Harsh Goenka - Narayana Murthy: ఇన్ఫీ నారాయణమూర్తిని అంత మాట అనేశారేంటో.. హర్ష్ గోయెంకా షాకింగ్ పోస్టు!
ABN , Publish Date - Mar 10 , 2025 | 09:37 AM
ఇన్ఫోసిస్ రాక తరువాత బెంగళూరు బాగా అభివృద్ధి చెంది మౌలిక వసతుల కొరత ఎక్కువైందంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు ప్రస్తుత పరిస్థితిపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, నందన్ నీలేకని ఫొటోలను షేర్ చేసిన ఆయన నగర అభివృద్ధి అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించడం పెద్ద చర్చకు దారి తీసింది (Viral).
‘‘ఒకప్పుడు బెంగళూరు అంటే ప్రశాంతత ఉట్టిపడే స్వర్గం. కబ్బన్ పార్కులో ఉదయం పూట నడక, ప్రీమియర్ పద్మినిలో తీరిగ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం, మధ్యాహ్నం వేళ పుస్తకాల షాపుల్లో కాస్త బద్ధకంగా గడపడం.. ఇలా ఉండేది. ఆ తరువాత ఐఐటీ పట్టభద్రులకు తమ జీవితభాగస్వాముల నుంచి పెట్టుబడి డబ్బులు వచ్చాయి. ఆ తరువాత మనం ట్రాఫిక్ చిక్కుల్లో పడ్డాం. వనాల నగరంలో హాయిగా గడిపే బదులు ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోతున్నాం. దీన్నే అభివృద్ధి అని పిలుస్తున్నారు’’ అని విచారం వ్యక్తం చేశారు.
Indian Talking Loudly At Airport: అస్సలు మర్యాద లేదు.. సాటి భారతీయుడిని తిట్టిపోసిన ఎన్నారై!
ఐఐటీలో చదువుకున్న మూర్తి, నీలేకని 1981లో ఇన్ఫోసిస్‌ను కలిసి స్థాపించిన విషయం తెలిసిందే. బెంగళూరు నగరం భారత ఐటీ హబ్‌గా మారడానికి ఇన్ఫోసిస్ కారణమని చరిత్రకారుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే హర్ష్ గోయెంకా పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
జనాలు ఈ పోస్టుపై పెద్ద ఎత్తున స్పందించారు. బెంగళూరులో మౌలిక వసతుల లేమి ఉందని అంగీకరించినా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులను మాత్రం వెనకేసుకొచ్చారు. మరికొందరు మాత్రం బెంగళూరు ఆర్థికాభివృద్ధి నగరంలోని హరిత సంపదను దూరం చేసిందని అన్నారు.
God equation theory: దేవుడి ఉనికికి గణిత ఫార్ములాతో ప్రూఫ్.. హార్వర్డ్ శాస్త్రవేత్త స్టేట్‌మెంట్
‘‘1991లో బెంగళూరు అంటే.. కావాల్సినంత ఖాళీ స్థలం, పచ్చదనం. ఇప్పుడేమో భారీ భవంతులతో ఇరుకుగా, పచ్చదనమే లేకుండా మారిన నగరం’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘‘బెంగళూరు నగరంలో అవకావాలు ఎప్పుడూ మెండుగానే ఉన్నాయి. గత రెండు దశాబ్దాల్లో నగరం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ రోజు కూడా అక్కడి పాత నగరంలో మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయి. నారాయణమూర్తిపై ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు గానీ మౌలిక వసతుల లేమికి మాత్రం ఆయనను బాధ్యులం చేయలేము’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘‘ప్రతి నగరంలో ఈ సమస్య ఉంటుంది. చిన్న టౌన్లకు ఈ పాట్లు తప్పవు. అభివృద్ధికి ఎంతో కొంతమూల్యం చెల్లించుకోక తప్పదు. గ్రామీణ అర్థిక వ్యవస్థను బలోపేతం చేసి నగరాలకు వలసలను అరికట్టడమే సరైన పరిష్కార మార్గం’’ అని మరో వ్యక్తి అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.