Mizoram Autowallah: ఆటోలో 17 లక్షలు మర్చిపోయిన వ్యాపారి.. ఆటోవాలాకు విషయం తెలిసి..
ABN , Publish Date - Jun 21 , 2025 | 09:44 AM
తన ఆటోలో 17 లక్షల నగదు మర్చిపోయిన ఓ కస్టమర్‌కు ఆ డబ్బును తిరిగిచ్చి తన నిజాయతీని చాటుకున్నాడో ఆటోవాలా. మిజోరంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Mizoram Autowallah Returns 17 lakh: ప్రపంచంలో అక్రమాలు అన్యాయాలు పెరిగిపోతున్నాయని బాధపడే వారు కోకొల్లలు. నీతినిజాయతీలు తగ్గిపోయాయని, మానవత్వం నశించిపోయిందని విచారం వ్యక్తం చేస్తుంటారు. అయితే, లోకంలో మంచి మిగిలే ఉందని కొందరు అప్పుడప్పుడూ రుజువు చేస్తుంటారు. నిజాయితీకి నిలువెత్తు రూపంలా నిలుస్తూ జనాల్లో స్ఫూర్తిని నింపుతుంటారు. అలాంటి ఓ ఆటోవాలాపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడి నీతి నిజాయితీలను చూసి జనాలు వేనోళ్ల పొగుడుతున్నారు.
మిజోరాంలో ఈ ఘటన వెలుగు చూసింది. మయాన్మార్‌కు చెందిన ఓ వ్యాపారి లాంగ్‌టాయ్ ప్రాంతంలో గురువారం రాత్రి ఆటోలో ప్రయాణించారు. తన హోటల్ వద్ద దిగాక నగదును ఆటోలోనే మర్చిపోయారు. ఏకంగా రూ.17 లక్షలు ఉన్న పాలిథీన్ బ్యాగ్ ఆటోలోనే ఉండిపోయింది.
ఇక హోటల్‌కు చేరుకున్నాక గానీ సదరు వ్యాపారికి తన డబ్బు విషయం గుర్తుకు రాలేదు. డబ్బును ఎక్కడ పెట్టిందీ చప్పున గుర్తురాక ఆయన హోటల్ సిబ్బంది సాయం తీసుకున్నారు. అంతా కంగారుగా హోటల్‌లో వెతకసాగారు. ఈలోపు ఆటోవాలా లాల్మింగ్‌మువానాకు ఆటోలో వ్యాపారి డబ్బు కనిపించింది.
దీంతో అతడు వెంటనే ఆ డబ్బును తీసుకుని హోటల్‌కు వచ్చాడు. పోయిందనుకున్న డబ్బు తిరిగి దక్కడంతో ఆ వ్యాపారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. సంతోషం పట్ట లేక ఆటోవాలాకు నజరానా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. కానీ లాల్మింగ్‌మువానా మాత్రం వ్యాపారి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. కస్టమర్లు ఆటోలో మర్చిపోయిన వస్తువులను తిరిగివ్వడం తన బాధ్యత అని సవినయంగా చెప్పి వెనుదిరిగాడు. కాగా, ఈ విషయంపై స్థానిక ఆటో డ్రైవర్ల అసోసియేషన్ కూడా స్పందించింది. లాల్మింగ్‌మువానా నిజాయతీని ప్రశంసించింది.
ఇక ఈ ఉదంతం నెట్టింట కూడా వైరల్ అవుతోంది. జనాలు ఆటోవాలాను పెద్ద ఎత్తున పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. నీతినిజాయితీలకు అతడు నిలువెత్తు నిదర్శనమంటూ వేనోళ్ల ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
12 వేల మంది అభ్యర్థులు.. ఒక్కరికీ జాబ్ ఇవ్వని సంస్థ.. ఎందుకో తెలిస్తే..
అతడు అబద్ధం చెబుతున్నాడు.. విమాన ప్రమాద బాధితుడిపై నటి షాకింగ్ కామెంట్స్