Layoff Panic Viral: హెచ్ఆర్ తప్పిదం.. ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్టు ఈమెయిల్
ABN , Publish Date - Nov 10 , 2025 | 06:03 PM
హెచ్‌ఆర్ విభాగంలో జరిగిన ఓ పొరపాటు.. సీఈఓ సహా కంపెనీలోని ఉద్యోగులందరూ వణికిపోయేలా చేసింది. దిక్కుతోచని స్థితిలో పడేలా చేసింది. జరిగిందేంటో తెలిశాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్ డెస్క్: అసలే ఇది లేఆఫ్స్ కాలం. మానవ వనరుల (హెచ్ఆర్) విభాగం నుంచి మెసేజ్ వచ్చిందంటే చాలు కార్పొరేట్ ఉద్యోగులు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ సంస్థలో హెచ్‌ఆర్ విభాగం చేసిన చిన్న పొరపాటు భారీ ప్రకంపనలను సృష్టించింది. తన ఉద్యోగం పోయిందనుకుని చివరకు కంపెనీ సీఈఓ కూడా టెన్షన్ పడేలా చేసింది. ప్రస్తుతం నెట్టింట ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది (Termination Email Causes Company Wide Chaos).
రెడిట్‌లో ఓ నెటిజన్ ఈ విషయాన్ని షేర్ చేశారు. హెచ్‌ఆర్ విభాగంలో జరిగిన పొరపాటు కారణంగా ఉద్యోగుందరికీ ఒక్కసారిగా గుండెపోటు వచ్చినంత పనైందని తెలిపారు. హెచ్ఆర్ విభాగం మేనేజర్ ఓ వ్యక్తిని తొలగించాలని భావించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఓ ఈమెయిల్‌ను సిద్ధం చేశారు. ఈ క్రమంలో జరిగిన పొరపాటు యావత్ కంపెనీలో కలకలం రేపింది. ఈమెయిల్‌ను సంబంధిత ఉద్యోగికి మాత్రమే పంపించే బదులు కంపెనీలోని వారందరికీ చేరేలా తప్పుడు ఆప్షన్‌పై క్లిక్ చేశారు. దీంతో, ఆ ఈమెయిల్ సీఈఓకు కూడా చేరింది. ‘ఇక మీ సేవలు సంస్థకు అవసరం లేదు.. తక్షణం మిమ్మల్ని తొలగిస్తున్నాము’ అన్న వ్యాఖ్యలు చూసి సంస్థలోని వారందరికీ చెమటలు పట్టాయి (Viral LayOff Incident).
విషయం హెచ్‌ఆర్‌కు తెలియడంతో వారు నెత్తిబాదుకున్నారు. దిద్దుబాటు చర్యలకు దిగారు. ఎందువల్ల ఇలా జరిగిందో చెబుతూ మళ్లీ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ విభాగం ఈమెయిల్ పంపింది. కొత్త సాఫ్ట్‌వేర్‌ను టెస్టు చేసే క్రమంలో జరిగిన పొరపాటు కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని వివరించింది. ఎవరి ఉద్యోగాలు పోలేదని, ఆందోళన వద్దని భరోసా ఇచ్చింది. దీంతో, ఉద్యోగులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. ఏఐ, ఆటోమేషన్‌ను ముందూవెనుకా ఆలోచించకుండా రంగంలోకి దింపితే ఇలాగే ఉంటుందని కామెంట్ చేశారు. ఈమెయిల్స్, మెసేజీల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా తక్కువేనని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. విమానం నుంచి కిందకు చూస్తే..
వణికిస్తున్న కాలుష్యం.. ఢిల్లీకి వెళ్లే విమానం దాదాపుగా ఖాళీ!