద్రతపై క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) అనుమతి తెలిపింది. ఈ ఫైటర్లను ఆధునిక రాడార్లు, ఏవియానిక్స్‌, సుదూర రేంజ్‌ ఆయుధాలు, బహుళ సెన్సార్లతో ఆధునీకరించి, మరో 30 ఏళ్లపాటు పోరాడే సామర్థ్యానికి తగ్గట్లుగా తీర్చిదిద్దుతారు. వీటిని రష్యా సహకారంతో దేశీయంగా అభివృద్ధి చేస్తారు.

Updated Date - Nov 28 , 2025 | 04:02 AM