Anand Mahindra: టెస్లా ఎంట్రీతో పెరగనున్న పోటీపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:49 PM
విద్యుత్ వాహన సంస్థ టెస్లా భారత్‌లో ఎంట్రీ ఇస్తే తాము పోటీకి సిద్ధంగానే ఉన్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్ వాహనాల సంస్థ టెస్లాకు గట్టి పోటీ ఇచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. మస్క్ సారథ్యంలోని టెస్లా భారత్‌లో ఎంట్రీ ఇస్తోందన్న వార్తల మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్లాతో పోటీపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1991లో ఆర్థిక సంస్కరణలతో అంతర్జాతీయ బ్రాండ్స్ భారత్‌లో ప్రవేశించినప్పుడు కూడా తమకు ఇవే ప్రశ్నలు వేశారని, కానీ తాము ఇప్పటికీ మార్కెట్లో నిలిచున్నామని పేర్కొన్నారు (Viral).
‘‘1991లో ఆర్థిక సంస్కరణల సమయంలో కూడా తామను ఇవే ప్రశ్నలు అడిగారు. టాటా, మారుతీ, మిగతా ఎమ్‌ఎన్‌సీల పోటీని ఎలా తట్టుకుంటామని ప్రశ్నించారు. కానీ మేమిప్పటికీ నిలిచే ఉన్నాము. మరో వందేళ్ల పాటు కొనసాగేలా పూనకాలు వచ్చినట్టు పనిచేస్తున్నాము. మీరిచ్చే ప్రోత్సాహంతో దీన్ని సాథ్యం చేసి చూపుతాము’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Divorce Over Kids Surname: పిల్లలకు తన ఇంటి పేరు పెట్టుకోనివ్వలేదని భార్యకు విడాకులు
ఆనంద్ మహీంద్రా సమాధానం జనాలు నచ్చడంతో ఆయన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘పోటీలో నిలుదొక్కుకోవడమనే కళలో మీకు కచ్చితంగా గోల్డ్ మెడల్ ఇవ్వాలి. మరో వందేళ్ల తరువాత మీతో పోటీ పడే సంస్థలను కచ్చితంగా ఇదే అడుగుతారు’’ అని ఓ వ్యక్తి ప్రశంసించారు. మహీంద్రా సంస్థల పునాదులు గట్టివి. భారత్‌లో క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, భారతీయుల స్వభావాన్ని అర్థం చేసుకున్న సంస్థ. అయితే, భారత్‌లో అనేక ఇతర సంస్థలు మనగలిగేందుకు అవకాశం ఉంది’’ అని మరో వ్యక్తి అన్నారు.
Jhansi: అమ్మను నాన్నే చంపాడు..బొమ్మ వేసి మరీ చెప్పిన నాలుగేళ్ల చిన్నారి!
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఇటీవలే తన విద్యుత్ వాహనాలను ఆవిష్కరించింది. ఎక్స్‌ఈవీ 9ఈ, బీఈ 6ఈ పేరిట వీటిని ప్రజల ముందుకు తెచ్చింది. చూపులకు ఆకట్టుకునేలా ఉన్న ఈ కార్లపై జనాల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది.
ఇక భారత్‌లోని టెస్లా విభాగంలో నియామకాలకు సంస్థ సిద్ధమైన విషయం తెలిసిందే. దీంతో దేశంలో టెస్లా ఎంట్రీ ఖరారైనట్టేనన్న వ్యా్ఖ్యలు వినిపిస్తున్నాయి. అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో టెస్లా అధినేత మస్క్ సమావేశం తరువాత ఈ ఉద్యోగ ప్రకటన వెలువడటం గమనార్హం. దీంతో, భారత విద్యుత్ వాహన రంగంలో ఆసక్తికర పరిణామాలు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు.