IndiGo-African Woman Protest: ఇండిగో విమానాల రద్దు.. ఆఫ్రికా ప్రయాణికురాలిలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:27 PM
ఇండిగో విమానం రద్దుతో విసిగిపోయిన ఓ ఆఫ్రికా మహిళ సంస్థ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ముంబై ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వందల కొద్దీ ఇండిగో విమానాలు రద్దు అవుతుండటంతో ప్రయాణికుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో అర్థం కాక సహనం నశిస్తోంది. పలు ఎయిర్‌పోర్టుల్లో జనాలు నిరసన బాట పడుతున్నారు. విమానాల రద్దుతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఓ ఆఫ్రికా మహిళ రణరంగం సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (African Woman Angry At IndiGO staff).
ముంబై ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాల రద్దుకు గల కారణాలు కూడా తెలియకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ ఆఫ్రికన్ మహిళ కౌంటర్‌లోని ఇండిగో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. విచక్షణ కోల్పోయి కౌంటర్‌లోని కిటికీ పట్టుకుని ఎక్కి మరీ పెద్దపెట్టున అరుస్తూ తన నిరసన తెలియజేసింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ అసలేమాత్రం బాగాలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది (Viral Video).
ఇక ఆమె పక్కన ఉన్న ఇతర ప్యాసెంజర్లు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇండిగో సిబ్బందిపై మండిపడ్డారు. తాము నరకం అనుభవిస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆఫ్రికన్ మహిళ తీరును విమర్శించారు. కౌంటర్‌లోని సిబ్బందిపై అరిచి గోల చేస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. అకస్మాత్తుగా విమానాల రద్దుతో తీవ్ర ఇక్కట్ల పాలయ్యి ఆమెలో సహనం నశించి ఉంటుందని కొందరు అన్నారు.
ఇదిలా ఉంటే , ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమానాల రద్దు కొనసాగుతూనే ఉంది. పరిస్థితి సంక్షోభ స్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఈ విషయం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పరిణామాలపై తక్షణమే విచారణ జరపాలంటూ పలువురు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఇవీ చదవండి:
డిగ్రీ పట్టా లేకున్నా మా సంస్థలో జాబ్ ఇస్తాం.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఆఫర్
పెళ్లిలో వధూవరుల కుటుంబాల పరస్పర దాడులు! రసగుల్లాలు తక్కువయ్యాయని..