UP Woman Marries Lord Krishna Idol: కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి.. ఎక్కడంటే.?
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:31 PM
యూపీలోని బుడాన్ జిల్లాకు చెందిన పింకీ శర్మ.. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె తీసుకున్న నిర్ణయానికి కుటుంబ సభ్యులు సైతం సమ్మతం తెలపడం మరో విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని బుడాన్ జిల్లాకు చెందిన పింకీ శర్మ(28) చేసిన పని స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్రీకృష్ణుడి విగ్రహానికి పూలమాలలు వేసి సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారామె(Woman Marries Lord Krishna). ఇస్లాంనగర్(Islam Nagar) ప్రాంతంలో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చి ఘనంగా నిర్వహించారు.
ముందుగా పింకీ శర్మ(Pinky Sharma) నివాసాన్ని పెళ్లి వేదికగా మార్చారు. ఆ ఇంటి ముందు అందమైన మండపాన్ని ఏర్పాటుచేశారు. శ్రీకృష్ణుడి ప్రతిమను పెళ్లికొడుకులా ముస్తాబు చేసి ఘనంగా బారాత్ నిర్వహిస్తూ కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. పింకీ తల్లిదండ్రులు శ్రీకృష్ణుడి విగ్రహానికి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పింకీ.. విగ్రహాన్ని తన చేతులతో పెళ్లి వేదికపైకి తీసుకెళ్లారు. శ్రీకృష్ణుడి విగ్రహానికి పూలమాల వేసి, తన మెడలో పూలమాల వేసుకుని నుదుట సింధూరం పెట్టుకున్నారు. ఇక స్వామివారి విగ్రహాన్ని చేతుల్లో పట్టుకుని ఏడడుగులు కూడా వేశారామె. పెళ్లి క్రతువు పూర్తవగానే విందుభోజనాలు ఏర్పాటుచేశారు. పెళ్లికి వచ్చిన కొందరు కళాకారులు డ్యాన్సులు, భజన కార్యక్రమాలతో అలరించారు. చివరగా విగ్రహాన్ని చేతిలో పట్టుకుని పింకీ అత్తారింటికి వెళ్లే కార్యక్రమం కూడా జరిపించారు. అయితే.. పింకీ మాత్రం.. ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటున్నట్టు సమాచారం.
తొలుత వద్దనుకున్నా..
శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకున్న విషయం గురించి పింకీ తండ్రి సురేశ్ చంద్ర(Suresh Chandra) ఏమన్నారంటే.. 'చిన్నప్పటి నుంచి నా కూతురికి శ్రీకృష్ణుడంటే పంచప్రాణం. నిత్యం ఆయన సేవలో మునిగితేలుతూ ఉంటుంది. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో బృందావనంలో కృష్ణుడి విగ్రహాన్ని మోసుకెళ్లి గోవర్ధన పరిక్రమ(గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం) పూర్తిచేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్వామివారి ప్రసాదం తీసుకుంటున్న సమయంలో ఒక బంగారు ఉంగరం ఆమె చున్నీలో పడింది. అది సాక్షాత్తు తాను కొలిచే కృష్ణుడే ఆశీర్వదించి ఇచ్చాడని భావించింది. ఆ క్షణమే తనను తాను స్వామివారికి అంకితం చేసుకుంది. అలా మనుషులను పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకుంది. ఆమె నిర్ణయానికి మొదట్లో ఇబ్బంది పడ్డా. కానీ, ఇది దైవ సంకల్పంగా భావిస్తూ ఆమె ఇష్టానికి అందరం ఓకే చెప్పాం' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి: