AI: 12 వేల మంది అభ్యర్థులు.. ఒక్కరికీ జాబ్ ఇవ్వని సంస్థ.. ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - Jun 15 , 2025 | 09:44 PM
450 మంది ఉద్యోగార్థులను ఇంటర్వ్యూలకు పిలిచిన ఓ సంస్థ ఒక్కరినీ ఎంపిక చేయలేక లబోదిబో మంటూ నెట్టింట ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: టెక్ జాబ్ కోసం 12 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఒక్కరినీ ఎంపిక చేయలేక చతికిల పడ్డ ఓ కంపెనీ నెట్టింట తన ఆవేదన వెలిబుచ్చింది. ఏఐ ఇచ్చే కోడ్‌ను కాపీ కొట్టడం మినహా అభ్యర్థులెవరికీ కోడింగ్ వెనకున్న లాజిక్‌పై అవగాహన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఉద్యోగుల ఎంపికకు తాము అనుసరిస్తున్న విధానం సరైనదేనా అని ప్రశ్నిస్తూ రెడిట్‌లో ఓ పోస్టు పెట్టింది. కంపెనీ పేరు వంటి వివరాలు చెప్పకుండా పెట్టిన ఓ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
జూనియర్ బ్యాకెండ్ ఫ్రంటెండ్, క్యూఏ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చినట్టు తెలిపింది. మొత్తం 12 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపింది. వీరిలో 450 మందిని ఇంటర్వ్యూకు పిలిచినట్టు పేర్కొంది. ఇంటర్వ్యూల్లో అభ్యర్థులకు చాట్‌జీపీటీ వినియోగించేందుకు కూడా అవకాశం ఇచ్చినట్టు తెలిపింది. అయితే, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడిగితే మాత్రం అనేక మంది చెప్పలేకపోయారని పేర్కొంది. చాట్‌జీపీటీ నుంచి కోడ్‌ను కాపీ పేస్ట్ చేయడం మినహా ఒక్కరికీ కోడ్ వెనకున్న లాజిక్‌కు అర్థం తెలియదని విచారం వ్యక్తం చేసింది. అసలు తమ ఉద్యోగనియామకాల ప్రక్రియలోనే లోపం ఉందా అని జనాలను ప్రశ్నించింది. సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అధిక శాతం మంది కంపెనీ తీరును విమర్శించారు. కంపెనీ అనుసరిస్తున్న నియామక ప్రక్రియలోనే తప్పు ఉందని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో కంపెనీకి చెందిన రిక్రూట్‌మెంట్ టీమ్ పొరపాటు పడిందని అన్నారు. ఇంటర్వ్యూలో 450 పని గంటలు వృథా చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదని అన్నారు. అభ్యర్థులను తప్పుపట్టి ప్రయోజనం లేదని అన్నారు. వాస్తవాలు, ఊహలకు మధ్య పొంతలేనట్టు కనిపిస్తోందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.
ఇవి కూడా చదవండి:
భారీ స్కామ్.. ఫ్లైట్ అటెండెంట్‌గా నటించి ఉచిత విమాన ప్రయాణాలు
ఈ అంబులెన్స్ డ్రైవర్ టాలెంటే వేరబ్బా.. ఎలా డ్రైవ్ చేశాడో చూస్తే..