Donkeys: ఇక్కడ.. గాడిదలకూ పైజామాలు..
ABN , Publish Date - May 25 , 2025 | 11:54 AM
కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం... ఆకట్టుకునే బీచ్ అందాలు... ప్రశాంతమైన వాతావరణం.... ఫ్రాన్స్‌లోని రియా దీవిలో కనిపించే సుందర దృశ్యాలివి. ఈ దీవిని సందర్శించే పర్యాటకుల సంఖ్య ఎక్కువే. అయితే వారిని అమితంగా ఆకట్టుకునేవి ఇవేవీ కాదు.
ఆ దీవిలో సంచరించే గాడిదలు పర్యాటకులు ఆ దీవిని సందర్శించడానికి ముఖ్య కారణం ఈ గాడిదలే అంటే ఆశ్చర్యమేస్తుంది.
దీవిలో ఉన్న గాడిదలు మామూలుగా ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు... పైగా చిరాకు పడేవారు. కానీ గాడిదలన్నీ పైజామాలు ధరించి కనిపిస్తే... అది తప్పకుండా వింతే అవుతుంది. ఫ్రాన్స్‌లోని రియా దీవిలో ఉన్న గాడిదలు పైజామాలతో కనిపిస్తాయి. అయితే వాటికి పైజామాలు వేయడం అనేది ఆ దీవిలో ఈ మధ్య మొదలయింది కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది.
ఫ్యాషన్ కోసం కాదు...
ఇక్కడి గాడిదలు సాధారణ రకానికి చెందినవి కావు. వాటిని ‘పోయిటౌ డాంకీస్’ అంటారు. ‘గాడిద చాకిరి’ అనే పదం తెలిసిందే కదా... వీటికి ప్రపంచంలోనే అత్యుత్తమంగా పనిచేసే గాడిదలుగా గుర్తింపు ఉంది. ఫ్రాన్స్‌లోని ‘పోయిటౌ’ ప్రాంతం నుంచి వచ్చిన ఈగాడిదలు ఎక్కువ ఎత్తుతో, బలిష్ఠంగా ఉంటాయి. ఎత్తు, వాటికున్న సామర్థ్యం వల్ల స్థానికులు ఉప్పు నేలల్లో పనికి ఉపయోగించేవారు. ఆ ప్రదేశాల్లో దోమలు, ఇతర కీటకాల తాకిడి ఎక్కువగా ఉండేది.

వాటివల్ల గాడిదలు తెగ ఇబ్బందిపడేవి. అందుకే వాటి యజమానులు ప్రత్యేకంగా తయారుచేసిన పైజామాలను గాడిదలకు వేసేవారు. అయితే ప్రస్తుతం వాటిని ఉప్పు నేలల్లో పనికి ఉపయోగించడం లేదు... కానీ పైజామాలను వేయడం మాత్రం సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యంగా ఆ సంప్రదాయమే వారికి ఆదాయ వనరుగా మారింది. కేవలం పర్యాటకులను ఆకర్షించడం కోసమే స్థానికులు గాడిదలకు రంగురంగుల ఆకర్షణీయమైన పైజామాలు వేయడాన్ని కొనసాగిస్తున్నారు.

ఒకప్పుడు ‘పోయిటౌ బ్రీడ్’ గాడిదలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేవి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఆ గాడిదలకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. 2005లో నిర్వహించిన ఒక సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 450 ‘పోయిటౌ డాంకీస్’ మాత్రమే ఉన్నట్లు లెక్క తేలింది. ఏదేమైనా రంగుల పైజామాలు వేసుకుని క్యాట్‌వాక్ చేస్తూ వెళ్తున్న గాడిదలను చూస్తూ, సెల్ఫీలు దిగుతూ పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘కొత్త ఒక వింత’ అని ఊరికే అనలేదు.
ఈ వార్తలు కూడా చదవండి.
భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి
Hyderabad Metro: పార్ట్-బీ మెట్రోకు డీపీఆర్ సిద్ధం
Read Latest Telangana News and National News