Guinness Record: ఈ రోబో ఏకంగా 106 కి.మీ నడిచి ‘గిన్నిస్’లోకి...
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:23 AM
హ్యుమనాయిడ్ రోబోలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్యారంగం, ఆతిథ్యం, వస్తురవాణా వంటి రంగాల్లో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం పెరిగింది. చాలా సంస్థలు ఇప్పటికే రోబోలను ప్రవేశపెట్టాయి.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంత వేగంగా పెరుగుతుందో చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో కమర్షియల్ ఎలక్ట్రిక్ విమానాలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది పరిశోధకుల మాట. ఇదే కోవలో ఛార్జింగ్ రోబో’ను తయారుచేసింది చైనాకు చెందిన అజిబోట్ కంపెనీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే... ఈ రోబో ఏకంగా 106 కి.మీ నడిచి రికార్డుల్లోకి ఎక్కింది. ఈ రోబో భవిష్యత్తులో వాణిజ్య అవసరాలను తీరుస్తుందని నిపుణులు అంటున్నారు.
హ్యుమనాయిడ్ రోబోలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్యారంగం, ఆతిథ్యం, వస్తురవాణా వంటి రంగాల్లో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం పెరిగింది. చాలా సంస్థలు ఇప్పటికే రోబోలను ప్రవేశపెట్టాయి. భవిష్యత్తులో వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే రోబోలు రానున్నాయి. చైనాకు చెందిన అజిబోట్ అనే కంపెనీ ‘అజిబోట్ ఏ2’ పేరుతో ఒక రోబోను తయారుచేసింది. ఈ రోబోని ఒక్కసారి ఛార్జింగ్ చేసి వదిలితే... ఏకంగా 106.28 కి.మీ నడిచి ‘గిన్నిస్’ రికార్డుల్లోకి ఎక్కింది.

మూడు రోజులు... 106 కి.మీ...
‘అజిబోట్ ఏ2’ రోబో నవంబర్ 10న జియాంగు ప్రావిన్స్‌లోని సుజౌలో తన నడకను ప్రారంభించింది. 106.28కి.మీ నడిచి 13వ తేదీ తెల్లవారుజామున షాంఘై చేరుకుంది. ఆశ్చర్యం ఏమిటంటే... ఈ మూడు రోజుల పాటు అది రద్దీగా ఉండే రోడ్లపై నడిచింది. అనేక వంతెనలు దాటింది. ఈ రోబో టెక్నాలజీ విశ్వసనీ యతను ప్రదర్శించడంతో ‘భవిష్యత్తు రోబోలదే’ అంటున్నారు నిపుణులు. ‘‘సింగిల్ ఛార్జింగ్‌తో 100 కి.మీ.లకు పైగా నడవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
సుజౌ నుంచి షాంఘై వరకు నడవడం చాలా కష్టం. కానీ రోబో చాలా సులువుగా ఆ పని చేసింది’’ అని అజిబోట్ కంపెనీ పార్ట్‌నర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ చూంగ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ రోబో తయారీలో ‘హాట్ స్వాపబుల్ బ్యాటరీ’ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఫలితంగా మనిషి సహాయం లేకుండా, అడ్డంకులను తప్పించుకుని 106 కి.మీ నడవగలిగింది. ఇప్పటిదాకా రోబో నడిచిన దూరాల్లో ఎక్కువ దూరం ఇదే. దీనివల్ల రోబో శక్తిసామర్థ్యాలు మాత్రమే కాకుండా వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి తెలిశాయి.

ఈ అజిబోట్ రోబో 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు, 54 కిలోల బరువు ఉంది. దీని తయారీలో ఉపయోగించిన డ్యూయల్ జీపీఎస్ మాడ్యూల్స్ దారిని చూపడంలో సహాయపడ్డాయి. ఇన్‌ఫ్రా రెడ్ డెప్త్ కెమెరాల సహాయంతో రోబో అడ్డంకులను తప్పించుకుంటూ ముందుకు వెళ్లగలిగింది. ఐదారు భాషలలో సంభాషించడం ఈ రోబో ప్రత్యేకత. ముఖ గుర్తింపు (ఫేసియల్ రికగ్నిషన్) ఫీచర్ అదనపు ఆకర్షణ. డెలివరీ టాస్క్‌ను సమర్ధవంతంగా పూర్తి చేస్తుంది. ‘ఈ రోబో సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో... భవిష్యతులో వాణిజ్య అవసరాల వినియోగానికి సరిపోయే రోబోల తయారీ వేగం పుంజుకుంటుంద’ని నిపుణులు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా గృహ రుణం రావటం లేదా
Read Latest Telangana News and National News