Biomimicry buildings: ఆ అద్భుత భవనాలపై ఓ లుక్కేద్దామా...
ABN , Publish Date - Dec 21 , 2025 | 08:35 AM
నిర్మాణరంగంలో వస్తున్న విప్లవాత్మక ఆర్కిటెక్ట్ డిజైన్లు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మన చుట్టూ ఉన్న వృక్ష, పక్షి జాతులను... ప్రకృతి వింతలను స్ఫూర్తిగా చేసుకుని ఇంజనీర్లు... కళ్లు మిరమిట్లుగొలిపే నిర్మాణాలను ఆవిష్కరిస్తున్నారు. అదే ‘బయోమిమిక్రీ ఆర్కిటెక్చర్’ ట్రెండ్. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానంలో రూపొందిన కొన్ని అద్భుత భవనాలపై ఓ లుక్కేద్దాం...
- ‘బయోమిమిక్రీ’ భవంతులు
వాటర్ క్యూబ్..
ఒలింపిక్స్ జరిగే నగరాల్లో క్రీడాపోటీల కోసం అప్పటికప్పుడు కొత్తగా భవనాలను నిర్మించడం మామూలే. చైనా రాజధాని బీజింగ్‌లో 2008 ఒలింపిక్స్ సందర్భంగా నిర్మించిన ఒక భవనం నేటికీ వార్తల్లో ఉందంటే దానికి కారణం ఆ నిర్మాణ సౌష్టవం. అదే ‘నేషనల్ ఆక్వాటిక్ సెంటర్’. మానవ దేహంలోని కణాలు, సబ్బు నీళ్లలో ఏర్పడే బుడగల స్ఫూర్తితో ఈ భవనాన్ని తీర్చిదిద్దారు ఇంజనీర్లు. దీనికోసం రెగ్యులర్ కాంక్రీట్ కాకుండా ఈథైల్ టెట్రాఫ్లోలో ఇథినేల్‌తో తయారుచేసిన మెటీరియల్‌ని వాడారు. దీని బరువు తక్కువ. గాజు కన్నా ఎక్కువగా కాంతిని లోపలికి ప్రసరింపచేస్తుంది. పైగా దీని ద్వారా 20 శాతం వరకు సౌరశక్తిని తయారుచేసి స్విమ్మింగ్ పూల్స్‌లో ఉపయోగించుకుంటున్నారు.

వేలాడే తోటలు..

ఏ భవనమైనా నిటారుగానో, అడ్డంగానో ఉంటుంది. కానీ గాల్లో 90 డిగ్రీలు వేలాడుతూ ఉండే భవనాన్ని చూశారా. అదే ‘తావో జు యిన్ యాన్’. తైవాన్ రాజధాని తైపేలో ప్రముఖ నిర్మాణంగా పేరు తెచ్చుకుంది. ప్రాచీన తత్వవేత్త తావో పేరునే ఈ భవనానికి పెట్టడం విఽశేషం. వాస్తవానికి ఇదో నివాస భవన సముదాయం. ‘డీఎన్‌ఏ’ మోడల్‌లో ఈ భవనాన్ని నిర్మించడం విశేషం. 21 అంతస్తుల ఈ భవనంలో ప్రతీ అంతస్తూ మెలి తిరుగుతూ... బాల్కనీలన్నీ గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తాయి. భవనం అంతా 20 వేలకు పైగా మొక్కలను నిట్టనిలువు అడవిలా పెంచుతున్నారు. అందుకే ‘అగోరా గార్డెన్’గా కూడా పిలుస్తున్నారు. ఏడాదికి దాదాపు 130 టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌ను ఈ మొక్కలు పీల్చుకుంటాయి. ఇక్కడ వర్షపు నీటి సంరక్షణ కేంద్రమూ ఉంది. సూర్యరశ్మి, వాయుశక్తితో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కర్బన ఉద్గారాలను తగ్గిస్తున్నారు. భవిష్యత్తు వాస్తునిర్మాణ రంగానికి సంబంధించి ఓ అధ్యయన గ్రంథం ఈ భవనం.
సముద్ర పుష్పాల తీరులో...
అన్ని సముద్రాల్లోకీ లోతైనది పసిఫిక్ మహాసముద్రం. ఈ సముద్రంలో 500 మీటర్ల లోతులో ఏర్పడే ‘వీనస్ ఫ్లవర్ బాస్కెట్’ స్ఫూర్తితో లండన్‌లో 40 అంతస్థుల భవనాన్ని నిర్మించారు. అదే ‘గెర్కిన్’. లండన్‌లో తొలి పర్యావరణహిత ఎత్తైన భవనంగా ఇది పలు రికార్డులను సొంతం చేసుకుంది. ‘గెర్కిన్’ అనేది ఓ దోస సంబంధ కూరగాయ. దాని స్ఫూర్తితోనే చూడముచ్చటైన వ్యాపార సముదాయ భవనాన్ని నిర్మించారు. అయితే ఈ భవనంలోకి ప్రవేశించాలంటే ముందుగా అనుమతి పొందాలి. దీనిని అధిక భాగం ఉక్కుతో నిర్మించారు.
ఈడెన్ ప్రాజెక్ట్..
ప్రస్తుతం ఎకో టూరిజం పెరిగింది. ఇంగ్లండ్‌కి వెళ్లే టూరిస్టులు అంతా ‘ఈడెన్ ప్రాజెక్టు’కు క్యూ కడుతున్నారు. అక్కడ ఎంత సేపు ఉన్నా తనివి తీరదు. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్దదైన గ్రీన్ హౌజ్ ఈడెన్ ప్రాజెక్ట్. వేల సంఖ్యలో పచ్చని మొక్కలను ఒకేసారి చూసే చక్కని అవకాశం ఇక్కడ కలుగుతుంది. కార్న్‌వాల్ ప్రాంతంలోని ఈ భవన సముదాయానికి స్ఫూర్తి సబ్బు నురగలంటే ఆశ్చర్యమేస్తుంది. ఈడెన్ ప్రాజెక్టును మధ్యధరా, వర్షారణ్య బయోమ్‌లుగా... రెండు విభాగాలుగా విభజించారు. పేరుకు తగినట్లే రెండింట్లో వేర్వేరు వాతావరణాలుంటాయి. ఇంకా ప్లాస్టిక్, స్టీల్‌తో షడ్భుజి, పంచభుజి ఆకారాల్లో ఫ్రేమ్‌లే ఈ బయోమ్‌ల ప్రధాన ఆకర్షణ. అందుకే ‘నేల మీది అద్భుతం... ఈడెన్’ అని చూసిన వాళ్లంతా మెచ్చుకుంటుంటారు. ఈ పచ్చని పరిసరాల్లో సభలూ, సమావేశాలే కాదు పెళ్లిళ్లు చేసుకుంటున్న వాళ్ల సంఖ్యా రోజురోజుకీ పెరుగుతోంది.
కంటిపాప..

