Divorce over Pets Fight: పెంపుడు జంతువుల మధ్య పోట్లాట.. విడాకులకు సిద్ధమైన యువ జంట
ABN , Publish Date - Sep 21 , 2025 | 04:14 PM
పెంపుడు జంతువల మధ్య పోట్లాట కారణంగా ఓ యువ జంట విడాకులకు సిద్ధమైంది. ఫ్యామిలీ కోర్టను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ జంట కాపురాన్ని నిలబెట్టేందుకు కౌన్సిలర్ విశ్వప్రయత్నం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి యువతరం దృష్టిలో పెళ్లి, విడాకులు ఎంతటి సాధారణ విషయాలో కళ్లకు కట్టినట్టు చెప్పే ఓ షాకింగ్ ఘటన భోపాల్‌లో (మధ్యప్రదేశ్) వెలుగు చూసింది. పెంపుడు జంతువుల కారణంగా ఓ యువ జంట.. విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. పెళ్లై ఏడాది కూడా కాక మునుపే విడాకులు తీసుకునేందుకు నిశ్చయించుకుంది. విడాకుల కోసం వారు చెబుతున్న కారణాలు ప్రస్తుతం అనేక మందిని నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి (Bhopal divorce Pet Fights).
ఈ జంటది ప్రేమ వివాహం. యువకుడికి భోపాల్ కాగా, యువతి యూపీకి చెందినది. గతేడాది డిసెంబర్‌లో వారి వివాహం జరిగింది. యువకుడి వద్ద అప్పటికే ఓ పెంపుడు కుక్క, కుందేలు, ఫిష్ ట్యాంక్ ఉన్నాయి. యువతికి కూడా జంతు ప్రేమ ఎక్కువే. ఆమె పిల్లిని పెంచుకుంటోంది. అసలు ఈ జంతు ప్రేమే వారిద్దరినీ మొదట్లో దగ్గర చేసింది. ఇక పెళ్లి తరువాత యువతి తన పిల్లిని తీసుకుని భర్త వద్దకు వచ్చేసింది. మొదట్లో వారి కాపురం సజావుగానే సాగింది. కానీ కుక్క, పిల్లి మధ్య జాతి వైరం.. యువ దంపతుల ఏడు జన్మల బంధాన్ని తెగిపోయే స్థితికి తెచ్చింది (wife’s cat vs husband’s dog).
భర్త పెంపుడు కుక్క తన పిల్లిపై నిత్యం మొరుగుతూ ఉండటంతో భార్యకు మండిపోయింది. కుక్క కారణంగా పిల్లికి కంటిమీద కునుకు లేకుండా పోయిందని, తిండి కూడా మానేసిందని చెప్పుకొచ్చింది. భర్తేమో భార్య పెంపుడు పిల్లిపై ఫిర్యాదు చేశాడు. ఎప్పుడూ తన ఫిష్ ట్యాంక్ వద్ద కూర్చుని నీటిలోని చేపలను తినేసేలా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కుక్కపై ఆ పిల్లి పలు మార్లు దాడి చేసిందని కూడా వాపోయాడు. చివరకు ఈ జంతువుల మధ్య వైరం భార్యాభర్తల మధ్య కలహాలకు దారితీసింది. దీంతో, ఇద్దరూ విసిగిపోయి విడాకులకు సిద్ధమయ్యారు. ఇద్దరూ తమ పెంపుడు జంతువులను వదులుకోలేక చివరకు తామే విడిపోవడం బెటరని డిసైడయ్యారు.
అయితే, ఈ జంటకు ప్రస్తుతం ఓ ఫ్యామిలీ కౌన్సిలర్ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘వాళ్లకు పెళ్లయ్యి ఏడు నెలలే. ఇద్దరికీ పెంపుడు జంతువులంటే ఇష్టం. కొంత కాలంగా ఈ విషయంలో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికి ఒక పర్యాయరం కౌన్సెలింగ్ ఇచ్చి పంపాము. అక్టోబర్‌లో మరోసారి కౌన్సెలింగ్‌కు రమ్మన్నాము’ అని కౌన్సెలర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
అమెరికా కల నెరవేరిందని సంబరపడుతూ టెకీ పోస్టు.. దీన్ని ట్రంప్ చూస్తే..
కాలుపైకాలేసి స్కూటీపై కూర్చుని డ్రైవింగ్.. పోతావ్ జాగ్రత్త అంటున్న జనాలు