China Wind Turbine: విమానం కాదు... విండ్ టర్బైన్.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:07 AM
భూకంపం సంభవిస్తే పెద్ద పెద్ద భవనాలు కూడా పేకమేడల్లా కూలి పోతాయి. అకస్మాత్తుగా వచ్చే వరదలు ఊర్లను ముంచెత్తుతాయి. కొండ చరియలు విరిగిపడి రాకపోకలు నిలిచి పోతాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలుతుంది.
భూకంపం సంభవిస్తే పెద్ద పెద్ద భవనాలు కూడా పేకమేడల్లా కూలి పోతాయి. అకస్మాత్తుగా వచ్చే వరదలు ఊర్లను ముంచెత్తుతాయి. కొండ చరియలు విరిగిపడి రాకపోకలు నిలిచి పోతాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలుతుంది. ఫలితంగా పరిసర గ్రామాలన్నీ చీకట్లో మగ్గిపోతాయి. ఇలాంటి సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిం చేందుకు కొన్నిసార్లు రోజుల నుంచి నెలల సమయం పడుతుంది. అలాంటి ఆపత్కర పరిస్థితుల్లో తాత్కాలికంగా విద్యుత్‌ను అందించేం దుకు చైనా ఎగిరే గాలిమరను తయారుచేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ‘ఫ్లయింగ్ విండ్ టర్బైన్’గా గుర్తింపు పొందింది.
విద్యుత్తును ఉత్పత్తి చేసే గాలిమరలను చూసే ఉంటారు. వేల ఎకరాల బీడు భూముల్లో అమర్చిన పెద్ద పెద్ద గాలి మరలు గాలికి తిరుగుతూ ఉంటాయి. ఈ దృశ్యం అందరికీ సుపరిచితమే. అయితే ఇక ముందు గాలిలో ఎగురుతూ విద్యుత్తును ఉత్పత్తి చేసే గాలిమరలు కనిపించ నున్నాయి. కొన్ని వందల అడుగుల ఎత్తులో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ‘విండ్ టర్బైన్ల’ను చైనా అభివృద్ధి చేసింది. ఈ ‘ఫ్లయింగ్ విండ్ టర్బైన్’ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తి వంతమైన ‘ఎయిర్‌బోర్న్ విండ్ టర్బైన్’గా దీన్ని పేర్కొంటున్నారు. ఈ టర్బైన్ పనితీరును చైనా విజయ వంతంగా పరీక్షించింది. గ్రీన్ ఎనర్జీ విభాగంలో ఇదొక కీలకమలుపుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

తక్కువ ఖర్చు... ఎక్కువ విద్యుత్తు
ఈ సరికొత్త ఆవిష్కరణలో పెద్ద పెద్ద టవర్స్ ఉండవు. రోటర్స్‌ను అమర్చాల్సిన అవసరం లేదు. ఈ నూతన ఎగిరే టర్బైన్ వల్ల కిలోవాట్ విద్యుత్తు ఉత్పత్తికి అయ్యే ఖర్చులో 30 శాతం తగ్గుతుంది. చాలా సులభంగా ఎక్కడికైనా తరలించవచ్చు. ఇది టెస్ట్ ఫ్లయిట్ సమయంలో 1 మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఈ విండ్ టర్బైన్ 13 అంతస్తుల భవనమంత ఎత్తు ఉంటుంది. ఒక బాస్కెట్‌బాల్ కోర్టు వైశాల్యంతో సమానంగా ఉంటుంది. గాలిలో ఎగురు తున్న విమానం ఇంజన్‌లా కనిపిస్తుంది. బీజింగ్‌లోని లినీ యుంచువాన్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ ఈ విండ్ టర్బైన్‌ను తయారుచేసింది. 100 కిలోవాట్ సామర్థ్యం ఉన్న 12 జనరేటర్ల సహాయంతో తయారైన హెవీ డ్యూటీ కేబుల్స్ సహాయంతో... నిరంతరం విద్యుత్ భూమికి సరఫరా అవు తుంది. ట్రయల్‌రన్‌లో బలమైన గాలులు, ఒత్తిడిని తట్టుకుని విజయవంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసింది. దేశంలోని రకరకాల వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించి, వచ్చే ఏడాది నాటికి గ్రిడ్‌కు కనెక్ట్ చేయాలని భావిస్తున్నారు.

సరికొత్త రికార్డు
చాలాకాలంగా అమెరికా, యూరప్ దేశాలు ‘ఎయిర్‌బోర్న్ విండ్ పవర్’పై పరిశోధ నలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 కంపెనీలు ఈ తరహా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటిదాకా 300 మీటర్ల ఎత్తులో 30 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసిన రికార్డు ‘అల్టెరోస్ ఎనర్జీస్’ అనే సంస్థ పేరుపై ఉంది. తాజాగా ఆ రికార్డును చైనా అధిగమించింది. గత ఏడాది అక్టోబర్‌లో ఎస్500 టర్బైన్‌తో 500 మీటర్ల ఎత్తులో 50 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి ఆ రికార్డును తిరగరాసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎస్1000 టర్బైన్‌తో 1000 మీటర్ల ఎత్తులో 100 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. తాజాగా ఎస్1500 ఫ్లయింగ్ విండ్ టర్బైన్‌తో 1500 మీటర్ల ఎత్తులో 1 మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..
విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు
Read Latest Telangana News and National News