Wuzhuang Toll station Traffic Jam: 36 లైన్ల హైవేపై ట్రాఫిక్ జామ్ అయితే ఎలా ఉంటుందో తెలుసా.. వైరల్ వీడియో
ABN , Publish Date - Oct 11 , 2025 | 08:10 PM
చైనాలో వుజుయాంగ్ టోల్ ప్లాజా వద్ద ఏర్పడిన ట్రాఫిక్ జామ్ తాలూకు దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 36 లైన్ల రోడ్డుపై వాహనాలు ఆగిపోయిన తీరు చూసి ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారీ స్థాయి నిర్మాణాలకు చైనా పెట్టింది పేరు. అక్కడి రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులను చూసి జనాలు షాకైపోతుంటారు. అక్కడి రోడ్ల వ్యవస్థ కూడా ఇదే స్థాయిలో భారీగా ఉంటుంది. కొన్ని చోట్ల ప్రభుత్వం 36 లేన్ల హైవేలను కూడా నిర్మించింది. తాజాగా అలాంటి ఓ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందుకు సంబంధించి డ్రోన్ ఫుటేజీ ప్రస్తుతం ఆశ్చర్యపరుస్తోంది ( Wuzhuang toll station Traffic Jam).
చైనాలో అతిపెద్దదైన వుజుయాంగ్ టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓవైపు ఉన్న 36 లైన్ల రోడ్డుపై నుంచి వాహనాలన్నీ ఈ టోల్ ప్లాజా మీదుగా 8 లేన్ల రోడ్డుపై మళ్లుతుంటాయి. అయితే, ఇటీవల చైనా జాతీయ సెలవు దినాలు ముగియడంతో జనాలు ఒక్కసారిగా తమ వాహనాలతో రోడ్డుపైకి వచ్చారు. దీంతో, టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 24 గంటలపాటు ట్రాఫిక్ నత్తనడకన సాగడంతో టోల్ ప్లాజా వద్ద అసాధారణ దృశ్యాలు కనిపించాయి. రద్దీని తగ్గించేందుకు ఎంత ప్రయత్నించినా అక్కడి అధికారుల వల్ల కాలేదు (Viral Video).
ఇక వాహనాలకున్న ఎర్రని బ్యాక్ లైట్ కాంతిలో రహదారి మొత్తం రక్త వర్ణంలోకి మారిపోయింది. కనుచూపు మేర రోడ్డంతా ఎర్రని కాంతులతో నిండిపోయి అద్భుత దృశ్యం సాక్షాత్కారమైంది. ఇక ఈ దృశ్యాలను చూసి ప్రపంచవ్యాప్తంగా జనాలు నోరెళ్లబెడుతున్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం చైనాలో ప్రస్తుతం లక్ష కిలోమీటర్ల మేర హైవేలు ఉన్నాయి. ప్రపంచంలో ఇతర దేశాల కంటే చైనా హైవే నెట్‌వర్క్ పెద్దది. 1988లో చైనాలో అసలు ఎలాంటి హైవేలు లేవు. కానీ రెండు దశాబ్దాల వ్యవధిలోనే కనీవినీ ఎరుగని రీతిలో చైనా ప్రగతి సాధించింది.

గతంలోనూ చైనాకు సంబంధించి ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. చాంకింగ్‌లోని హ్వాంగ్జువెన్ ఇంటర్‌ఛేంజ్‌కు సంబంధించిన దృశ్యాలు కూడా ప్రజల్ని ఆకట్టుకున్నాయి. దాదాపు 12 అంతస్తుల్లో నిర్మించిన రోడ్లు, ర్యాంపులు జంక్షన్లు జనాలను ఆశ్చర్యపోయేలా చేశాయి. ఇది ఓ ఇంజినీరింగ్ అద్భుతమని ప్రశంసించారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీన్స్ చూసి బ్రిటిషర్‌కు షాక్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో
భారతీయ యువకుడి వినూత్న కెరీర్.. డెంటిస్ట్‌గా మొదలెట్టి చివరకు యాపిల్‌లో ఏఐ ఇంజినీర్‌గా..