Viral Internship Offer: రోజుకు 12 గంటల పని.. నెలకు రూ.1 లక్ష శాలరీ.. ఇంటర్న్‌షిప్ ఆఫర్‌తో రేగిన కలకలం
ABN , Publish Date - Nov 22 , 2025 | 10:58 PM
తమ సంస్థలో వారానికి ఆరు రోజుల పాటు రోజుకు పన్నెండు గంటల చొప్పున పని చేసే ట్రెయినీకి నెలకు రూ.1 లక్ష శాలరీ ఇస్తామంటూ ఓ బెంగళూరు సంస్థ నెట్టింట ప్రకటించింది. దీనికి జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఈ ఆఫర్ చూసి అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య సమతౌల్యం ఎలా సాధించాలన్న అంశంపై చర్చ జరుగుతున్న వేళ లింక్డ్ఇన్‌లో ఓ ఇంటర్న్‌షిప్ ఆఫర్ కలకలం రేపుతోంది. ఏఐ సంస్థ వ్యవస్థాపకులు ఒకరు ఈ ఆఫర్‌ను ప్రకటించారు. తన వద్ద ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉందని, నెలకు రూ.1 లక్ష శాలరీ ఇస్తానని అన్నారు. అయితే, రోజుకు 12 గంటలు పనిచేయాలని కండీషన్ పెట్టడంతో ఒక్కసారిగా కలకలం రేగింది (Internship Offer Goes Viral In Bengaluru).
తమది టైర్-1 స్టార్టప్ అని సంస్థ ఫౌండర్ తెలిపారు. ఇప్పటికే ఫార్చూన్ 500 కంపెనీల్లో కొన్నింటికి సేవలందిస్తున్నామని అన్నారు. తమకు వెంచర్ క్యాపిటలిస్టుల మద్దతు కూడా ఉందని అన్నారు. ఈ ఆఫర్ ఆన్-సైట్ అని, నేరుగా సంస్థ వ్యవస్థాపకులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందని తెలిపారు. అయితే, ఇది చాలా బాధ్యతలతో కూడుకున్న అవకాశమని చెప్పారు. కాబట్టి ఏదైనా చేయగలమన్న ఆత్మవిశ్వాసం ఉన్న యువతే కావాలని అన్నారు. రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల చొప్పున వారానికి ఆరు రోజులు పనిచేయాలని చెప్పారు. మీల్స్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, జిమ్ లేదా హాబీ అలవెన్స్ కూడా ఉంటుందని తెలిపారు.
ఈ వింత ఆఫర్‌పై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. క్షణం తీరిక లేని జీవనశైలి గొప్పదన్నట్టు స్టార్టప్ సంస్థ భావిస్తోందని, అపరిమిత పనిని సర్వసాధారణ అంశంగా సంస్థలో చూస్తారని కొందరు హెచ్చరించారు. భారత స్టార్టప్ సంస్థల సంస్కృతిలో లోపాన్ని ఈ యాడ్ ప్రతిఫలిస్తోందని కొందరు కామెంట్ చేశారు. రోజుకు పన్నెండు గంటలు పనిచేసే వ్యక్తికి జిమ్‌కు వెళ్లేంత సమయం మిగులుతుందా? అని మరికొంత మంది ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. శాలరీ ఆశ చూపి ఇంతటి పనిభారం మోపడం సబబు కాదని అన్నారు. మరికొందరు మాత్రం ఈ ఆఫర్‌కు జైకొట్టారు. ఇంటర్న్‌షిప్‌కు ఇంత శాలరీ అంటే దాతృత్వంగా భావించాలని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
కూలిన తేజస్ జెట్.. పాక్ జర్నలిస్టు సంబరం.. షాకింగ్ వీడియో
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