ప్రపంచం అంతా గొప్పగా కీర్తించే భవనం ప్యారిస్‌లోని ‘అరబ్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్’. పంతొమ్మిది అరబ్ దేశాలు కలిసి కంటిపాప స్ఫూర్తితో ఈ భవనాన్ని నిర్మించడం విశేషం. ఈ భవనాన్ని ఉత్తర, దక్షిణ ముఖాలుగా అభివర్ణించవచ్చు. వీటిని గాజు, అల్యూమినియంతో రూపొందించారు. ఉత్తర ముఖం సీన్ నదికి అభిముఖంగా ఉంటుంది. దక్షిణ ముఖభాగమంతా 240 ఫొటో సెన్సిటివ్ డయాఫ్రమ్‌లను అమర్చారు. ఇవన్నీ ఏకమై కంటిపాపలా... ఇంకా చెప్పాలంటే కెమెరా లెన్సులా పనిచేస్తుంది. సూర్యరశ్మి ఆధారంగా తెరచుకుంటుంది, మూసుకుంటుంది. అందుకే లోపలా, బయటా అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఈ మ్యాజిక్‌ను చూసేందుకే అక్కడికి వెళతారు పర్యాటకులు.
రక్షణ కవచం..

‘సింగపూర్ బే’లో విశేషంగా ఆకట్టుకునే నిర్మాణం ‘ఎస్‌ప్లానేడ్ థియేటర్’. తొలిచూపులో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. థియేటర్ కదా... ఏడాది పొడవునా నాటకాలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. భవనం లోపలికి వెళితే ఆశ్చర్యం... గాలీ, వెలుతురూ ధారాళంగా ప్రసరిస్తుంది. కానీ ఎండ సూటిగా పడదు. ఎందుకంటే ఈ భవన నిర్మాణమే విశిష్టమెనది. ‘రాజ పనస’ పండు స్ఫూర్తితో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ పండులో పై పొట్టు ముళ్లతో మందంగా ఉంటూ లోపల గింజలను సంరక్షిస్తుంటుంది. అలాగే ఈ భవనం కూడా. దీని చుట్టూ త్రిభుజాకారంలో ఉన్న కిటీకీలు, వంపులుగా ఉన్న ఫ్రేమ్‌లు సూర్యరశ్మికి తగినట్టుగా స్పందిస్తుంటాయి. అందుకే వెలుతురు ఉంటుంది. కానీ ఎండ పడదు. వింతైన ఆ డిజైన్‌కు హాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు
చిరిగిన జీన్స్.. స్లీవ్‌లెస్ పై నిషేధం
Read Latest Telangana News and National News