Gucchi Mushrooms: కిలో పుట్టగొడుగులు ఎంతంటే.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 08 , 2025 | 08:28 PM
పుట్టగొడుగుల్లో అరుదుగా లభించే రకం గుచ్చి పుట్టగొడుగులు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇవి.. హిమాలయ ప్రాంతాల్లో అరుదుగా కనిపిస్తుంటాయి. ఇంతకీ వీటి ధర ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే..
ఇంటర్నెట్ డెస్క్: గుచ్చి పుట్టగొడుగులు(Gucchi Mushrooms).. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలువురు చర్చించుకుంటున్న పేరిది. రష్యా అధ్యక్షుడు పుతిన్(Russia President Putin) రాకతో.. వీటిపై తీవ్రమైన చర్చే జరుగుతోంది. ఇక వీటి ధర కూడా ఓ రేంజ్‌లోనే ఉందండోయ్. వీటి ఖరీదు గురించి మాట్లాడితే.. 'పుట్టగొడుగులందు గుచ్చి పుట్టగొడుగులు వేరయా' అనాల్సిందేనేమో.! కిలో గుచ్చి పుట్టగొడుగుల రేటు.. ప్రస్తుత మార్కెట్లో పావు కిలో వెండి ధరకు సమానమన్నమాట. అంటే కిలో పుట్టగొడుగులు సుమారు రూ.40వేలు. ఇంతకీ వీటికి అంత డిమాండ్ ఎందుకు?. వాటి ప్రత్యేకతలేమిటో ఓసారి తెలుసుకుందాం...
గుచ్చి పుట్టగొడుగులు.. ఇవి చాలా అరుదుగా లభిస్తాయి. జమ్ము కశ్మీర్(Jammu Kashmir), హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand)లలో ఎత్తైన ప్రదేశాలలో మాత్రమే కనిపిస్తాయి. అంతకముందు.. వీటి గురించి అందరికీ పెద్దగా తెలియకపోయినా.. పుతిన్ రాకతో దేశవ్యాప్తంగా ఇవి సుపరిచితమయ్యాయనే చెప్పవచ్చు. రష్యా అధ్యక్షుడు భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. మెనూలో భాగంగా బ్యాంకెట్(Putin's Banquet) హాల్లో గుచ్చి పుట్టగొడుగులను కూడా ఉంచారు.
అరుదుగా ఎందుకు.?
గుచ్చి పుట్టగొడుగులు అటవీ ప్రాంతంలో పెరుగుతుంటాయి. వీటిని సులభంగా పండించటం కష్టతరమైన పని. ఇవి పెరిగేందుకు ప్రత్యేకమైన నేల, నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరం. అందుకే హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే వసంత కాలం నాటి ప్రత్యేక పరిస్థితుల్లో కనిపిస్తాయి. అయితే.. పుట్టగొడుగుల్లో గుచ్చి రకాన్ని పసిగట్టడం కూడా ఓ సవాలేనని చెప్పవచ్చు. కొన్ని వారాలపాటు మాత్రమే కనిపించడమూ ఇందుకో కారణంగా తెలుస్తోంది. కానీ, అధిక ధర దృష్ట్యా అక్కడి వారు మాత్రం వీటిని వెతికేందుకు అదే పనిగా హిమాలయ ప్రాంతాలకు వెళ్తుంటారు. అరుదుగా లభించే ఇవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయట. అందుకే డిమాండ్‌ను బట్టి వీటి ధర రూ.50వేల వరకూ ఉంటుంది. అందువల్లే ఇవి ప్రపంచంలోనే ఖరీదైన పుట్టగొడుగుల రకంగా పేరుగాంచాయి.
ఈ రకమైన పుట్టగొడుగులను మామూలు రెసిపీల్లా కాకుండా.. బోరింగ్ గ్రేవీ, సూప్‌లాగా చేసుకుంటే అద్భుతమైన రుచినిస్తుంది. ఈ ఖరీదైన పుట్టగొడుగులతో.. గుచ్చి పులావ్, యాఖ్ని, రోగంజోష్ లాంటి వంటకాలూ చేసుకోవచ్చు. ఇది శాకాహారులకు మంచి మాంసాహార ప్రత్యామ్నయంగా నిలుస్తుంది. అందుకే.. పుతిన్ శాకాహార మెనూలో చేరి ఇది మరింత ప్రత్యేకతను చాటుకుంది.
ఇవీ చదవండి: