Wedding - IV Drips: పెళ్లిళ్లల్లో అతిథులకు సెలైన్.. ఇదేం ట్రెండ్ దేవుడా!
ABN , Publish Date - Nov 24 , 2025 | 10:43 PM
పెళ్లిళ్లల్లో జనాలు ఒక చోట కూర్చుని సెలైన్ పెట్టించుకుంటున్న వైనం మీ కంట ఎప్పుడైనా పడిందా? ఈ మధ్య ఇలాంటి సీన్స్ ప్రతి పెళ్లిలో కనిపిస్తున్నాయి. మరి ఈ ట్రెండ్ ఎందుకు మొదలైందో? దీని మంచి చెడులు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా పెళ్లి వేడుకల్లో బంధుమిత్రులు, వచ్చేపోయేవారితో కోలాహలంగా ఉంటుంది. కానీ పెళ్లికొచ్చిన కొందరు ఓ మూలన సెలైన్ (ఐవీ డ్రిప్స్) పెట్టించుకుని కూర్చొంటే ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించండి! కన్‌ఫ్యూజన్‌గా, కాస్తంత భయంగా ఉంటుంది కదూ. కానీ ప్రస్తుతం వివాహాల్లో ఇదే సరికొత్త ట్రెండ్. మరి ఈ ట్రెండ్ ఎందుకు వచ్చిందో? దీంతో సమస్యలు ఏమైనా వచ్చే ఛాన్సుందా? అనే విషయాలను తెలుసుకుందాం పదండి (IV Drips In Weddings - Pros and Cons).
పెళ్లి వేడుకల్లో సంగీత్ వంటి కార్యక్రమాలు ఈ రోజుల్లో సాధారణం. కాస్తంత సంపన్నులైతే.. పెళ్లికి ముందు మూడు నాలుగు రోజుల పాటు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అతిథులు ఈ ఈవెంట్స్‌లో పాల్గొని ఒళ్లు మరిచిపోయి ఎంజాయ్ చేస్తారు. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్స్‌లో హడావుడి మరో రేంజ్‌లో ఉంటుంది. కాక్‌టెయిల్ నైట్స్.. వంటి వాటిల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసి ముహూర్తానికి ముందే జనాలు నీరసించిపోతారు. బడలిక, హ్యాంగ్‌ఓవర్ వంటివాటితో సతమతం అవుతారు. వధూవరుల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. మరి ఈ సమస్య నుంచి తక్షణం బయట పడేందుకే ఈ సెలైన్ చికిత్స ఉనికిలోకి వచ్చింది. జనాల బడలిక, హ్యాంగ్‌ఓవర్‌ను తొలగించేందుకు ఏకంగా ఐవీ ద్వారా పోషకాలు అందిస్తారు. దీంతో, జనాలు మళ్లీ ఫుల్ జోష్‌లో పెళ్లి వేడుకలో పాల్గొంటారన్నమాట.
ఐవీ డ్రిప్స్‌తో ప్రయోజనాలు బాగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్లూయిడ్స్, పోషకాలను ఇలా నేరుగా రక్తంలోకి ఎక్కిస్తే వెంటనే ఒంటబడతాయి. తక్షణం ఉత్సాహం వస్తుంది. ఇలా వెంటనే ఫలితం వచ్చేందుకే వైద్యులు ఆసుపత్రుల్లో రోగులకు ఔషధాలను సెలైన్ ద్వారా ఇస్తుంటారు.
అయితే, పెళ్లిళ్లల్లో ఇలాంటి ట్రెండ్‌కు దూరంగా ఉండటమే మంచిదనేది వైద్యులు చెప్పేమాట. ఆరోగ్యవంతులు వీటిని వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడితే ఇన్ఫెక్షన్లు, లవణాల అసమతౌల్యత వంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, పెళ్లిళ్లల్లో ఎంతగా అలసిపోయినా నోటి ద్వారా పండ్ల రసాలు, పోషకాహారాన్ని తీసుకుంటే సులువుగా అలసట తగ్గుతుంది. తద్వారా శరీరం సహజ పద్ధతిలో కోలుకుంటుంది.
ఇవీ చదవండి:
రోజుకు 12 గంటల పని.. నెలకు రూ.1 లక్ష శాలరీ.. ఇంటర్న్‌షిప్ ఆఫర్‌తో రేగిన కలకలం
కూలిన తేజస్ జెట్.. పాక్ జర్నలిస్టు సంబరం.. షాకింగ్ వీడియో