Germany-Indian: ఆ ఫైర్ లేదంటూ ఊస్టింగ్.. భారతీయురాలికి షాకిచ్చిన జర్మన్ కంపెనీ
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:40 PM
జర్మనీలోని ఓ స్టార్టప్ కంపెనీలో చేరిన రెండో రోజే ఉద్యోగాన్ని కోల్పోవడంపై ఓ భారతీయురాలు విస్మయం వ్యక్తం చేసింది. నెట్టింట ఆమె పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: జాబ్‌లో చేరిన రెండు రోజునే జర్మనీలోని స్టార్టప్ సంస్థ తనను తొలగించిందంటూ ఓ భారతీయ మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. కాజల్ టెక్వానీ అనే మహిళ ఈ పోస్టును ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన పరిస్థితి ఎలా తలకిందులైందో చూడండంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అనేక మంది ఆమె స్థితిపై విచారం వ్యక్తం చేశారు (Indian woman German job fired).
‘జాబ్ కోసం మరో నగరానికి మకాం మార్చేశాక రెండో రోజునే జాబ్ పోయిందంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నాకు సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది’ అని ఆమె తెలిపింది. సెప్టెంబర్ 1 వరకూ తాను బెర్లిన్‌లో వర్క్ ఫ్రమ్ హోం చేశానని తెలిపింది. ఆ తరువాత స్టార్టప్ సంస్థలో జాబ్ కోసం మూనిచ్‌కు వెళ్లానని తెలిపింది. మొదటి రోజు సాఫీగానే గడిచిపోయిందని చెప్పింది. కానీ రెండో రోజున కంటి ఇన్ఫెక్షన్ కారణంగా కాస్త ఆలస్యంగా ఆఫీసుకు వెళ్లానని తెలిపింది. ఇన్ఫెక్షన్ గురించి అంతకుముందే ఆఫీసు వారికి సమాచారం ఇచ్చానని కూడా పేర్కొంది. కానీ ఆ సాయంత్రమే తనను కంపెనీ నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది (Short term job Termination).
‘వాళ్లు నాకు కారణాలు కూడా చెప్పారు. నేను టీమ్‌లో ఇమడలేనట. నాలో ఆ ఫైర్ కనిపించలేదట. మరింత అనుభవం, నైపుణ్యం ఉన్న వారిని కోరుకుంటున్నారట. అది ఇంటర్న్‌షిప్ జాబ్. కానీ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వాళ్లు ఎందుకు గుర్తించలేదు. నాకు సమయ పాలన తెలియదట. తొలి రోజుల్లోనే ఆఫీసుకు లేటుగా వచ్చానట’ అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను బెర్లిన్‌కు తిరిగొచ్చేశానని వివరించింది (Indian expatriate employment dispute).
ఇలాంటి జాబ్ ఆఫర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆమె ఇతరులను అప్రమత్తం చేసింది. స్టార్టప్ సంస్థల్లో జాబ్స్ కోసం తొందరపడి ఇతర నగరాలకు మకాం మార్చొద్దని హెచ్చరించింది. అంతటి రిస్క్ అనవసరమని అభిప్రాయపడింది. ఇక ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని అనేక మంది తెలిపారు. స్టార్టప్‌లల్లో ఇంటర్న్‌షిప్‌లు ఇలాగే ఉంటాయని హెచ్చరించారు. ఈ ఒక్క ఉదంతం ఆధారంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని మరికొందరు సూచించారు. అమెరికాను వీడాలనుకుంటున్న భారతీయులకు జర్మనీ సాదర స్వాగతం పలుకుతున్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు.
ఇవి కూడా చదవండి:
3 సార్లు హెచ్-1బీ వీసాలో నిరాశ.. పంతం పట్టి కల నెరవేర్చుకున్న యువకుడు
వియత్నాంలో భారత జంట చోరీ.. వీడియో వైరల్