Share News

Home Loan Credit Score: మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నా గృహ రుణం రావటం లేదా

ABN , Publish Date - Dec 14 , 2025 | 06:25 AM

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సొంత డబ్బులతో సొంతిల్లు సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. బంధుమిత్రుల నుంచో, బ్యాంకుల నుంచో ఎంతో కొంత అప్పు చేయక తప్పదు....

Home Loan Credit Score: మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నా గృహ రుణం రావటం లేదా

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సొంత డబ్బులతో సొంతిల్లు సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. బంధుమిత్రుల నుంచో, బ్యాంకుల నుంచో ఎంతో కొంత అప్పు చేయక తప్పదు. అలా చేయాలంటే మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉండాలి. స్కోర్‌ మంచిగా ఉన్నా ఒక్కోసారి బ్యాంకులు సారీ చెబుతుంటాయి. ఇందుకు కారణాలు ఏమిటి? ఈ సమస్యను అధిగమించడం ఎలా? అయితే ఈ స్టోరీ చదవండి.

ఇల్లు కట్టి చూడు. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ రెండూ అత్యంత ముఖ్యమైన విషయాలు. ఉద్యోగం, ఆస్తులు, కుటుంబ నేపథ్యాలు చూసి మరీ మనం జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. అలాగే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎ్‌ఫసీ), గృహ ఫైనాన్స్‌ సంస్థలు (హెచ్‌ఎ్‌ఫసీ) కూడా ఆయా వ్యక్తుల క్రెడిట్‌ స్కోర్‌ చూస్తాయి. ఈ స్కోర్‌ 700 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీకే గృహ రుణాలు ఇస్తాయి. అలా అని 700 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ పరపతి స్కోర్‌ ఉన్న అందరికీ బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు, హెచ్‌ఎ్‌ఫసీలు కచ్చితంగా గృహ రుణాలు ఇస్తాయని చెప్పలేం. కొన్ని కారణాలతో రుణ దరఖాస్తును తిరస్కరించవచ్చు. గృహ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు కీలకమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. అవేమిటంటే..


700+ క్రెడిట్‌ స్కోర్‌

సిబిల్‌ నివేదిక ప్రకారం మన దేశంలో క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తున్న వారి సగటు పరపతి స్కోర్‌ 715 నుంచి 730 పాయింట్ల మధ్య ఉంది. ఈ నివేదిక ప్రకారమే బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు రుణాల మంజూరుకు 700 పాయింట్ల క్రెడిట్‌ స్కోర్‌ను కనీస ప్రామాణిక స్కోర్‌గా తీసుకుంటున్నాయి.

ఆదాయ స్థిరత్వం

గృహ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఆయా వ్యక్తుల ఆదాయ స్థిరత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. గత ఏడాది వారి కనీసం ఆదాయం ఎంత? అది కూడా మధ్య మధ్యలో బ్రేక్‌ లేకుండా నెలనెలా స్థిరంగా వచ్చిందా? ఈ ఆదాయం భవిష్యత్‌లో ఎంత మేరకు పెరిగే అవకాశం ఉంది? ఈ ఆదాయంతో గృహ రుణం కింద తీసుకున్న రుణాన్ని దీర్ఘకాలంలో క్రమం తప్పకుండా సక్రమంగా చెల్లించగలరా? లేదా? అని చూస్తాయి. ఈ విషయాల్లో ఏ మాత్రం అనుమానం వచ్చినా, మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్నా, సారీ బాస్‌ అని దాటవేస్తాయి.

ప్రస్తుత ఈఎంఐలు

నెలనెలా చేతికి వచ్చే ఆదాయంలో ఇప్పటికే ఉన్న బాకీల కోసం చెల్లించే నెలవారీ వాయిదాల (ఈఎంఐ) మొత్తం 40 నుంచి 50 శాతం మించకూడదు. అంతకు మించి ఉంటే క్రెడిట్‌ స్కోర్‌ 700 పాయింట్లకు మించి ఉన్నా గృహ రుణ దరఖాస్తును బ్యాంకులు తిరస్కరిస్తాయి.

