Share News

UPSC Struggles: జీవితం అంటే ఇదే.. 12 సార్లు సివిల్స్ పరీక్షకు ప్రయత్నించి..

ABN , Publish Date - Nov 12 , 2025 | 08:22 PM

సివిల్స్ కోసం ఏకంగా 12 సార్లు ప్రయత్నించి విఫలమైన ఓ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. జీవితం అంటే సంఘర్షణే అంటూ అతడు చేసిన కామెంట్ ఎందరినో కదిలించింది.

UPSC Struggles: జీవితం అంటే ఇదే.. 12 సార్లు సివిల్స్ పరీక్షకు ప్రయత్నించి..
UPSC struggle story

ఇంటర్నెట్ డెస్క్: పన్నెండు సార్లు సివిల్స్ పరీక్షలో విజయం సాధించేందుకు ప్రయత్నించాడు. ఏడు సార్లు ప్రిలిమ్స్‌లో గట్టెక్కి మెయిన్స్ వరకూ వెళ్లాడు. ఐదు సార్లు మెయిన్స్‌లో విజయం సాధించి ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. కానీ గమ్యాన్ని మాత్రం చేరుకోలేకపోయాడు. చివరకు రిక్త హస్తాలే మిగిలాయి. ఇలా అసాధారణ అనుభవాన్ని ఎదుర్కొన్న కునాల్ ఆర్ విరుల్కార్ అనే వ్యక్తి ఉదంతం జనాలను కదిలిస్తోంది (UPSC Struggles Kunal R Virulkar).

సివిల్స్ అభ్యర్థులు తమకు ఎదురయ్యే కష్టనష్టాలను వివిధ వేదికల్లో పంచుకుంటారు. ఈ క్రమంలో కునాల్ విరుల్కార్ ఉదంతం అప్పుడప్పుడూ ట్రెండింగ్‌లోకి వస్తుంటుంది. విరుల్కార్ సివిల్స్ ప్రయాణం 2012లో ప్రారంభమైంది. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు. 2013లో మరోసారి ప్రయత్నించగా ప్రిలిమ్స్‌లో గట్టెక్కారు. మెయిన్స్‌లో చుక్కెదురైంది. 2014లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ 2015లో తొలిసారిగా విజయం కనుచూపు మేరలో కనిపించింది. ఆ సంవత్సరం మెయిన్స్‌లో కూడా క్వాలిఫై అయిన విరుల్కార్..ఇంటర్వ్యూకు హాజరయ్యారు. కానీ 52 మార్కుల తేడాతో సెలక్షన్ మిస్ అయ్యారు. కానీ, లక్ష్యానికి దగ్గరగా వచ్చానన్న ఉత్సాహంతో మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు.


ఆ తరువాత కూడా విజయం అందని ద్రాక్షగా మిగులుతుందని ఊహించలేకపోయారు. 2016, 2017లో కనీసం ప్రిలిమ్స్‌లో కూడా క్వాలిఫై కాలేదు. కానీ ఉత్సాహం కోల్పోకుండా 2018లో మరోసారి ప్రయత్నించారు. ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండూ గట్టెక్కారు. కానీ ఈసారి కేవలం ఒక్క మార్కుతో సర్వీసు దక్కలేదు. ఇక 2019లో మళ్లీ సీన్ రిపీట్ అయ్యింది. ఈసారి ప్రిలిమ్స్ దశలోనే చుక్కెదురైంది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ ప్రయత్నించాడు. అయినా నిరాశ తప్పలేదు. 2020లో జస్ట్ 10 మార్కుల తేడాతో కేంద్ర సర్వీసులకు ఎంపిక కాలేకపోయారు.

2021లో మళ్లీ 16 మార్కుల మేర వెనుక పడటంతో కేంద్ర సర్వీసులకు ఎంపిక కాలేదు. 2022లో ప్రిలిమ్స్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. చివరిసారిగా 2023లో మరోసారి సివిల్స్ సాధించేందుకు రంగంలోకి దిగారు. కానీ ఈసారి 9 మార్కుల తేడాతో సెలక్షన్ దక్కలేదు. ఆ తరువాత అతడు తన జర్నీ గురించి జనాలతో పంచుకున్నారు. ‘12 ప్రయత్నాలు, 7 సార్లు ప్రిలిమ్స్‌లో గట్టెక్కి, 5 సార్లు ఇంటర్వ్యూ వరకూ వెళ్లి.. అయినా నో సెలక్షన్. జీవితం అంటేనే సంఘర్షణ’ అంటూ ఒక్క వాక్యంలో తన ప్రయాణాన్ని వివరించారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు విరుల్కార్ మరోసారి ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఈ విషయం మళ్లీ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

వామ్మో ఐఫోన్.. తుఫానులో చిక్కుకుపోయి.. 3 రోజుల తరువాత చూస్తే..

చిన్నారుల కోసం ప్రత్యేక కారును ఆవిష్కరించిన టొయోటా! చూస్తే మతిపోవాల్సిందే!

Read Latest and Viral News

Updated Date - Nov 12 , 2025 | 08:34 PM