Bappi Lahiri gets Threat: ఆ 'గోల్డ్ మ్యాన్'కు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్.!
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:42 PM
భారీగా బంగారు ఆభరణాలు ధరించి వైరల్ అయిన రాజస్థాన్ వాసి 'బప్పి లహిరి ఆఫ్ చిత్తోర్‌గఢ్'కు ఇటీవల గ్యాంగ్ స్టర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అతడు.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అసలేమైందంటే...
ఇంటర్నెట్ డెస్క్: బంగారమంటే మక్కువతో సుమారు మూడున్నర కిలోల బంగారం ధరించి.. 'బప్పి లహిరి ఆఫ్ చిత్తోర్‌గఢ్'గా గుర్తింపు పొందిన కన్హయ్యలాల్ ఖాతిక్‌కు ఓ గ్యాంగ్‌స్టర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఖాతిక్ తెలిపారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు ఖాతిక్.
ఇదీ జరిగింది..
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన పండ్ల వ్యాపారి అయిన కన్హయ్యలాల్ ఖాతిక్.. బంగారం మీద మక్కువతో మూడున్నర కిలోల బంగారం ధరించి 'చిత్తోర్‌గఢ్ బప్పి లహిరి'గా గుర్తింపు పొందాడు. ఇలా బంగారం ధరించి ట్రోల్ అయి.. గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఛిత్తోర్‌గఢ్‌గానూ వైరల్ అయ్యాడు. అయితే.. ఇతడికి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ.. ఫోన్ రావడంతో కంగుతిని వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. 'నా మొబైల్‌కు రెండు రోజుల క్రితం ఓ మిస్డ్ కాల్ వచ్చింది. తర్వాత అదే నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. నేను సమాధానం ఇవ్వకపోవడంతో.. రూ.5 కోట్ల డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తూ ఓ ఆడియో రికార్డింగ్‌ను పంపారు. కాల్ చేసిన వ్యక్తి తన డిమాండ్ నెరవేర్చకపోతే బంగారం ధరించే స్థితిలో నువ్వు ఉండవు'అని హెచ్చరించినట్టు పోలీసులకు చెప్పారు ఖాతిక్.
ఈ విషయాన్ని గుట్టుగా పరిష్కరించుకోవాలని వారు కోరారని కూడా ఖాతిక్ తెలిపాడు. అయితే.. ఇంతలో మరోసారి ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన ఖాతిక్.. సిటీ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదరాపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఎవరీ రోహిత్ గోదరా?
బికనీర్‌లోని లునాకరన్‌కు చెందిన గోదరా.. ప్రస్తుతం కెనడాలో ఉన్నట్టు సమాచారం. దేశ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో అతడిపై సుమారు 32కు పైగా కేసులున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. రోహిత్.. రాజస్థాన్‌లోని వ్యాపారవేత్తలపై ముఠా దోపిడీలకు పాల్పడేవాడు. సంచలనం సృష్టించిన రాపర్ సిద్ధూమూస్ వాలా హత్య కేసు నిందితుల్లో రోహిత్ కూడా ఒకరు. సికార్‌లో జరిగిన గ్యాంగ్‌స్టర్ రాజు తెహత్ హత్య కేసులోనూ అతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇలా పలు కేసుల్లో ప్రధాన నిందితుడైన రోహిత్.. 2022 జూన్ 13న పవన్ కుమార్ అనే పేరిట నకిలీ పాస్‌పోర్ట్ సృష్టించుకుని.. ఢిల్లీ నుంచి దుబాయ్‌కు చెక్కేశాడు. దీంతో అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ సర్క్యులర్ జారీ అయింది.
ఇవీ చదవండి:
కూలుతున్న భవిష్యత్ తరం!