రుణ పరిమితి

గృహ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఆయా వ్యక్తుల పరపతి స్కోర్‌, ఆదాయ స్థిరత్వం, ప్రస్తుత ఈఎంఐ చెల్లింపుల భారంతో పాటు కొనుగోలు చేసే ఆస్తి విలువను పరిగణనలోకి తీసుకుంటాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేసే ఇంటి విలువలో 80 శాతానికి మించకుండా గృహ రుణం ఇస్తాయి. ఇది కూడా ఆయా వ్యక్తుల వయసు, ఆదాయాన్ని బట్టి మారుతుంది.


ఉద్యోగాల మార్పు

తరచూ ఉద్యోగాలు మార్చే వ్యక్తులు, ప్రొబేషన్‌ మీద ఉన్న వ్యక్తులకు గృహ రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకులు పెద్దగా ఇష్టపడవు. అలాగే ఉద్యోగ, ఆదాయ స్థిరత్వం పెద్దగా లేని రంగాలు, కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తాయి. నిజ జీవితంలో ఎక్కువ ఆదాయం ఉన్నా, ఐటీ రిటర్నుల్లో పన్ను ఎగవేత కోసం తక్కువ ఆదాయం చూపే వారి విషయంలోనూ మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నా.. మీకు లోన్‌ ఇవ్వడం మాకు సాధ్యం కాదని బ్యాంకులు చెప్పేస్తాయి.

ఆస్తి విషయాలు

కొనుగోలు చేసే ఇంటి యాజమాన్యానికి సంబంధించిన డాక్యుమెంట్లు, అనుమతులు పక్కాగా ఉండాలి. వీటికి తోడు కొనే ఇంటి వాల్యుయేషన్‌ కూడా మార్కెట్‌ ధరకు అనుగుణంగా ఉండాలి. రుణం ఇచ్చే ముందే బ్యాంకులు ఈ విషయాలు అన్నిటినీ సొంతంగా చెక్‌ చేసుకుంటాయి. అన్నీ అనుకూలంగా ఉంటేనే గృహ రుణం మంజూరు చేస్తాయి. త విషయాల్లో ఏ మాత్రం తేడా ఉన్నా, మీ అప్లికేషన్‌ను పక్కన పెట్టేస్తాయి. అలాగే బ్యాంకులు బ్లాక్‌లి్‌స్టలో పెట్టిన బిల్డర్ల ఆస్తులకూ గృహ రుణాల లభించవు.

సహ దరఖాస్తుదారుని క్రెడిట్‌ స్కోర్‌

ఇద్దరు కలిసి గృహ రుణానికి దరఖాస్తు చేస్తుంటే.. ఇద్దరి క్రెడిట్‌ స్కోర్‌ బాగుండాలి. ఏ ఒక్కరి క్రెడిట్‌ స్కోర్‌ బాగోకపోయినా బ్యాంకులు ఆ రుణ దరఖాస్తును తిరస్కరిస్తాయి. అలాగే దరఖాస్తుదారులందరూ గత రుణాలను సక్రమంగా చెల్లించి ఉండాలి. దీంట్లో ఏమైనా తేడా ఉన్నా బ్యాంకులు ఆ రుణ దరఖాస్తుని తిరస్కరిస్తాయి.

అధిగమించడం ఎలా?

క్రెడిట్‌ స్కోర్‌ 700 నుంచి 750 పాయింట్ల మధ్య ఉన్నా, కొందరి గృహ రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. అలాంటప్పుడు ఈ కింది చర్యల ద్వారా ఆయా వ్యక్తులు తమ అర్హత పెంచుకోవచ్చు.

  • ఇప్పటికే ఉన్న అన్ని రుణాల ఈఎంఐలను సకాలంలో సక్రమంగా చెల్లించడం ద్వారా

  • ఆర్థిక స్థోమతకు మించిన రుణాలు, కార్డు చెల్లింపుల జోలికి పోకపోవడం

  • క్రెడిట్‌ రిపోర్టులను ఎప్పటికప్పుడు సమీక్షించు కుని సరిదిద్దుకోవడం

  • సెక్యూర్డ్‌-అన్‌సెక్యూర్డ్‌ రుణాల మధ్య సమతౌల్యం పాటించడం

  • క్రమం తప్పని ఆర్థిక క్రమశిక్షణ

ఇవి కూడా చదవండ

మోసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌

కెప్టెన్‌గా జేమ్స్ అండర్సన్.. 43 ఏళ్ల వయసులో!

Updated Date - Dec 14 , 2025 | 06:25 AM