పులి మూత్రాన్ని విక్రయిస్తున్న చైనా జంతు ప్రదర్శన శాల! ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - Jan 28 , 2025 | 05:22 PM
చైనాలో ఓ జంతు ప్రదర్శనశాల ఏకంగా పులి మూత్రాన్ని బాటిళ్లల్లో నింపి విక్రయిస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే తమకు ఇందుకు అనుమతులు ఉన్నాయని దబాయిస్తోంది. ప్రస్తుతం ఈ ఉదంతం తెగ సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని ఓ జంతు ప్రదర్శన శాల పులి మూత్రాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చికిత్సగా విక్రయిస్తున్న వైనం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు కావాల్సిన అనుమతులు ఉన్నాయంటూ తమను ప్రశ్నించిన దబాయిస్తున్న వైనం చైనాలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సిచువాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన వెలుగు చూసింది (Viral).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, యాన్ బైఫెంగ్జియా వైల్డ్ లైఫ్ జూ ఈ వింత వ్యాపారానికి తెరలేపింది. పులి మూత్రం ఉన్న 250 గ్రాముల బాటిళ్లను రూ.596కు (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) విక్రయిస్తోంది. పులి మూత్రంతో మోకాళ్లపై మర్దన చేస్తే రూమటాయిడ్ నొప్పులు ఇట్టే మాయమైపోతాయట.
సదరు జంతు ప్రదర్శన శాల మార్గదర్శకాల ప్రకారం, పులి మూత్రంలో కొంత వైట్ వైన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని అల్లం ముక్కలతో నొప్పి ఉన్న చోటుపై మర్దన చేయాలి. ఇంకా మెరుగైన ఫలితాలు కావాలనుకుంటే బాధితులు పులి మూత్రాన్ని కూడా తాగొచ్చట. అయితే, అలర్జీ రియాక్షన్ వచ్చిందని భావిస్తే వెంటనే దీన్ని తాగడం మానేయాలని కూడా జూ అధికారులు సూచన చేశారు.
Leopard Hunt Wild Dog: చిరుత పంజాదెబ్బకు అడవికు కుక్క ఖతం! ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
బేసిన్‌లో సేకరించిన పులి మూత్రాన్ని బాటిళ్లల్లో నింపుతామని జూ సిబ్బందిలో ఒకరు తెలిపారు. అయితే, బాటిళ్లల్లో నింపే ముందు మూత్రాన్ని సూక్ష్మక్రిములు లేకుండా ప్రత్యేక ప్రక్రియలకు ఏమైనా గురి చేస్తారా అన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతానికి మాత్రం పూలి మూత్రం అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని సిబ్బంది తెలిపారు. రోజుకు రెండు బాటిళ్లకు మించి అమ్ముడు పోవట్లేదని అన్నారు. అయితే, 2014లో ఈ జూ అధికారులు ఓ రియాలిటీ షో కూడా నిర్వహించారు. షో విజేతలకు ఏకంగా పులి మూత్రాన్ని బహుమతిగా కూడా ఇచ్చారట.
Costa Rica Drug Lord: భార్య చేసిన మిస్టేక్.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన క్రిమినల్ గ్యాంగ్ లీడర్!
ఇదెలా ఉంటే..చైనా సంప్రదాయ వైద్య విధాన నిపుణుడు పులి మూత్రంతో చికిత్సను మోసంగా అభివర్ణించారు. తమ వైద్య విధానాల్లో పులి మూత్రానికి ఎటువంటి ప్రాధాన్యతా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రామాణికత, శాస్త్రపరమైన ఆధారాలు లేని చికిత్సలను ప్రోత్సహిస్తే రోగాలు తగ్గడానికి బదులు తీవ్రమవడం కొత్త రోగాల బారిన పడటం జరుగుతుందని హెచ్చరించారు. అసలు పులి మూత్రం అమ్మేందుకు జూకు అనుమతులు ఎవరిచ్చారని మరికొందరు ప్రశ్నించారు. అయితే, ఇందుకు సంబంధించిన వాణిజ్య అనుమతులు తమ వద్ద ఉందని సదరు జూ చెప్పుకొచ్చింది. అయితే, అనుమతుల్లో పులి మూత్రం అమ్మకాల ప్రస్తావన ఉందో లేదో మాత్రం తెలియరాలేదు. అయితే, జనాలను మాత్రం ఈ ఉదంతం విపరీతంగా ఆకర్షిస్తోంది.